ట్రంప్ ఎఫెక్ట్.. 15 వేల మంది భారతీయులు వెనక్కు..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికార పీఠం చేజిక్కించుకున్నాక అక్రమ వలసదారులను టార్గెట్ చేస్తున్నారు. ప్రస్తుతం అమెరికా చరిత్రలోనే అతిపెద్ద అక్రమ వలసదారుల బహిష్కరణ ఆపరేషన్ జరుగుతోంది. అక్రమంగా ఉంటున్న వారిని గుర్తించి ఆయా దేశాలకు ప్రత్యేక విమానాల్లో పంపిస్తున్నారు అక్కడి అధికారులు. తాజాగా భారత్‌కు చెందిన అక్రమ వలసదారులతో కూడిన మిలటరీ విమానం సీ-17 భారత్‌కు వచ్చిన విషయం తెలిసిందే. అందులో 205 మంది భారతీయులు ఉన్నారు.
అయితే తాజాగా ఇదే విషయంపై విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ మాట్లాడారు. ఇలా భారతీయులను వెనక్కు పంపడం అమెరికాకు కొత్తేమీ కాదని వ్యాఖ్యానించారు. ఈ మేరకు గత 15 ఏళ్లలో మొత్తం ఎంతమంది భారతీయులను అమెరికా వెనక్కు పంపిందో లిస్ట్ ప్రకటించారు. ఆ లిస్ట్ ప్రకారం 2009 నుంచి ఇప్పటివరకు 15,756 మందిని వెనక్కు పంపించినట్లు అధికారికంగా పేర్కొన్నారు. ఈ మేరకు రాజ్యసభలో ఈ లెక్కలు బయటపెట్టారు జైశంకర్.

"భారతీయులను ఇలా వెనక్కు పంపించడం అమెరికాకు కొత్తేమీ కాదు. ఏళ్లుగా ఇదే సాగుతోంది. ఇది భారత్ కే కాదు. మిగతా దేశాల ప్రజలనూ పంపిస్తున్నారు. అక్రమ వలసదారులను అరికట్టాలి. భారత అక్రమ వలసదారులపై సానుకూలంగా వ్యవహరించాలని అమెరికా అధికార యంత్రాంగంతో చర్చలు జరుగుతున్నాయి" అని విదేశాంగ మంత్రి జైశంకర్ తెలిపారు.
జైశంకర్ బయటపెట్టిన లెక్కల ప్రకారం.. 2019లో 2,042 మంది, 2020లో 1,889 మంది అక్రమ వలసదారులను భారత్ కు పంపించారు. 2009లో 734, 2010లో 799, 2011లో 597, 2012లో 530, 2013లో 515, 2014లో 591, 2015లో 708, 2016లో 1,303, 2017లో 1,024, 2018లో 1,180,2019లో 2,042,2020లో 1,889, 2021 లో 805, 2022లో 862, 2023లో 617, 2024లో 1,368, 2025 ఫిబ్రవరి వరకు 104 మందిని భారత్ కు తరలించారు.
వలసదారుల చేతికి బేడీలు..
అమెరికాలోని భారత అక్రమ వలసదారులకు అక్కడి అధికారులు బేడీలు వేసి చిత్రహింసలకు గురిచేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి. వారిని క్రిమినల్స్ మాదిరిగా ట్రీట్ చేస్తున్నట్లు సమాచారం. ఇదే విషయంపై ప్రతిపక్షాలు పార్లమెంట్ లో ప్రధాని మోదీ ప్రభుత్వాన్ని నిలదీశాయి. అమెరికా అధికార యంత్రాంగంతో మాట్లాడి వారిని మానవతా దృక్పథంతో ట్రీట్ చేయాలని కోరాలని డిమాండ్ చేశాయి.












Click it and Unblock the Notifications