గంటకు 1300 : గూగుల్ డ్రైవర్లకు పండగే
సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్, కారు డ్రైవర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ప్రపంచంలో ఇంతవరకు ఏ సంస్థ ఇవ్వనంత వేతనాన్ని తమ సంస్థలో పనిచేసే డ్రైవర్లకు ఇస్తామని ప్రకటించింది. ఇందుకోసం త్వరలోనే రిక్రూట్ మెంట్లు కూడా జరపనుంది.
డ్రైవర్ ఉద్యోగమైనా..! గూగుల్ లో ఉద్యోగమంటే అంత తేలిక వ్యవహారమేమి కాదు. అందుకే తమ సంస్థలో డ్రైవర్ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకునేవారికి కనీస డిగ్రీ, టైపింగ్ లో నిమిషానికి 40 పదాల స్పీడు తప్పనిసరి అని చెప్తోంది.
డ్రైవర్ ఉద్యోగానికి ఇన్ని కండీషన్స్ ఎందుకు అనుకుంటున్నారా..! ఇక్కడ డ్రైవర్లు చేయాల్సింది కార్లను నడపడం కాదు. డ్రైవర్ లెస్ కార్ల పనితీరును పరిశీలిస్తూ సంస్థకు ఎప్పటికప్పుడు ఫీడ్ బ్యాక్ అందించడం. అందుకే డిగ్రీ, టైపింగ్ స్పీడ్ తప్పనిసరి అన్న నిబంధన పెట్టింది.

డ్రైవర్ లెస్ కారు రోడ్డు మీద ప్రయాణించేటప్పుడు ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉంటున్నారా.. లేరా.. కస్టమర్లకు మరింత మంచి ప్రయాణాన్ని అందించడానికి ఎలాంటి సౌకర్యాలు కల్పించాలి లాంటి అంశాలపై ఎప్పటికప్పుడు ఓ నివేదిక ద్వారా సంస్థకు వివరాలు అందివ్వాలి. రోజుకు 8 గంటల పని సమయం కాగా.. ఇందుకోసం గంటకు రూ.1300 చెల్లించనుంది సంస్థ.
డ్రైవర్ కి ఎలాంటి నేర చరిత్ర ఉండకపోవడం, డ్రైవింగ్ లైసెన్స్ కి సంబంధించి క్లీన్ రికార్డు ఉండడం తప్పనిసరి అంటోంది గూగుల్. రోజుకు 10 వేల నుంచి 15 వేల మైళ్ల దూరాన్ని డ్రైవర్ లెస్ కారులో పర్యవేక్షించాల్సి ఉంటుంది. ఇందుకోసం ఇప్పటికే 57 కార్లను సిద్దం చేసిన గూగుల్, ఇక డ్రైవర్లు రావడమే ఆలస్యం రోడ్డు మీదకు ఎక్కించేయడమే అంటోంది. ఇంత భారీ వేతనాలు ఆఫర్ చేస్తున్న ఈ పోస్టులకు దరఖాస్తులు వెల్లువెత్తడం ఖాయంగా కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications