నాటోలో 31వ దేశంగా చేరిన ఫిన్‌లాండ్: కూటమి సరిహద్దు రెట్టింపుతో రష్యాకు షాక్
బ్రస్సెల్స్: ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న రష్యాకు మరో షాక్ తగిలింది. తాజాగా, నాటో కూటమిలో 31వ సభ్యదేశంగా ఫిన్‌లాండ్ వచ్చి చేరింది. అమెరికా, ఫిన్‌లాండ్ విదేశాంగ మంత్రులు ఈ మేరకు అధికారిక పత్రాన్ని మార్చుకున్నారు. దీంతో నాటోలో ఫిన్‌లాండ్ అధికారికంగా చేరినట్లయింది. నాటో విస్తరణను మొదట్నుంచి వ్యతిరేకిస్తున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కు తాజా పరిణామం ఎదురుదెబ్బగా తగిలినట్లయింది.
రష్యాతో ఫిన్‌లాండ్ 1340 కిలోమీటర్ల మేర సరిహద్దు కలిగి ఉంది. తాజాగా చేరికతో నాటో దేశాలతో రష్యా సరిహద్దు దాదాపు రెట్టింపు కావడం గమనార్హం. ఈ క్రమంలో నాటో విస్తరణను రష్యా భద్రత, జాతీయ ప్రయోజనాల ఉల్లంఘనగా క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ అభివర్ణించారు.

ఫిన్‌లాండ్ లో ఏం జరుగుతుందో నిశితంగా గమనిస్తున్నామని, దాని ఆధారంగా అవసరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అయితే, నాటోలో ఫిన్లాండ్ చేరడంతో అమెరికా తన సైన్యాన్ని ఈ దేశంలో కూడా మోహరించనుంది. దీంతో రష్యా సరిహద్దులో వ్యతిరేక శక్తులు బలంగా మారనున్నాయని ఆ దేశం ఆందోళన వ్యక్తం చేస్తోంది.
ఉక్రెయిన్‌పై సైనిక చర్య ప్రారంభం తర్వాత ఫిన్‌లాండ్ తోపాటు స్వీడన్ కూడా నాటోలో చేరేందుకు ఆసక్తి చూపింది. గత మే నెలలో ఫిన్‌లాండ్ దరఖాస్తు చేసుకోగా.. ఇప్పుడు నాటోలో చేరిక ప్రక్రియ పూర్తయింది. మరోవైపు, స్వీడన్ విషయంలో టర్కీ, హంగరీలు వ్యతిరేకంగా ఉన్నాయి. గతంలో అభ్యంతరం తెలిపిన టర్కీ.. ఇటీవల స్వీడన్ నాటోలో చేరికకు సానుకూలతను వ్యక్తం చేసింది. దీంతో స్వీడన్ కూడా నాటోలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications