కూతురు కోసం 2నెలల పాటు జుకర్‌బర్గ్ సెలవు!
న్యూయార్క్: ఫేస్‌బుక్ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ తనకు కూతురు పుట్టిన అనంతరం రెండు నెలల పెటర్నటీ లీవ్ తీసుకోనున్నట్లు ప్రకటించారు. ఆయన భార్య ప్రిసిల్లా చాన్ త్వరలో పాపకు జన్మనివ్వనున్న సంగతి తెలిసిందే.
సిలికాన్ వ్యాలీలో అత్యంత శక్తివంతమైన యూఎస్ ఎగ్జిక్యూటివ్, ఎప్పుడూ బిజీగా ఉండే జుకర్‌బర్గ్ సెలవులపై ఖచ్చితమైన ప్రకటన చేశారు. కాగా, ఫేస్‌బుక్ కంపెనీలో ఉద్యోగులకు తల్లి లేదా తండ్రి ఎవరికైనా బిడ్డ పుట్టిన మొదటి సంవత్సరంలో ఎప్పుడైనా నాలుగు నెలలు వేతనంతో కూడిన సెలవులు తీసుకునే అవకాశం ఉంది.

ఇది వ్యక్తిగత నిర్ణయమని జుకర్‌బర్గ్ తన ఫేస్‌బుక్ పేజీలో పోస్ట్ చేశారు. తాను, ప్రిసిల్లా కూతురు కోసం అన్నీ సిద్ధం చేసుకుంటున్నామని తనతో గడిపేందుకు ఎదురుచూస్తున్నామని జుకర్‌బర్గ్ తెలిపారు.

పాప కోసం సిద్ధం చేసి స్ట్రాలర్, యెల్లో బేబీ కారియర్, పెంపుడు కుక్క ఉన్న ఫొటోను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు జుకర్ బర్గ్. కాగా, జుకర్‌బర్గ్ చేసిన పోస్టుకి కేవలం గంటలోనే 70వేల లైక్స్ వచ్చాయి. ఫేస్‌బుక్‌లో 42 మిలియన్ ఫాలోవర్లను కలిగి ఉన్నారు జుకర్‌బర్గ్.












Click it and Unblock the Notifications