వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఒమిక్రాన్‌: గుర్తించడమెలా? లక్షణాలేంటి

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
పీసీఆర్ పరీక్ష

కరోనావైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్నాయి.

డజనుకుపైగా దేశాలకు ఈ వేరియంట్ వ్యాపించింది. ఈ నేపథ్యంలో చాలా దేశాలు ప్రయాణ ఆంక్షలను విధించాయి.

ఒమిక్రాన్‌ వైరస్‌ను గుర్తించడానికి ఏ పరీక్షలు చేస్తారు?

ప్రజలు కరోనా వైరస్ బారిన పడ్డారో లేదో తెలుసుకునేందుకు పాలీమరేస్ చైన్ రియాక్షన్ (పీసీఆర్) పరీక్షను నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ముక్కు, గొంతుల్లో వైరస్ నమూనాలను సేకరించిన స్వాబ్‌లను ల్యాబ్‌లకు పంపిస్తారు. ల్యాబ్‌లలో ఈ నమూనాలను విశ్లేషిస్తారు.

నమూనాలను విశ్లేషించే ల్యాబ్ సామర్థ్యం ఆధారంగా వేరియంట్ల గుర్తింపు జరుగుతుంది. డెల్టా, ఒమిక్రాన్ వంటి వేరియంట్లను గుర్తించడంలో కొన్ని ల్యాబ్‌లు సహాయపడతాయి.

కొన్ని ల్యాబ్‌లు మాత్రమే ఈ వేరియంట్లను గుర్తించేందుకు కావాల్సిన సాంకేతికతను కలిగి ఉన్నాయి.

పీసీఆర్ పరీక్షలను ప్రపంచంలో అందరికన్నా ఎక్కువగా అమెరికా చేస్తుంది. అమెరికా తర్వాత యునైటెడ్ కింగ్‌డమ్, రష్యా, జర్మనీ, ఇటలీ, దక్షిణ కొరియా అత్యధికంగా ఈ పరీక్షను నిర్వహిస్తున్నాయి.

భారత్‌లో ల్యాబ్‌లకు పంపిస్తోన్న మొత్తం నమూనాల్లో కేవలం ఒక శాతం శాంపుల్స్‌ను మాత్రమే డెల్టా లేదా ఒమిక్రాన్ వేరియంట్‌లను గుర్తించడానికి ఉపయోగిస్తారు.

ఒమిక్రాన్‌ను ఎలా గుర్తించాలి

ఒమిక్రాన్ ప్రపంచవ్యాప్తంగా వ్యాపించినట్లు మనకు ఎలా తెలుసు?

పీసీఆర్ పరీక్షలో పాజిటివ్‌ ఫలితాన్ని చూపిస్తూ ఒమిక్రాన్ వైరస్‌లా అనుమానం కలిగించేలా ఉన్న స్వాబ్‌లను జెనెటిక్ అనాలసిస్ కోసం ల్యాబ్‌లకు పంపించారు. జెనోమిక్ సీక్వెన్సింగ్ అనే సాంకేతికతను ఉపయోగించి వాటిని విశ్లేషించారు.

ఈ విశ్లేషణలో నిజంగానే కొందరికి తాజా వేరియంట్ ఒమిక్రాన్ సోకినట్లు ధ్రువీకరణ అయింది.

వేరియంట్లను గుర్తించేందుకు, ఆ వేరియంట్లు ఏ విధంగా ప్రవర్తిస్తాయో కనుగొనేందుకు వైరస్ జన్యుపదార్థంపై ల్యాబ్‌లో విశ్లేషణ చేయడం అనేది కీలకం.

ఈ ప్రక్రియను పూర్తిచేయడానికి 2 వారాల సమయం పడుతుంది. అందుకే ఒమిక్రాన్ వేరియంట్‌కు సంబంధించిన చాలా కేసులను గుర్తించలేదు.

దక్షిణాఫ్రికాలోని గౌటెంగ్ ప్రావిన్సులో ఒమిక్రాన్ వేరియంట్‌కు సంబంధించి 77 కేసులు నిర్ధారణ అయ్యాయి.

ఇది ప్రధానంగా యూరప్‌కు వ్యాపించినట్లుగా అనిపిస్తోంది. నెదర్లాండ్స్, పోర్చుగల్‌లో 13 చొప్పున ఒమిక్రాన్ కేసులు నిర్ధారణ కాగా, యూకేలో 14 కేసులు నమోదైనట్లు ధ్రువీకరించారు.

అయితే ఈ కేసుల సంఖ్య ప్రకారం ఆయా దేశాల్లో ఎక్కువగా ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి అని అనుకోవడం పొరపాటు. ఎందుకంటే ఏయే దేశాలు తొందరగా ఒమిక్రాన్ వైరస్‌ను గుర్తించాయో, ఆ దేశాల గురించి ఈ కేసుల సంఖ్య తెలుపుతుంది. అంతేగానీ కేసుల సంఖ్యను ప్రకటించినంత మాత్రాన ఆ దేశాల్లోనే అధిక ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి అనుకోవడం సబబు కాదు.

ఇంట్లో చేసుకునే పరీక్షల ద్వారా ఒమిక్రాన్‌ను గుర్తించవచ్చా?

సాధారణంగా ఇళ్లలో ఉపయోగించే ర్యాపిడ్ లేదా లేటరల్ ఫ్లో పరీక్షలు, మనకు కరోనా వైరస్‌కు చెందిన ఏ వేరియంట్ సోకిందో చెప్పలేవు. కానీ, అవి మీకు వైరస్ సోకిందో లేదో అన్న విషయాన్ని మాత్రం వెల్లడిస్తాయి.

