ప్రపంచంలోనే సంతోషకరమైన దేశం ఏదో తెలుసా..? భారత్ ఎన్నో స్థానంలో ఉంది..?
ప్రస్తుత డిజిటల్ ప్రపంచంలో ఉరుకులు పరుగుల జీవితం, మారుతున్న జీవనశైలి కారణంగా ఆందోళన, ఒత్తిడి, అసంతృప్తి నేటి సమాజాన్ని పట్టి పీడుతుస్తున్నాయి. కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్ తో కలిసి హాయిగా నవ్వుకునే రోజులు అంతరించిపోయాయి. ఈ క్రమంలో ఓ దేశం మాత్రం వరుసగా ఎనిమిదోసారి ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశంగా టాప్ ప్లేస్ లో కొనసాగుతోంది. ఆ దేశమే ఫిన్లాండ్. మరి.. భారత్ ఎన్నో స్థానంలో ఉందో తెలుసా.. ?
ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశాల జాబితా తాజాగా విడుదలైంది. ఈ రిపోర్టును ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలోని వెల్‌బీయింగ్ రీసెర్చ్ సెంటర్ రిలీజ్ చేసింది. ఈ లిస్టులో మరోసారి ఫిన్లాండ్ అత్యంత సంతోషకరమైన దేశంగా టాప్ ప్లేస్ లో నిలిచింది. ఇలా ఫిన్లాండ్ మొదటి స్థానంలో ఉండటం ఇది వరుసగా ఎనిమిదో సారి కావడం గమనార్హం. ఇక తర్వాతి స్థానాల్లో డెన్మార్క్, ఐస్‌లాండ్, స్వీడెన్ దేశాలు ఉన్నాయి.

భారత్ స్థానం ఎంత..?
ఈ జాబితాలో భారత్ 118 వ స్థానంలో ఉంది. అంటే మొత్తం 147 దేశాలకు గానూ 118వ ర్యాంకు సాధించింది. గతేడాదితో పోలిస్తే ర్యాంకును మెరుగపరుచుకుంది. 2024లో సంతోషకరమైన దేశాల జాబితాలో భారత్ 126వ స్థానంలో ఉంది. ఈ ఏడాది 8 ర్యాంకులు తగ్గి 118 స్థానంలో నిలిచింది. అయితే భారత్ కంటే మెరుగైన స్థానంలో పాకిస్థాన్, ఇరాన్, ఉక్రెయిన్ దేశాలు ఉండటం గమనార్హం. భారతీయుల కంటే ఈ దేశాల్లోని ప్రజలే సంతోషంగా ఉన్నట్లు నివేదిక వెల్లడించింది.
చివరి స్థానంలో అఫ్గానిస్తాన్..
అఫ్గానిస్థాన్ మరోసారి సంతోషకరమైన దేశాల జాబితాలో ఆఖరి స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో అఫ్గాన్ 147వ స్థానంలో ఉంది. పశ్చిమ ఆఫ్రికాలోని సియెర్రా లియోన్(146), లెబనాన్(145) స్థానాల్లో నిలిచాయి.












Click it and Unblock the Notifications