హ్యాపీ డైవోర్స్ : విడాకుల వేళ.. కేక్ కట్ చేసి.. పాకిస్తాన్ లో విచిత్రం
ఆనంద క్షణాలు ఒక్కొక్కరి జీవితంలో ఒక్కోలా ఉంటాయేమో అనిపిస్తుంది ఇది చదివాక. అంతేమరి.. కొందరు బంధం కలిసిందని ఆనందపడితే, మరికొందరు బంధం తెగిందని సంతోషిస్తారు.
లాహోర్: ఆనంద క్షణాలు ఒక్కొక్కరి జీవితంలో ఒక్కోలా ఉంటాయేమో అనిపిస్తుంది ఇది చదివాక. అంతేమరి.. కొందరు బంధం కలిసిందని ఆనందపడితే, మరికొందరు బంధం తెగిందని సంతోషిస్తారు.
సాధారణంగా మహిళలు భర్త నుంచి విడిపోవడం అంటేనే బాధపడతారు. ఇక విడాకులకు ఎంతమాత్రం ఒప్పుకోరు. ఎంతోమంది మహిళలు భర్త ఎన్ని బాధలు పెట్టినా మౌనంగా భరిస్తారు. ఎవరికీ చెప్పుకోరు. పరువు పోతుందనో, తల్లిదండ్రులు బాధపడతారనో.. అత్తింట్లో నరకం చవిచూస్తున్నా పైకి చిరునవ్వుతో కనిపిస్తారు.

ప్రస్తుతం ఫేస్ బుక్ లో ఫొటోలతో కూడిన ఓ కథనం వైరల్ గా మారింది. అదేమిటంటే.. పాకిస్తాన్ కు చెందిన ఓ మహిళ భర్త నుంచి విడాకులు వచ్చాయన్న ఆనందంలో కేక్ కట్ చేసి తన అప్తులతో సంబరం జరుపుకుంది.
ఆ వేడుకకు సంబంధించిన ఫొటోలు ఆమె తన స్నేహితురాలికి పంపగా, సదరు స్నేహితురాలు వాటిని గత వారం తన ఫేస్ బుక్ పేజీలో పెట్టింది. దీంతో ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

వివరాల్లోకి వెళితే... పాకిస్తాన్ లోని లాహోర్ కు చెందిన మహమ్ ఆసిఫ్ అనే యువతి తన భర్త వేధింపులు భరించలేక విడాకులు కావాలని కోర్టుకెక్కింది. ఈ కేసులో మధ్యనే ఆమె భర్త నుంచి కోర్టు విడాకులు మంజూరు చేసింది.
ఈ విషయం తెలియగానే భర్త పీడ విరగడైందన్న సంతోషంతో మహమ్ ఎగిరి గంతేసింది. కష్ట కాలంలో ఆమెకు తోడుగా నిలిచిన ఆమె స్నేహితురాలు జవేరియా విర్క్ కేక్ తెప్పించింది. సన్నిహితులు కూడా తోడయ్యారు. ఇంకేముంది.. 'హ్యాపీ డైవోర్స్' అన్న నినాదం హోరెత్తింది.

దీని గురించి ఆసిఫ్ మాట్లాడుతూ.. ఆ క్షణాల్లో తాను ఏమాత్రం బాధపడకూడదనే తన స్నేహితురాలు జవేరియా కేక్ తెప్పించిందని పేర్కొంది. తానూ తొలుత ఆశ్చర్యపోయినా తరువాత ఆ ఆనంద క్షణాలను ఆస్వాదించానని తెలిపింది.
మరోవైపు జవేరియా తన ఫేస్ బుక్ లో పోస్ట్ చేసిన ఈ 'హ్యాపీ డైవోర్స్' పోస్టుకు నెటిజన్లు కూడా బాగానే స్పందిస్తున్నారు. 'ఒక్కోసారి బాధతో కూడిన బంధాన్ని భరించే కంటే ఒదిలించుకోవడమే మంచిది..' అని తమ మెసేజ్ లలో పేర్కొంటూ.. ఆసిఫ్ భావి జీవితం సంతోషంగానే సాగిపోవాలని ఆకాంక్ష వ్యక్తం చేస్తున్నారు. బాగుంది.. ఎవరి ఆనందం వారిది.. కదూ!












Click it and Unblock the Notifications