నో రెడ్ స్టేట్..నో బ్లూ స్టేట్.. ఓన్లీ యునైటెడ్ స్టేట్స్: జో బిడెన్ ఫస్ట్ స్పీచ్
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాకు 46వ అధ్యక్షుడిగా ఎన్నికైన తరువాత డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బిడెన్ ఆ దేశ ప్రజలను ఉద్దేశించి తొలిసారిగా ప్రసంగించారు. ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన కమలా హ్యారిస్‌తో కలిసి తన సొంత రాష్ట్రం డెల్వర్‌లోని మిల్మింగ్టన్ నుంచి ఆయన మాట్లాడారు. క్రిస్టీనా రివర్ వద్ద గల ఛేజ్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో జో బిడెన్ అభిమానులు, డెమొక్రటిక్ పార్టీ మద్దతుదారులు హాజరయ్యారు. అధ్యక్షుడిగాా తనను గెలిపించినందుకు అమెరికన్లకు కృతజ్ఙతలు తెలిపారు.
విభజించి పాలించడం అనే సూత్రాన్ని తాను ఏ మాత్రం విశ్వసించబోనని, అందరినీ సమాన దృష్టితో చూస్తానని జో బిడెన్ అన్నారు. ఈ దిశగా తాను ప్రతిజ్ఙ చేస్తున్నానని చెప్పారు. నో బ్లూ స్టేట్.. నో రెడ్ స్టేట్.. ఓన్లీ యునైటెడ్ స్టేట్స్.. అని వ్యాఖ్యానించారు. ఈ రెండు రంగులూ డెమొక్రాట్లు, రిపబ్లికన్ పార్టీల ఎన్నికలకు సంబంధించినవి. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఓటు వేసిన వారు తాజాగా వెలువడిన ఎన్నికల ఫలితాలు తీవ్ర నిరాశకు గురై ఉంటారని, వారి ఆవేదనను తాను అర్థం చేసుకోగలుగుతానని అన్నారు.

డెమొక్రాట్లకు దక్కిన ఈ విజయాన్ని తమదిగా భావించాలని సూచించారు. ఇది ప్రతి ఒక్క అమెరికన్ సాధించిన ఘన విజయమని చెప్పారు. ఈ ఎన్నికల్లో రికార్డుస్థాయిలో ఓటింగ్ నమోదైందని, ఇదివరకెప్పుడూ లేని స్థాయిలో అమెరికన్లు తమ ఓటు హక్కును వినియోగించకున్నారని జో బిడెన్ గుర్తు చేశారు. ప్రభుత్వం నుంచి తాము ఏమి కోరుకుంటున్నామనేది ఈ ఓటు ద్వారా తెలియజేశారని, వారిని ఏ మాత్రం నిరుత్సాహ పర్చకుండా కొత్త ప్రభుత్వం పని చేస్తుందని భరోసా ఇచ్చారు.
74 మిలియన్ల ఓట్లు తమకు పోల్ అయ్యాయని, అమెరికా చరిత్రలో ఇదొక రికార్డు అని తెలిపారు. అమెరికాను అగ్రరాజ్యంగా తీర్చిదిద్దాలనే ఏకైక లక్ష్యంతో తాను పనిచేస్తానని హామీ ఇచ్చారు జో బిడెన్. దౌత్య సంబంధాలను పునఃసమీక్షించుకోవాల్సిన పరిస్థితులు రావొచ్చని వ్యాఖ్యానించారు. అన్ని రంగాల్లోనూ అమెరికన్లకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. ఎన్నికల ర్యాలీల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో వెనుకాడబోమని తెలిపారు.












Click it and Unblock the Notifications