ఇరాన్ కు జి7 దేశాల తీవ్ర హెచ్చరిక!
ఇరాన్ ఇజ్రాయిల్ అమెరికా మధ్య వార్ కొనసాగుతున్న క్రమంలో పశ్చిమ ఆసియాలో ఉద్రిక్త పరిస్థితులు మరింతగా తీవ్రతరమవుతున్నాయి. ఒక పక్క అమెరికాకు, ఇజ్రాయెల్ కు షాక్ ఇచ్చేలా కీలక మౌలిక సదుపాయాలపై ఇరాన్ దాడులు జరుపుతోంది. ప్రస్తుతం ఇరాన్ జరుపుతున్న దాడులను జి7 దేశాలు తీవ్రంగా ఖండించాయి.
ఇరాన్ చర్యలను తీవ్రంగా తప్పు పట్టిన జీ7 దేశాలు
ఈ నేపథ్యంలో కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, యునైటెడ్ కింగ్‌డమ్, అమెరికా దేశాల విదేశాంగ మంత్రులతో పాటు యూరోపియన్ యూనియన్ ప్రతినిధి ఇరాన్ దాడులపైన సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రకటనలో ఇరాన్ చర్యలను తీవ్రంగా తప్పు పట్టారు. ప్రాంతీయ శాంతి భద్రతలకు ఇవి తీవ్రమైన ముప్పుగా మారుతున్నాయని పేర్కొన్నారు.

ప్రపంచ భద్రతపై జీ7 దేశాల ఆందోళన
ఇరాన్ మరియు దాని మద్దతుతో పనిచేస్తున్న ప్రాక్సీ గ్రూపులు పశ్చిమ ఆసియాలోని పలు దేశాలపై దాడులు జరుపుతున్నాయని, ఈ చర్యలు కేవలం లక్ష్యదేశాలకే కాకుండా మొత్తం ప్రపంచ భద్రతను కూడా ప్రభావితం చేస్తున్నాయని జి7 దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ముఖ్యంగా శక్తి, రవాణా వంటి కీలక మౌలికవసతులపై దాడులు జరగడం వల్ల అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందని g7దేశాల విదేశాంగ మంత్రులు పేర్కొన్నారు.
ఇరాన్ సైనిక కార్యాకలాపాలను ఆపాలని జీ7 దేశాల పిలుపు
దాడులను ఎదుర్కొంటున్న దేశాలకు తాము పూర్తి మద్దతు అందిస్తామని జి7 దేశాలు స్పష్టం చేశాయి. అవసరమైన అన్ని విధాల సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నాయి. శాంతి భద్రతలను కాపాడటంలో అంతర్జాతీయ సమాజం ఏకాభిప్రాయంతో ముందుకు సాగాలని కూడా g7 దేశాలు పిలుపునిచ్చాయి. అదే సమయంలో ఇరాన్ తక్షణమే తన సైనిక కార్యకలాపాలను నిలిపివేయాలని, ఉద్రిక్తతలను తగ్గించే చర్యలు చేపట్టాలని హెచ్చరికలు జారీ చేశారు.
అవసరమైతే మరిన్ని చర్యలు తీసుకునే విషయంలో వెనుకాడం
దక్షిణాసియాలో ఇప్పటికే ఉద్రిక్తతలు నెలకొన్న సమయంలో తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. శాంతి, స్థిరత్వం కోసం అన్ని దేశాలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని g7 దేశాలు పిలుపునిచ్చాయి. సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని జి7 దేశాలు సూచించాయి. ప్రస్తుతం పరిస్థితులను దగ్గరగా గమనిస్తున్నామని, అవసరమైతే మరిన్ని చర్యలు తీసుకునే విషయంలో కూడా తాము వెనుకాడబోమని స్పష్టం చేశాయి.
జి7 దేశాల హెచ్చరికలపై అంతర్జాతీయ వర్గాలలో కీలక చర్చ
అణు కార్యక్రమం, పరోక్ష యుద్ధం ప్రపంచ చమురు సరఫరాలకు ముప్పుగా పరిణమిస్తున్నాయని ఇరాన్‌కు జీ7 తుది హెచ్చరిక జారీ చేసింది.మొత్తంగా, పశ్చిమ ఆసియాలో పరిస్థితులు అత్యంత సున్నితంగా మారుతున్న వేళ, జి7 దేశాల హెచ్చరికలు అంతర్జాతీయ వర్గాలలో కీలక చర్చకు కారణంగా మారాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ తీసుకునే తదుపరి చర్యలు ఏ విధంగా ఉంటాయి అన్న దానిపైన ప్రపంచ దృష్టి కేంద్రీకృతమైంది.












Click it and Unblock the Notifications