H-1B visa:లక్కీ డిప్ క్లోజ్, సెకండ్ లాటరీ రద్దు! కొత్త రూల్స్‌తో మారిన సీన్..
అమెరికాలో సాఫ్ట్‌వేర్ కొలువు సాధించాలనే కలలతో హెచ్-1బీ వీసా కోసం ఎదురుచూస్తున్న భారతీయ ఐటీ నిపుణులకు అమెరికా పౌరసత్వ, వలస సేవల సంస్థ (USCIS) గట్టి షాక్ ఇచ్చింది. 2027 ఆర్థిక సంవత్సరానికి (FY 2027) సంబంధించి ఎలాంటి రెండో విడత వీసా లాటరీ నిర్వహించబోవడం లేదని అధికారికంగా స్పష్టం చేసింది. సాధారణంగా మొదటి విడతలో వీసాల కోటా భర్తీ కానప్పుడు రెండో విడత లాటరీ తీయడం ఆనవాయితీ. కానీ, ఈసారి మొదటి విడతలోనే నిర్దేశిత వీసాల సంఖ్య పూర్తిగా నిండిపోవడంతో ఆ తదుపరి ప్రక్రియకు తెరదించారు.
నిబంధనల ప్రకారం.. జనరల్ కేటగిరీ కింద కేటాయించిన 65,000 వీసాలతో పాటు, అమెరికాలో ఉన్నత చదువులు చదివిన వారికి ఇచ్చే 20,000 మాస్టర్స్ క్యాప్ వీసాల కోటా పూర్తిగా భర్తీ అయిపోయినట్లు USCIS శనివారం ఒక ప్రకటనలో వెల్లడించింది. సరిపడా దరఖాస్తులు (పెటిషన్లు) ఇప్పటికే వచ్చేయడంతో రెండో లాటరీ అవసరం లేకుండా పోయిందని స్పష్టం చేసింది.

తగ్గిన దరఖాస్తులు.. అయినా నిండిన కోటా..
ట్రంప్ ప్రభుత్వం తీసుకొచ్చిన కఠిన నిబంధనల వల్ల ఈసారి దరఖాస్తుల సంఖ్య భారీగా తగ్గింది. 2026 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 3.43 లక్షలకు పైగా దరఖాస్తులు రాగా, ఈసారి (2027 ఆర్థిక సంవత్సరానికి) కేవలం 2,11,600 రిజిస్ట్రేషన్లు మాత్రమే నమోదయ్యాయి. దరఖాస్తులు ఇంతలా తగ్గాయి కాబట్టి, మొదటి విడతలో ఎంపికైన చాలామంది కంపెనీలు వెనక్కి తగ్గుతాయని, తద్వారా రెండో లేదా మూడో విడత లాటరీకి అవకాశం ఉంటుందని నిపుణులు అంచనా వేశారు. కానీ, ఆ అంచనాలను తలకిందులు చేస్తూ కోటా మొత్తం ఒకేసారి ప్యాక్ అయిపోయింది.
రూ.లక్ష డాలర్ల ఫీజు.. శాలరీ బేస్ సెలక్షన్
ఈ ఏడాది హెచ్-1బీ వీసా ప్రక్రియలో అమెరికా ప్రభుత్వం రెండు సంచలన మార్పులు తీసుకొచ్చింది. చరిత్రలోనే మొదటిసారిగా సాంప్రదాయ 'రాండమ్ లాటరీ' (లక్కీ డిప్) విధానాన్ని పక్కనబెట్టి, ఎక్కువ జీతం ఉన్న ఉద్యోగాలకే మొదటి ప్రాధాన్యం ఇచ్చేలా 'వేతన ఆధారిత లాటరీ' (Wage-based lottery) విధానాన్ని ప్రవేశపెట్టింది. దీనికి తోడు, ప్రతి హెచ్-1బీ దరఖాస్తుపై ఏకంగా 1,00,000 డాలర్ల (దాదాపు రూ.84 లక్షలకు పైగా) భారీ ఫీజును కంపెనీలపై మోపింది.
ఈ భారీ ఫీజు భారం కారణంగా కంపెనీలు చాలా జాగ్రత్తగా, అత్యంత అవసరమైన కీలక ఉద్యోగుల కోసమే దరఖాస్తులు చేశాయి. లాటరీలో పేరు వచ్చినా ఇంత భారీ మొత్తం కట్టి కంపెనీలు పెటిషన్లు దాఖలు చేస్తాయా లేదా అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. కానీ, కంపెనీలు వెనకడుగు వేయకుండా ఫీజులు చెల్లించి మరీ పెటిషన్లు దాఖలు చేయడంతో వీసాల కోటా అనుకున్న సమయం కంటే ముందే క్లోజ్ అయిపోయింది. దీంతో రెండో విడత లాటరీపై ఆశలు పెట్టుకున్న వేలాది మంది ఐటీ అభ్యర్థులకు నిరాశే మిగిలింది.














Click it and Unblock the Notifications