ఒమిక్రాన్ లక్షణాలేంటి?

కరోనాలోని ఇతర వేరియంట్లకు భిన్నంగా ఒమిక్రాన్ లక్షణాలు ఉంటాయని చెప్పేందుకు ఎలాంటి సమాచారం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. కాబట్టి దగ్గు, జ్వరం, రుచి లేదా వాసన కోల్పోవడం వంటి లక్షణాలు కనిపిస్తే జాగ్రత్తగా ఉండాలి.

దక్షిణాఫ్రికాలో వ్యాక్సిన్ పూర్తి డోసులు తీసుకున్నవారికి కూడా ఒమిక్రాన్ సోకింది. కానీ వారిలో చాలా స్వల్ప స్థాయిలో లక్షణాలు కనిపించాయి.

అయితే దక్షిణాఫ్రికాలోని యువత తీవ్ర లక్షణాలతో ఆసుపత్రుల్లో చేరుతున్నారు. ఇందులో చాలా మంది ఒకే డోసు టీకా తీసుకున్నవారు లేదా అసలు వ్యాక్సిన్ తీసుకోనివారున్నారు.

దీన్నిబట్టి, ఒమిక్రాన్ లేదా ఇతర ఏ వేరియంట్ బారి నుంచి తప్పించుకోవాలన్నా... రెండు డోసుల వ్యాక్సిన్‌, బూస్టర్ డోసు తీసుకోవడం ఉత్తమమని తెలుస్తుంది.

ఒమిక్రాన్‌కు ఇతర వేరియంట్లకు మధ్య తేడా ఏంటి?

ఒమిక్రాన్ వేరియంట్‌లో మునుపెన్నడూ చూడని అనేక రకాల మ్యుటేషన్లు పెద్ద సంఖ్యలో ఉన్నాయి.

అందులో చాలా మ్యుటేషన్లు వైరస్ స్పైక్ ప్రోటీన్‌లోనే సంభవిస్తున్నాయి. అందుబాటులో ఉన్న చాలా వ్యాక్సిన్లు, వైరస్ స్పైక్ ప్రోటీనే లక్ష్యంగా పనిచేస్తాయి. ఈ అంశమే ముఖ్యంగా ఆందోళన కలిగిస్తోంది.

ఒమిక్రాన్‌లో 'ఎస్-జీన్ డ్రాప్‌అవుట్' ఉంటుంది. ఇది ప్రాథమిక పరీక్షల్లో వేరియంట్‌ను పోలి ఉండే పాజిటివ్ కేసులను సులభంగా గుర్తించేలా చేస్తుంది.

కానీ అన్ని 'ఎస్-జీన్ డ్రాప్‌అవుట్' కలిగి ఉన్న నమూనాలు తప్పనిసరిగా ఒమిక్రాన్ వేరియంట్లే కావాలని లేదు. ఒమిక్రాన్‌ను గుర్తించడానికి పూర్తిస్థాయిలో జెనోమిక్ సీక్వెన్సింగ్ సాంకేతికత కచ్చితంగా అవసరం.

జెనోమిక్ స్వీక్వెన్సింగ్ పాత్ర ఏంటి?

మనకు ఏ వేరియంట్ సోకిందో, ఎలా సోకిందో తెలుసుకునే ప్రక్రియలో వైరస్ జన్యు రూపాన్ని విశ్లేషించడం అనేది కీలకం.

వైరస్‌లోని జన్యుపదార్థాన్ని క్షుణ్ణంగా పరిశీలించడం ద్వారా మనకు ఒమిక్రాన్ వైరస్ సోకిందా లేదా డెల్టా వేరియంట్ బారిన పడ్డామా అనే అంశాన్ని శాస్త్రవేత్తలు ధ్రువీకరిస్తారు.

స్వాబ్‌లను విశ్లేషించడం ద్వారా వచ్చిన సమాచారం గురించి ఈ ప్రక్రియ తెలుపుతుంది. ఈ ఫలితాలను ఆధారంగా చేసుకొని, కొత్త వేరియంట్ ఏ స్థాయిలో వ్యాపించగలదో శాస్త్రవేత్తలు ఒక అంచనాకు వస్తారు.

దక్షిణాఫ్రికా, యూకేలోని శాస్త్రవేత్తలు ఈ సాంకేతికత విషయంలో ముందంజలో ఉన్నారు. అందుకే ఆ దేశాల్లోనే ఎక్కువగా ఒమిక్రాన్ కేసులను కనుగొన్నారు. సంఖ్య ఎక్కువగా ఉన్నందున ఈ కొత్త వేరియంట్ అక్కడే పుట్టిందని చెప్పడానికి వీల్లేదు.

ఒమిక్రాన్ గురించి మనకు ఏం తెలుసు?

కొత్త వేరియంట్ ఎలా ప్రవర్తిస్తుందో, దాని వల్ల ఎంత ప్రమాదం పొంచి ఉందో అనే అంశాల గురించి మనకు చాలా తక్కువగా తెలుసు.

ఉదాహరణకు, ఇది సులభంగా వ్యాప్తి చెందుతుందా? మిగతా వేరియంట్ల కన్నా ప్రజలను తీవ్రంగా అనారోగ్యానికి గురి చేస్తుందా? దీనిపై వ్యాక్సిన్లు తక్కువగా ప్రభావం చూపుతాయా అనేవి ఇంకా స్పష్టంగా తెలియవు.

కానీ పైకి మాత్రం ఇది ఆందోళనకరంగా కనిపిస్తోంది. అందుకే ప్రభుత్వాలు ముమ్మర చర్యలు తీసుకుంటున్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
How to identify Omicron what are its symptoms
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X