అప్పుడే 2023లోకి అడుగుపెట్టిన దేశాలివే.: భారత్ తర్వాత ఇంగ్లాండ్, చివరగా అమెరికా
హైదరాబాద్: మరికొద్ది గంటల్లో మనమంతా 2023 సంవత్సరంలో అడుగుపెట్టబోతున్నాం. అయితే, ఇప్పటికే కొన్ని దేశాలు 2023 కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టడం గమనార్హం. ఆయా దేశాల్లో ఇప్పటికే కొత్త సంవత్సరం సంబరాలు ప్రారంభమయ్యాయి. బాణాసంచా పేలుస్తూ ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు.

2023 అడుగుపెట్టిన న్యూజిలాండ్: స్కైటవర్ వద్ద సంబరాలు
మొట్టమొదటిగా 2023 కొత్త సంవత్సరంలోకి న్యూజిలాండ్ వాసులు అడుగుపెట్టారు. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4.30 గంటలకు ఆ దేశంలో కొత్త ఏడాది ప్రారంభమైంది. ఆనందోత్సాహాల మధ్య న్యూజిలాండ్ ప్రజలు నూతన సంవత్సరాన్ని ఆహ్వానించారు. ఆక్లాండ్ స్కై టవర్ వద్ద న్యూఇయర్ వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. బాణాసంచా వెలుగులు విరజిమ్మాయి.

భారత్ కంటే ముందుగా 2023లోకి ఈ దేశాలు
మరోవైపు, ఆస్ట్రేలియా ప్రజలు కూడా కొత్త సంవత్సరం 2023లోకి అడుగుపెట్టారు. మనదేశం కంటే ఐదున్నర గంటల ముందే 2023లోకి అడుపెట్టింది. ఇదే సమయానికి దక్షిణ కొరియా, ఉత్తర కొరియా దేశాలు కూడా కొత్త ఏడాదిలోకి ప్రవేశిస్తాయి. ఇక మనదేశం పొరుగున ఉన్న భూటాన్, బంగ్లాదేశ్ మనకంటే 30 నిమిషాల ముందు కొత్త సంత్సరంలోకి అడుగుపెడతాయి.

భారత్ తర్వాతే ఇంగ్లాండ్‌లో న్యూఇయర్ వేడుకలు
కాగా, సమోవాలో కొత్త ఏడాది వేడుకలు ప్రారంభమైన ఎనిమిదన్నర గంటల తర్వాత 2023లోకి భారత్ తోపాటు శ్రీలంక ప్రవేశిస్తాయి. మన దేశం తర్వాత సుమారు నాలుగున్నర గంటలకు అత్యధికంగా 43 దేశాలు ఒకేసారి కొత్త ఏడాదిలోకి వెళతాయి. వాటిలో జర్మనీ, నార్వే, ఫ్రాన్స్, ఇటలీ, లాంటి ఐరోపా దేశాలు.. కాంగో, అంగోలా, కామెరూన్ లాంటి ఆఫ్రికా దేశాలున్నాయి. భారత్ తర్వాత ఐదున్నర గంటల తర్వాత ఇంగ్లాండ్‌లో న్యూఇయర్ వేడుకలు ప్రారంభమవుతాయి.

న్యూఇయర్ వేడుకలు చివరగా జరుపుకునేది అమెరికానే
మనకు జనవరి 1న ఉదయం 10.30 గంటలు అయినప్పుడు అమెరికాలోని న్యూయార్క్ కొత్త ఏడాదిలోకి ప్రవేశిస్తుంది. అమెరికా పరిధిలోని బేకర్, హోవార్డ్ దీవులు ఆఖరుగా కొత్తగా ఏడాదిలోకి అడుగుపెడతాయి.

రష్యాలో రెండుసార్లు న్యూఇయర్ వేడుకలు
అయితే, రష్యాలో మాత్రం నూతన సంవత్సర వేడుకలు రెండుసార్లు జరుగుతాయి. జనవరి 1న కొత్త క్యాలెండర్ ప్రకారం ఒకటి, పాత జూలియన్ క్యాలెండర్ ప్రకారం జనవరి 14న రెండో కొత్త సంత్సరం వేడుకలు జరుపుకుంటారు. జనవరి 1న నూతన సంవత్సరాన్ని జరుపుకోని దేశాల్లో చైనా, సౌదీ అరేబియా, ఇజ్రాయెల్, వియత్నాం ఉన్నాయి. ఈ దేశాలు వారి దేశాల క్యాలెండర్ ప్రకారం అక్కడ న్యూఇయర్ వేడుకలు జరుగుతాయి. ఇక మనదేశంలో కూడా న్యూఇయర్ వేడుకలు ఆంగ్ల సంవత్సరాదిగా జనవరి 1న జరుగుతాయి. ఆ తర్వాత ప్రాంతాల వారీగా ఆయా రాష్ట్రాల్లో నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటారు.












Click it and Unblock the Notifications