సౌదీ అరేబియా ఎయిర్ పోర్టులు, ఆయిల్ రిఫైనరీలు, పైప్ లైన్లపై హౌతీలు భారీ దాడులు
పశ్చిమాసియాలో భౌగోళిక ఉద్రిక్తతలు మళ్లీ పతాక స్థాయికి చేరాయి. యెమెన్‌కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులు మరోసారి సౌదీ అరేబియాపై దాడులకు దిగారు. అక్కడి చమురు శుద్ధి కర్మాగారాలు, అంతర్జాతీయ విమానాశ్రయాలను లక్ష్యంగా చేసుకున్నారు. ఇంధన రవాణా పైప్‌లైన్‌లపైనా భారీ ఎత్తున క్షిపణి దాడులకు తెగబడ్డారు. గతంలో ఐక్యరాజ్యసమితి మధ్యవర్తిత్వంతో కుదిరిన తాత్కాలిక శాంతి ఒప్పందం దీంతో తుడిచిపెట్టుకుపోయినట్టయింది.
సౌదీ రాజధాని రియాద్‌లోని కింగ్ ఖాలిద్ అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు దమ్మామ్‌లోని కింగ్ ఫహద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై క్షిపణులు, డ్రోన్లతో దాడులు సాగించారు హౌతీలు. అక్కడితో ఆగలేదు. నజ్రాన్, ఖమీస్ ముషాయత్‌లోని సైనిక స్థావరాలపై క్షిపణులు ప్రయోగించారు. సౌదీ అరేబియా ప్రభుత్వ చమురు సంస్థ అరామ్‌కోకు చెందిన యాన్బూ, రాబిగ్ ఆయిల్ రిఫైనరీలపైనా విరుచుకుపడ్డారు. అలాగే ముడిచమురు పైప్‌లైన్, పంపింగ్ స్టేషన్లపై కూడా దాడులు నిర్వహించారు. దీంతో వాటికి భారీ నష్టం వాటిల్లింది. ఆయా దాడుల్లో ఇద్దరు మరణించారు.

ఈ క్షిపణి దాడులపై సౌదీ అరేబియా స్పందించింది. యాన్బూ, తాయిఫ్ వైపు వేగంగా దూసుకొచ్చిన రెండు బాలిస్టిక్ క్షిపణులను గాల్లోనే కూల్చివేసినట్లు వెల్లడించింది. ధ్వంసమైన క్షిపణుల శిథిలాలు మక్కా, మదీనా, జెద్దా, తాయిఫ్ ప్రాంతాల్లోని వివిధ నివాస ప్రాంతాలలో పడినట్లు సౌదీ సివిల్ డిఫెన్స్ వింగ్ తెలిపింది. పవిత్ర మక్కాలో క్షిపణి శిథిలాలు పడటంతో అలజడి చోటు చేసుకుంది.
దీనిపై హౌతీలు స్పందించారు. తాము చేపట్టిన సైనిక చర్యలు సౌదీ అరేబియా ఇంధన వనరులు, సైనిక స్థావరాలకే పరిమితమని, పవిత్ర నగరాలైన మక్కా, మదీనాలను తాము లక్ష్యంగా చేసుకోలేదని స్పష్టం చేశారు. తాము ప్రయోగించిన క్షిపణులను సౌదీ ఆర్మీ గాల్లోనే పేల్చివేసిందని, వాటి శకలాలు మక్కా ప్రాంతంలో పడ్డాయని వివరణ ఇచ్చింది. మరోవంక.. యెమెన్ లోని ఏడెన్‌లో కోస్ట్ గార్డ్ స్థావరాలపై కూడా హౌతీలు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించారు. వాటిల్లో రెండు ఆ స్థావరాలను తాకాయని యెమెన్ తెలిపింది.
సౌదీ అరేబియా ఆయిల్ రిఫైనరీలు, పైప్ లైన్లు, పంపింగ్ స్టేషన్లను లక్ష్యంగా చేసుకోవడం వల్ల అంతర్జాతీయ మార్కెట్ లో ముడిచమురు ధరలపై పడుతుందనే ఆందోళనలు వ్యక్తమౌతోన్నాయి. పశ్చిమాసియాలో తలెత్తిన ఈ సంక్షోభం మరింత విస్తరించకుండా ఉండటానికి దౌత్యపరమైన చొరవ అత్యవసరమని అటు ఐక్యరాజ్యసమితి భావిస్తోంది. ఈ ఉద్దేశంతోనే శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకున్నప్పటికీ.. దాని వల్ల పెద్దగా ఫలితం కనిపించలేదు. హౌతీల దాడులు మరింత తీవ్రతరమైతే ముడిచమురు ఉత్పత్తి, రవాణా, సరఫరా తీవ్రంగా దెబ్బతింటుందని సౌదీ అరేబియా సైతం చెబుతోంది.













Click it and Unblock the Notifications
