హెచ్-1బి వీసా: ట్రంప్ వ్యాఖ్యలపై ఫేస్‌బుక్ సీఈఓ
వాషింగ్టన్: అమెరికాలో ఉన్న నిరుద్యోగులకు మరిన్ని అవకాశాలను కల్పించాల్సి ఉందని, హెచ్-1బి వీసాలపై దేశంలోకి వస్తున్న వారి కనీస వేతనాలను పెంచాలని డిమాండ్ చేసిన డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలపై ఫేస్‌బుక్ సీఈఓ మార్క్ జూకర్స్‌బర్గ్ మండిపడ్డారు. ట్రంప్ వీసా విధానం అమెరికన్ నాయకత్వంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుందని, కొత్త ఔత్సాహికతలపై ప్రభావం పడుతుందన్నారు.
అంతేకాకుండా అమెరికన్ ఖజానాపై 400 నుంచి 500 బిలియన్ డాలర్ల భారం పడుతుందని అభిప్రాయపడ్డారు. కాగా, మార్క్ జూకర్స్‌బర్గ్ సహా, సిలికాన్ వ్యాలీలో ఉన్న ఐటీ కంపెనీలన్నీ హెచ్1-బీ వీసా విధానాన్ని మరింత సరళతరం చేయాలని వాదిస్తున్నారు.
హెచ్ 1బీ వీసాల సంఖ్యను మూడు రెట్లు పెంచాలన్న ఫేస్ బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్ బర్గ్, ఫ్లోరిడా సెనెటార్ మార్కో రుబియోలు చేసిన వ్యాఖ్యలపై అమెరికా అధ్యక్ష బరిలో ఉన్న డొనాల్డ్ ట్రంప్ మండిపడ్డ సంగతి తెలిసిందే. హెచ్1-బీ వీసాలను పొంది అమెరికాకు వెళ్తున్న విదేశీయుల్లో భారతీయులే అధికంగా ఉండటం విశేషం.

దీంతో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఈ హెచ్1-బీ వీసాలపై చర్చ జరగడం భారతీయ ఐటీ ఉద్యోగుల్లో కాస్తంత ఆందోళనకు గురి చేస్తుంది. గత వారంలో డొనాల్డ్ ట్రంప్ అమెరికాలో ఉన్న నిరుద్యోగులకు మరిన్ని అవకాశాలను కల్పించాల్సి ఉందని ఓ ప్రతిపాదన చేశారు.
ఆ ప్రతిపాదన ఏంటంటే హెచ్-1బి వీసాలపై దేశంలోకి వస్తున్న వారి కనీస వేతనాలను పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల అమెరికన్ కంపెనీలు తక్కువ ధరకే ఉపాధి పొందుతున్న విదేశీ ఉద్యోగుల జోలికి పోకుండా, అమెరికన్లకే అవకాశాలు కల్పిస్తారనేది ఆయన అలోచన.
ఇది గనుక అమలైతే నిరుద్యోగ అమెరికన్లకు ఉద్యోగాలు వస్తాయని, ఉద్యోగాల కోసం ఇండియాతో పాటు విదేశాల నుంచి వచ్చే వారి సంఖ్య బాగా తగ్గుతుందని తెలిపారు. అమెరికా చేపట్టాల్సిన ఇమిగ్రేషన్ సంస్కరణల్లో కనీస వేతన పెంపు ఎంతో ముఖ్యమైందని న్యూయార్క్‌కు చెందిన రియల్ ఎస్టేట్ టైకూన్ డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications