161 ఏళ్ల ఇటలీ చరిత్రలో తొలి మహిళా ప్రధాని.. జార్జియా మెలోని జీవిత గాథ
రాజకీయాల్లో వారసత్వం, ఆర్థిక బలం, గాడ్ ఫాదర్లు ఉంటేనే పైకి వస్తారనే అంచనాలను తలకిందులు చేస్తూ.. ఒక సాధారణ మహిళ.. దేశాధినేతగా ఎదిగితే ఎలా ఉంటుందో నిరూపించారు ఇటలీ ప్రధాన మంత్రి జార్జియా మెలోని. ఆమె కథ ఏ సినిమా స్టోరీకి తీసిపోని విధంగా, ఎన్నో కఠినమైన ఘటనలు, ఆశ్చర్యకరమైన మలుపులతో నిండి ఉంది. ఉన్నత కుటుంబ నేపథ్యం కానీ, ఎలాంటి ప్రత్యేక అవకాశాలు కానీ లేకుండానే.. ఒక విచ్ఛిన్నమైన కుటుంబం నుంచి వచ్చి.. రాత్రిక్లబ్ బార్ కౌంటర్ వెనుక పనిచేస్తూ.. ఇటలీలోనే అత్యంత శక్తివంతమైన నాయకురాలిగా ఎదిగిన మెలోని ప్రస్థానం ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తుంది. ఆమె జీవితంలోని అత్యంత ఆసక్తికరమైన, హృదయ విదారకమైన వాస్తవాలను వన్ ఇండియా మీ ముందుకు తెచ్చింది.
జార్జియా మెలోని పోరాటం ఆమె భూమిపైకి రాకముందే ప్రారంభమైంది. ఆమె రాసుకున్న 'ఐ యామ్ జార్జియా' అనే ఆత్మకథలో ఒక షాకింగ్ నిజాన్ని వెల్లడించారు. ఆమె తల్లి అన్నా.. గర్భవతిగా ఉన్నప్పుడు, ఆర్థిక, కుటుంబ పరిస్థితుల వల్ల అబార్షన్ చేయించుకోవాలని డిసైడ్ అయ్యారు. అందుకోసం క్లినిక్‌కు కూడా వెళ్లారు. కానీ, చివరి క్షణంలో ఆమె మనసు మార్చుకుని వెనక్కి వచ్చేశారు. ఆ రోజు తన తల్లి తీసుకున్న సాహసోపేత నిర్ణయానికే తన జీవితం రుణపడి ఉందని మెలోని ఎప్పుడూ గర్వంగా చెబుతుంటారు.

తండ్రి దూరం.. సర్వస్వం బూడిద చేసిన అగ్నిప్రమాదం!
1977 జనవరి 15న రోమ్ టాక్స్ అడ్వైజర్ ఫ్రాన్సిస్కో, నవలా రచయిత్రి అన్నా దంపతులకు జార్జియా జన్మించారు. అయితే, ఆమెకు ఏడాది వయసున్నప్పుడే తండ్రి కుటుంబానికి హ్యాండ్ ఇచ్చి స్పెయిన్‌లోని కెనరీ దీవులకు పారిపోయి మరో పెళ్లి చేసుకున్నారు. దీంతో తల్లి ఒంటరిగానే ఇద్దరు కుమార్తెలను పెంచాల్సి వచ్చింది.
ఆ కష్టాల్లో ఉండగానే జార్జియాకు మూడేళ్ల వయసులో ఊహించని దురదృష్టం ముంచుకొచ్చింది. ఆమె తన అక్క అరియాన్నాతో కలిసి ఇంట్లో ఆడుకుంటూ లైట్లు వేయకుండా కొవ్వొత్తులు వెలిగించారు. ఆ మంటలు కాస్తా దుప్పట్లు, బొమ్మలకు అంటుకుని క్షణాల్లో గది మొత్తం వ్యాపించాయి. ఈ అగ్ని ప్రమాదంలో వారికి ఉన్న సర్వస్వం బూడిదైపోయింది. ఇల్లు కోల్పోయిన ఆ కుటుంబం, గార్బటెల్లా ప్రాంతంలోని తాతయ్య, నానమ్మల ఇంట్లో నేలపై పడుకుంటూ అత్యంత దీనస్థితిని అనుభవించారు.
సీడీల అమ్మకం నుండి నైట్‌క్లబ్ బార్‌టెండర్ వరకు..
టీనేజ్‌లోకి వచ్చేసరికి కాలేజీ చదువుల కోసం ఇంట్లో రూపాయి కూడా లేదని జార్జియా గ్రహించారు. తల్లి నవలలు రాసినా ఆ సంపాదన దేనికీ సరిపోయేది కాదు. దీంతో చిన్న వయసులోనే జార్జియా పని చేయడం మొదలుపెట్టారు. పొట్టకూటి కోసం సీడీలు అమ్మారు, బేబీసిట్టర్‌గా (పిల్లలను చూసుకునే పని) చేశారు. అంతటితో ఆగకుండా, రోమ్‌లోని ప్రసిద్ధ నైట్‌క్లబ్ అయిన పైపర్ క్లబ్ లో బార్‌టెండర్‌గా కూడా ఉద్యోగం చేశారు.
పార్లమెంట్ కంటే బార్ కౌంటరే ఎక్కువ నేర్పింది!
