హమాస్ కమాండర్లు హతం: ఇజ్రాయెలియన్ల ఊచకోతకు మూల్యం: ఐడీఎఫ్ సంచలన ప్రకటన..!!
టెల్ అవివ్: ఇజ్రాయెల్- పాలస్తీనా మధ్య ఆరంభమైన యుద్ధం రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతోంది. పాలస్తీనియన్ ఇస్లామిక్ జిహాద్, హమాస్ ఉగ్రవాదుల స్థావరాలనపై ఇజ్రాయెల్ పెద్ద ఎత్తున విరుచుకుపడుతోంది. రాకెట్లను సంధిస్తోంది. గాజా స్ట్రిప్‌పై బాంబుల వర్షాన్ని కురిపిస్తోంది.
గత శనివారం ఆరంభమైందీ యుద్ధం. ఈ వారం రోజుల వ్యవధిలో పెద్ద ఎత్తున ప్రాణ, ఆస్తినష్టం సంభవించింది. ఇజ్రాయెల్- హమాస్ పరస్పర దాడుల్లో ఇప్పటికి 3,200 మందికి పైగా మరణించారు. అదే స్థాయిలో వేలాదిమంది గాయపడ్డారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంటోంది. ఫలితంగా మృతుల సంఖ్య పెరుగుతుందనే అంచనాల ఉన్నాయి. నాలుగు లక్షలమంది నిరాశ్రయులయ్యారు.

తొలుత ఇజ్రాయెల్- పాలస్తీనా సరిహద్దు వెంబడి గాజా సమీప ప్రాంతాల నుంచి హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్‌పై రాకెట్లతో దాడులు చేశారు. సరిహద్దులను దాటుకుని ఇజ్రాయెల్ భూభాగంపైకి చొచ్చుకుని వచ్చారు. సరిహద్దులకు ఆనుకుని ఉన్న పలు ప్రాంతాలను తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు.
దీనితో ఇజ్రాయెల్ సైన్యం ఎదురుదాడికి దిగింది. ఆపరేషన్ ఐరన్ స్వోర్డ్‌ను ప్రకటించింది. గాజాలోని హమాస్ స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది. వైమానిక దాడులతో నిప్పులు కురిపిస్తోంది. ఎలాంటి కవ్వింపు చర్యలు లేకుండా, శాంతియుత వాతావరణానికి భంగం వాటిల్లేలా హమాస్ వ్యవహరిస్తోందని, దాడులకు పాల్పడిన తీవ్రమైన నేరానికి పాల్పడిందని ఇజ్రాయెల్ హెచ్చరించింది.
దీనికి అనుగుణంగా ఇజ్రాయెల్ హమాస్ స్థావరాలపై విరుచుకుపడుతోంది. హమాస్‌కు చెందిన ఇద్దరు కమాండర్లను మట్టుబెట్టింది. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ వెల్లడించింది. హమాస్ కమాండర్లు అలీ ఖదీ (Ali Qadi), మెరాద్ అబు మెరాద్ (Merad Abu Merad)ను మట్టుబెట్టినట్లు ప్రకటించింది.
ఈ నెల 7వ తేదీన ఇజ్రాయెల్‌లో అలీ ఖదీ- అత్యంత అమానవీయంగా, అనాగరికంగా తమ దేశ పౌరుల ఊచకోతకు పాల్పడ్డాడని తెలిపింది. షిన్ బెట్ సెక్యూరిటీ ఏజెన్సీ, మిలిటరీ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ నిర్వహించిన జాయింట్ ఆపరేషన్‌లో అలీ ఖదీ దుర్మరణం పాలైనట్లు పేర్కొంది. ఈ మేరకు ఓ ట్వీట్ పోస్ట్ చేసింది. హమాస్ నుఖ్బా యూనిట్ అతను కమాండర్‌గా వ్యవహరిస్తున్నట్లు వివరించింది.
అదే సమయంలో గాజా స్ట్రిప్‌పై నిర్వహించిన డ్రోన్ దాడుల్లో హమాస్ ఎయిర్ సిస్టమ్ విభాగం చీఫ్ మెరాద్ అబు మెరాద్ సైతం హతం అయ్యాడని ఐడీఎఫ్ తెలిపింది. హమాస్ మిలిటెంట్లు తమ దేశంపై జరుపుతోన్న వైమానిక దాడులకు అతనే బాధ్యుడని పేర్కొంది. ఈ ఇద్దరు కమాండర్లను అంతమొందించగలిగామని, ఏ ఒక్క హమాస్ మిలిటెంట్‌ను కూడా ప్రాణాలతో వదిలిపెట్టమని హెచ్చరించింది.












Click it and Unblock the Notifications