ఆండ్రాయిడ్ ఫోన్ల కోసం వేగవంతమైన ‘ఫేస్బుక్ లైట్’
న్యూయార్క్: ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ వ్యవస్థ ఆధారిత స్మార్ట్ ఫోన్లలో ఫేస్బుక్ లోడ్ కావడానికి, అప్ డేట్ కావడానికి ఎక్కువ సమయం పడుతున్న నేపథ్యంలో ఫేస్బుక్ మరో కొత్త యాప్ను ఆవిష్కరించింది. ‘ఫేస్బుక్ లైట్' పేరుతో తయారు చేసిన ఈ ఆండ్రాయిడ్ యాప్ను తక్కువ డేటాతో వినియోగించుకోవచ్చు.
స్మార్ట్ ఫోన్లలో మరింత వేగవంతమైన అనుభూతిని, నెట్వర్క్ నిదానంగా ఉన్నా.. స్ట్రీమింగ్ ఆగకుండా ఉండేలా రూపొందించిన ‘ఫేస్బుక్ లైట్' మార్కెట్లోకి విడుదలైంది. ఈ మేరకు ఫేస్బుక్ సంస్థ సిఈఓ మార్క్ జుకర్ బర్గ్ వెల్లడించారు.
ఈ యాప్ కేవలం 1 మెగాబైట్ కన్నా తక్కువ బరువు ఉంటుందని, కొన్ని సెకన్లలోనే డౌన్లోడ్ చేసుకోవచ్చని జుకర్ బర్గ్ తెలిపారు. ఇంటర్నెట్ బ్యాండ్ విడ్త్ అతి తక్కువగా ఉన్నా.. ఈ యాప్ వేగంగానే నడుస్తుందని ఆయన వివరించారు.
ఆఫ్రికా, లాటిన్ అమెరికా, యూరప్ దేశాల్లో యాప్ను గత జనవరిలో ప్రవేశపెట్టారు. ప్రస్తుతం ఆసియా దేశాల్లో ప్లే స్టోర్ నుంచి దీన్ని డౌన్ లోడ్ చేసుకోవచ్చని వివరించారు.