కొలంబో చర్చి వద్ద తాజా పేలుడు: తప్పిన ప్రాణనష్టం: అయినప్పటికీ..!
కొలంబో: శ్రీలంక రాజధాని కొలంబోలో తాజాగా మరో బాంబు పేలుడు చోటు చేసుకుంది. ఈ పేలుడు వల్ల ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని ప్రాథమికంగా అందిన సమాచారం. ఓ చర్చ్ వద్ద బాంబును గుర్తించిన పోలీసులు, దాన్ని డిఫ్యూజ్ చేస్తుండగా.. ఈ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులు గాయపడినట్లు తెలుస్తోంది. పేలుళ్ల అనంతరం బాంబు స్క్వాడ్ బలగాలు పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. మరిన్ని పేలుళ్లు సంభవించడానికి అవకాశం ఉందంటూ ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి అందిన సమాచారం మేరకు పోలీసులు, బాంబ్ స్క్వాడ్ బలగాలు ప్రత్యేక సాధనాలతో తనిఖీ చేపట్టాయి. కొలంబోలోని అన్ని చర్చ్ ల వద్ద జల్లెడ పట్టాయి.
ఈ సందర్భంగా సింఘే ప్రాంతంలోని చర్చికి సమీపంలో పార్క్ చేసిన వ్యాన్ లో బాంబును గుర్తించారు పోలీసులు. వెంటనే బాంబ్ స్క్వాడ్ కు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న వెంటనే సంఘటనాస్థలానికి చేరుకున్న బాంబ్ స్క్వాడ్ బలగాలు.. దాన్ని నిర్వీర్యం చేస్తుండగా ఒక్కసారిగా పేలిపోయింది. ఈ ఘటనలో ప్రాణాపాయం తప్పినప్పటికీ.. ఇద్దరు పోలీసులు గాయపడినట్లు తెలుస్తోంది. ఈస్టర్ సండే నాడే పేలిపోయేలా బాంబును అమర్చి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

రాజధాని కొలంబో నడిబొడ్డున ఉన్న సెంట్రల్ బస్ స్టేషన్ లో 87 బాంబు డిటొనేటర్లు లభించిన విషయం తెలిసిందే. వాటిని కూడా పోలీసులు సోమవారం నాడే గుర్తించారు. డిటొనేటర్ల శక్తిమంతమైనవని తేల్చారు. వాటన్నింటినీ నిర్వీర్యం చేశారు. అవి పేలి ఉంటే మరో విధ్వంసం సంభవించి ఉండేదని అంటున్నారు పోలీసులు. కొలంబో నడిబొడ్డున ఉన్న పేట్ట ప్రాంతంలో ఉంటుందీ బస్ స్టేషన్. ప్రధాన బస్ స్టేషన్ అదే కావడంతో రోజూ వందలాది మంద ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు.

#UPDATE: Video shows vehicle bomb explosion 45 mins ago as police were trying to defuse a 10th bomb in Colombo, Sri Lanka pic.twitter.com/zN3t2ai1wT
— ELINT News (@ELINTNews) April 22, 2019
అలాంటి బస్ స్టేషన్ టార్గెట్ గా చేసుకుని బాంబు డిటొనేటర్ల ద్వారా విధ్వంసం సృష్టించడానికి అసాంఘిక శక్తులు కుట్ర పన్ని ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. బస్ స్టేషన్ లో అనుమానాస్పదంగా కనిపించిన పెద్ద పెద్ద సంచులను గుర్తించిన కొందరు ప్రయాణికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. డిటొనేటర్లను స్వాధీనం చేసుకున్నారు. వాటిని నిర్వీర్యం చేశారు. శక్తిమంతమైనవని, అవి పేలి ఉంటే పెద్ద ఎత్తున ప్రాణనష్టం సంభవించి ఉండొచ్చని పోలీసులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications