భయంకర ఆకారం : సముద్రంలో హర్రర్ షో చూసినంత పనైంది!
పెర్త్ : సెకండ్ షో సినిమాలు చూసి రావడం ఎంత అలవాటైనా.. అర్థరాత్రి దాటాక రోడ్డుపై ఒంటరిగా నడుచుకుంటూ వస్తోంటే..! ఏదైనా భయంకరమైన ఆకారం ఎదురుపడిందనుకోండి..? స్క్రీన్ మీద చూసొచ్చిన హర్రర్ సినిమా.. కళ్లెదుట కనిపించేయదూ.
అచ్చు ఇలాగే.. అలవాటైన పని.. ఎప్పుడూ వెళ్లే తోవనే.. కదా అనుకున్న ఇద్దరు ఆస్ట్రేలియన్లకు ఓ వింత ఆకారం గుండె బేజారయ్యేలా చేసింది. నడి సముద్రంలో చేపల వేటకు వెళ్లాక జరిగిన ఈ ఘటనతో పై ప్రాణాలు పైనే పోయినంత పనయ్యింది వాళ్లిద్దరికి.

ఇంతకీ అసలు విషయమేంటంటే.. పశ్చిమ ఆస్ట్రేలియాలోని పెర్త్ నగరానికి చెందిన 36 ఏళ్ల మార్క్ వాట్కిన్స్ అతని తండ్రీ చేపలు పట్టే వ్రుత్తిలో కొనసాగుతున్నారు. ఇదే క్రమంలో గత వారం ఇద్దరు కలిసి.. చేపల వేట కోసం పెర్త్ సముద్ర తీరం మీదుగా 25 నాటికల్ మైళ్ల దూరం ప్రయాణించారు. ఏళ్లుగా అలవాటైన పనే కావడంతో.. భయం అనేది వాళ్ల డిక్షనరీలో లేదు.
అయితే ఆ వారం వాళ్లు చూసిన ఓ వింత ఆకారం ఒళ్లు గగుర్పొడిచేలా చేసింది. ఏదో వింత ఆకారం తారసపడడంతో.. ఇద్దరూ కాసేపు ఉక్కిరిబిక్కిరయ్యారు. అయితే చివరికి అదొక మృత తిమింగలమని తేలడంతో ఇద్దరూ ఊపిరి పీల్చుకున్నారు. చనిపోయాక తిమింగలం పొట్టలో భారీగా గ్యాస్ నిండిపోవడంతో ఎయిర్ బెలూన్ లా భారీగా ఉబ్బిపోయింది తిమింగలం.
ముందు ఇదేదో ఏలియన్ తరహా ఆకారమని, ఆ తర్వాత ఎయిర్ బెలూన్ అని ఇద్దరూ భావించినప్పటికీ.. దగ్గరికెళ్లాక పరీక్షించాక గానీ అది మృత తిమింగలం అని నిర్ధారించుకోలేకపోయారు. అనంతరం ఆ వింత ఆకారం ఫోటోలను ఫేస్ బుక్ లో షేర్ చేయడంతో ప్రపంచవ్యాప్తంగా ఇదో హాట్ టాపిక్ గా మారిపోయింది.












Click it and Unblock the Notifications