వైద్యం చేయించుకోలేక...15రోజుల చిన్నారిని బతికుండగానే సమాధి చేసిన తండ్రి..
వైద్యం చేయించేందుకు డబ్బులు లేక ఓ కన్నతండ్రి తన పదిహేను రోజుల పసికందును బతికుండగానే సమాధి చేసేశాడు. ఈ విదారకర సంఘటన పాకిస్థాన్ లో చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు.. పాకిస్థాన్ సింధ్ ప్రాంతంలోని నౌషహ్రో ఫిరోజ్లో ఈ విదారకర సంఘటన వెలుగు చూసింది. నౌషహ్రో ఫిరోజ్‌కు చెందిన తయ్యబ్ భార్య పదిహేను రోజుల క్రితం ఓ ఆడశిశువుకు జన్మనిచ్చింది. అయితే, ఆ పసికందుకు పుట్టినప్పటి నుంచే ఆరోగ్యం నిలకడగా లేదు. తయ్యబ్ తన బిడ్డకు చికిత్స చేయించుకులేని నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. బిడ్డకు వైద్యం చేయించుకునేందుకు డబ్బులు లేక ఆ పసికందును వదిలించుకోవాలని చూశాడు. ఈ క్రమంలో పదిహేను రోజుల పసికందును ఒక గోనె సంచిలో పెట్టి, ఆ తర్వాత భూమిని తవ్వి, ఆ శిశువును సజీవ సమాధి చేశాడు.

పుట్టిన శిశువు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు అందడంతో ఈ సంఘటనపై వెంటనే స్పందించిన పోలీసులు దర్యాప్తు ప్రక్రియను చేపట్టారు. అయితే, ఆ పసికందు తండ్రి తయ్యబ్పై పోలీసులకు అనుమానం వచ్చింది. దీంతో అతడిని పట్టుకుని ఆరాతీయగా, విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. చికిత్సకు డబ్బులు లేక, తన పదిహేను రోజుల శిశువును సజీవ సమాధి చేసినట్టు తనే ఒప్పుకున్నాడు.
దీంతో పోలీసులు తయ్యబ్‌ను అరెస్ట్ చేసి కేసు వేశారు. కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఘటనాస్థలంలో తవ్వకాలు చేపట్టి, ఆ శిశువు మృతదేహాన్ని వెలికి తీస్తామని, ఆ తర్వాత వైద్య పరీక్షలు నిర్వహించి మరిన్ని వివరాలు సేకరిస్తామని పోలీసాధికారులు చెప్పుకొచ్చారు. అయితే, పాకిస్తాన్‌లో ఇలాంటి సంఘటనలే గతంలోనూ చాలానే వెలుగు చూసినట్లు తెలుస్తోంది..












Click it and Unblock the Notifications