2013లో మెలోని పార్లమెంట్‌లో మాట్లాడుతూ ఒక సంచలన వ్యాఖ్య చేశారు. "నాకు ఏ పార్లమెంటో, ఏ చదువులో నేర్పని నిజ జీవిత పాఠాలను.. బార్ కౌంటర్ వెనుక నిలబడి సాధారణ ప్రజల కష్టాలను చూసి నేర్చుకున్నాను" అని ఆమె గర్వంగా ప్రకటించారు.
15వ ఏటనే రాజకీయ ప్రవేశం.. తిరుగులేని ఎదుగుదల!
తన 15వ ఏటనే మాఫియా జడ్జి పాలో బోర్సెల్లినో దారుణ హత్యకు గురైన 'వియా డి'అమెలియో ఊచకోత' ఘటనతో చలించిపోయిన జార్జియా, ఇక నిశ్శబ్దంగా ఉండలేక 'ఇటాలియన్ సోషల్ మూవ్‌మెంట్ (MSI)' అనే పార్టీలో చేరారు. అక్కడ నుండి ఆమె వెనక్కి తిరిగి చూసుకోలేదు.
- 2004 (27 ఏళ్ల వయసులో): నేషనల్ అలయన్స్ పార్టీకి జాతీయ యువజన అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన తొలి మహిళగా రికార్డ్.
- 2006: తొలిసారి ఇటలీ పార్లమెంట్‌లో అడుగుపెట్టారు.
- 2008: యువజన మంత్రిగా బాధ్యతలు స్వీకరించి, ఇటలీ చరిత్రలోనే అత్యంత పిన్న వయస్కురాలైన క్యాబినెట్ మంత్రిగా నిలిచారు.
ఆ తర్వాత అప్పటి ప్రధాని బెర్లుస్కోనీతో విభేదించి బయటకు వచ్చి 2012లో 'ఫ్రాటెల్లి డి ఇటాలియా' (బ్రదర్స్ ఆఫ్ ఇటలీ) అనే సొంత పార్టీని స్థాపించారు. 2018 ఎన్నికల్లో కేవలం 4.4% ఓట్లు తెచ్చుకున్న ఈ పార్టీ, 2022 నాటికి ఏకంగా 26% ఓట్లతో ఇటలీలోనే అతిపెద్ద పార్టీగా అవతరించింది. అక్టోబరు 22, 2022న మెలోని ఇటలీ 161 ఏళ్ల చరిత్రలోనే 'మొదటి మహిళా ప్రధాన మంత్రి'గా ప్రమాణ స్వీకారం చేసి సరికొత్త చరిత్ర సృష్టించారు.
సంక్లిష్టమైన వ్యక్తిగత జీవితం..
ఆమె పొలిటికల్ లైఫ్ ఎంత సక్సెస్‌ఫుల్లో, పర్సనల్ లైఫ్ అంత సంక్లిష్టంగా సాగింది. 2015 నుండి టీవీ జర్నలిస్ట్ ఆండ్రియా జియాంబ్రునోతో రిలేషన్‌లో ఉన్న ఆమె, వారికి జినెవ్రా అనే కుమార్తె పుట్టిన తర్వాత, కొన్ని కారణాల వల్ల 2023 అక్టోబరులో ఆ బంధానికి ముగింపు పలుకుతున్నట్లు బహిరంగంగా ప్రకటించారు. ఇక చిన్నప్పుడు తనను వదిలేసి వెళ్లిన తండ్రి ఫ్రాన్సిస్కో, 1995లో డ్రగ్స్ కేసులో దొరికి స్పెయిన్ జైలులో 9 ఏళ్లు శిక్ష అనుభవించి, 2012లో కన్నుమూశారు. ప్రస్తుతం ఆమె అక్క అరియాన్నే ఆమెకు పొలిటికల్ సెక్రటేరియట్ హెడ్‌గా, ప్రధాన సలహాదారుగా వ్యవహరిస్తున్నారు.
రికార్డులు బద్దలు కొట్టిన మెలోని..
సగటున 16 నెలలకే ప్రభుత్వం మారిపోయే, అత్యంత అస్థిరమైన రాజకీయాలుండే ఇటలీ దేశంలో (1948 నుండి ఇప్పటివరకు 68 ప్రభుత్వాలు మారాయి).. తన కూటమిని చాకచక్యంగా ఐక్యంగా ఉంచుతూ, ఆధునిక ఇటాలియన్ చరిత్రలోనే 'మూడవ అత్యధిక కాలం పనిచేసిన ప్రధాని'గా జార్జియా మెలోని రికార్డు సృష్టించారు.
దాదాపుగా అబార్షన్‌కు గురైపోవాల్సిన శిశువు స్థానం నుంచి, అగ్నిప్రమాదంలో సర్వస్వం కోల్పోయి నేలపై పడుకున్న చిన్నారి స్థాయి నుండి.. నేడు ఒక అగ్రదేశాన్ని నడిపించే స్థాయికి చేరిన జార్జియా మెలోని నిజమైన కథ, కష్టపడి పనిచేస్తే ఆకాశమే హద్దు అని నిరూపించే ఒక సజీవ సాక్ష్యం!















Click it and Unblock the Notifications