పుతిన్‌పై ముప్పేట దాడి: స్వదేశంలో సెగ: రోడ్డెక్కిన రష్యన్లు: యుద్ధం పట్ల ప్రజాగ్రహం
కీవ్: రష్యా-ఉక్రెయిన్ మధ్య ఊహించినట్టే యుద్ధం ఆరంభమైంది. ఇది ఇప్పట్లో ఆగేలా కనిపించట్లేదు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ దూకుడు చూస్తోంటే ఉక్రెయిన్‌ను తన దారికి తెచ్చుకునేంత వరకూ యుద్ధాన్ని కొనసాగించేలా ఉన్నారు. తొలి రోజు- ఉక్రెయిన్‌పై రష్యా ఆధిపత్యాన్ని ప్రదర్శించినట్టే. ఉక్రెయిన్‌కు చెందిన కొన్ని కీలక పట్టణాలు రష్యా ఆధీనంలోకి వెళ్లిపోయాయి. రష్యా సైనికులు వాటిని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఉక్రెయిన్ సైన్యానికి చెందిన 74 టార్గెట్లను ఛేదించినట్లు రష్యా ప్రకటించింది.
తీవ్రంగా నష్టపోయినట్టే..
తొలి రోజు రష్యా ఉక్రెయిన్‌కు చెందిన 11 ఎయిర్‌ఫీల్డ్స్, 18 రాడార్ స్టేషన్లు, మూడు కమాండ్ పోస్టులను ధ్వంసం చేసింది. ఎస్-300, బీయూకే-ఎం1 యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్ మిస్సైల్ వ్యవస్థ సహా ఉక్రెయిన్ సైన్యానికి చెందిన కీలక పోస్టులపై బాంబుల వర్షాన్ని కురిపించినట్లు పేర్కంది. పలు మిలటరీ హెలికాప్టర్లు, నాలుగు డ్రోన్లను నేలకూల్చామని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి కొనషెన్కోవ్ తెలిపారు. యుద్ధాన్ని తీవ్రతరం చేస్తామనీ స్పష్టం చేశారు.
పుతిన్‌పై ముప్పేట దాడి..
ఉక్రెయిన్‌పై యుద్ధానికి దిగిన అనంతరం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్- ముప్పేట దాడిని ఎదుర్కొంటోన్నారు. యూరోపియన్ యూనియన్ దేశాలన్నీ రష్యాకు వ్యతిరేకంగా నిలిచాయి. అగ్రరాజ్యం అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, కెనడా.. ఇలా ఒక్కటని కాదు- దాదాపు అన్ని దేశాలు ఆయన వైఖరిని తప్పుపడుతున్నాయి. రష్యాపై ఎదురుదాడికి దిగడానికీ సమాయాత్తమౌతున్నాయి. రష్యాపై కౌంటర్ అటాక్‌కు దిగడానికి సన్నద్ధమౌతోన్నాయి.
అటు రష్యాలోనూ తీవ్ర వ్యతిరేకత..
మరోవంక- ఈ యుద్ధం పట్ల రష్యాలోనూ వ్యతిరేకత చెలరేగింది. వేలాదిమంది నిరసనకారులు రోడ్డెక్కారు. యుద్ధాన్ని ఆపివేయాలంటూ నినాదాలు చేశారు. ప్లకార్డులను ప్రదర్శించారు. వుయ్ డోన్ట్ నీడ్ వార్ అంటూ నినదించారు. మాస్కో, సెయింట్ పీటర్స్‌బర్గ్, ఇతర నగరాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. నిరసనకారులతో రష్యన్ రోడ్లు నిండిపోతోన్నాయి. నిరసనకారులు పెద్ద ఎత్తున ర్యాలీని చేపట్టారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటిదాకా 2,500 మందిని అరెస్ట్ చేశారు.
Recommended Video
పుతిన్ రాజీనామాకు డిమాండ్..
వ్లాదిమిర్ పుతిన్ తన పదవికి రాజీనామా చేయాలంటూ రష్యన్లు డిమాండ్ చేస్తోన్నారు. పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలతో హోరెత్తిస్తోన్నారు. సెంట్రల్ మాస్కోను చేరుకోవడానికి వేలాదిమంది రష్యన్లు ప్రయత్నించారు. వారిని పోలీసులు ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకున్నారు. ఉక్రెయిన్‌పై యుద్ధానికి దిగడాన్ని నిరసిస్తూ తమ ఆగ్రహాన్ని ప్రదర్శిస్తోన్నారు.












Click it and Unblock the Notifications