H1B Visa భారత్ పై అమెరికా భారీ కత్తెర?- అమీర్ పేట్ కేంద్రంగా ఫేక్ డాక్యుమెంట్లు గుర్తింపు
హెచ్ 1బీ వీసా వ్యవహారంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటోన్నాయి. భారత్ కు కేటాయించిన ఈ వీసా కోటాలో భారీగా అక్రమాలు చోటు చేసుకుంటోన్నాయని అమెరికన్ కాంగ్రెస్ మాజీ సభ్యుడు డాక్టర్ డేవ్ బ్రాట్, అమెరికా దౌత్యవేత్త మహవేష్ సిద్ధిఖీ ఆరోపించారు. ఒకే ప్రాంతానికి అనుమతించిన దానికంటే రెట్టింపు వీసాలను కేటాయించారని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు- దేశంలో హెచ్-1బీ వీసా కార్యక్రమంపై కొత్త చర్చకు దారితీశాయి.
వీసాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కఠినంగా వ్యవహరిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇది మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. భవిష్యత్తులో ఇది ఎటు తిరిగి ఎటు వెళ్తుందోననే ఆందోళనలు వ్యక్తమౌతోన్నాయి. భారత్ కు కేటాయించే కోటాలో కోతలు పెట్టొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి.

తాజాగా ఓ ఒక పాడ్‌క్యాస్ట్‌లో డాక్టర్ డేవ్ బ్రాట్ మాట్లాడారు. స్టీవ్ బాన్నన్ నిర్వహించిన వార్ రూమ్ పాడ్‌క్యాస్ట్ ఇది. భారత్ లో హెచ్-1బీ వ్యవస్థ.. ఇండస్ట్రియల్ స్కేల్ మోసాలకు గురైందని విమర్శించారు. భారత్ నుండి వీసాల కేటాయింపులు చట్టబద్ధమైన పరిమితులను మించిపోయాయని స్పష్టం చేశారు. ఈ పరిస్థితి అమెరికా కార్మికులకు తీవ్రమైన ముప్పుగా అభివర్ణించారు.
మొత్తం దేశాలకు కేటాయించే హెచ్1 బీ వీసాల్లో 71 శాతం భారత్ నుంచే వస్తోన్నాయని డేవ్ బ్రాట్ చెప్పారు. చైనా నుండి 12 శాతం మాత్రమేనని గుర్తు చేశారు. భారత్ లో ఈ కార్యక్రమంలో ఏదో జరుగుతోందనేది ఇక్కడే స్పష్టమౌతోందని వ్యాఖ్యానించారు. హెచ్-1బీ వీసాలకు 85,000 పరిమితి ఉండగా.. చెన్నై జిల్లాకు 2,20,000 వీసాలు లభించాయని, ఇది కాంగ్రెస్ విధించిన పరిమితికి రెండున్నర రెట్లు అధకమని చెప్పారు. అసలు మోసం ఇక్కడే జరుగుతోందని అన్నారు.
ఈ పరిణామాలన్నీ కూడా అమెరికా ఉద్యోగులకు ముప్పుగా అభివర్ణించారు డేవ్ బ్రాట్. వీసా పొంది అమెరికాకు వచ్చిన వారిలో కొందరు భారతీయులు తాము నైపుణ్యం కలిగినవాళ్లమని చెప్పుకుంటారని, అది వాస్తవం కాదని తేల్చి ఆరోపించారు. ఇలా వచ్చిన వాళ్లు అమెరికన్ల ఉద్యోగాలు, ఈఎంఐలతో పాటు చివరికి ఇళ్లను కూడా లాగేసుకుంటున్నారని బ్రాట్ ధ్వజమెత్తారు. ఈ పరిస్థితులకు ముగింపు పలకాల్సిన అవసరం ఉందని అన్నారు.
2024లో చెన్నైలోని యూఎస్ కాన్సులేట్ దాదాపు 2,20,000 హెచ్-1బీ వీసాలను ప్రాసెస్ చేసింది. దీనికి అదనంగా మరో 1,40,000 హెచ్-4 డిపెండెంట్ వీసా దరఖాస్తులను స్వీకరించింది. తమిళనాడుతో పాటు కర్ణాటక, కేరళ, తెలంగాణ.. ఈ కాన్సులేట్ పరిధిలోకి వస్తాయి. ప్రపంచంలోనే హెచ్-1బీ ప్రాసెసింగ్ తాకిడి అధికంగా ఉండే ఇదీ ఒకటి.
సుమారు రెండు దశాబ్దాల క్రితం చెన్నై కాన్సులేట్‌లో పనిచేసిన భారత సంతతికి చెందిన యూఎస్ ఫారిన్ సర్వీస్ అధికారిణి మహ్వాష్ సిద్ధిఖీ సైతం ఇవే ఆరోపణలు చేయడం చర్చనీయాంశమౌతోంది. హెచ్-1బీ వీసా కార్యక్రమంలో నకిలీ డాక్యుమెంట్లు విచ్చలవిడిగా చెలామణి అవుతున్నాయని విమర్శించారు. 2005-2007 మధ్య కాలంలో 51,000 నాన్-ఇమ్మిగ్రెంట్ వీసాలను పరిశీలించానని, వాటిలో ఎక్కువ భాగం హెచ్-1బీకి చెందినవేని తెలిపారు.
భారత్ నుండి వచ్చిన హెచ్-1బీ వీసాల్లో 80 నుంచి 90 శాతం నకిలీవేనని, తప్పుడు డిగ్రీలు, దొంగ సర్టిఫికెట్లు, నైపుణ్యం లేనివారికి చెందిన దరఖాస్తులే అందులో ఎక్కువగా ఉన్నాయని ఆమె చెప్పారు. హైదరాబాద్‌ను మోసాల ప్రధాన కేంద్రంగా సిద్ధిఖీ ఆరోపించారు. అమీర్‌పేట్‌లో వీసా దరఖాస్తుదారులకు బహిరంగంగా శిక్షణ ఇచ్చే సెంటర్లు ఉన్నాయని, ఇవి నకిలీ ఉద్యోగ, విద్యా ధృవీకరణ పత్రాలు, చివరికి వివాహ డాక్యుమెంట్లను కూడా విక్రయించాయని ఆమె ఆరోపించారు.












Click it and Unblock the Notifications