Donald Trump..అరెస్ట్ అయితే ఏం జరుగుతుంది?: ఏఐ ఫొటోలు వైరల్
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అరెస్ట్ ను ఎదుర్కొంటోన్నారు. పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్స్ కేసులో ఆయన అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. ఆయన అరెస్ట్ అయితే ఏం జరుగుతుందనేది చర్చనీయంశమైంది.
వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) అరెస్ట్ ను ఎదుర్కొంటోన్నారు. తనను అరెస్ట్ చేయొచ్చనే విషయాన్ని ఆయనే స్వయంగా తెలిపారు. అరెస్ట్ అయ్యే పరిస్థితులే వస్తే- తనకు అండగా నిలవాలంటూ మద్దతుదారులకు పిలుపునిచ్చారు. నిరసన ప్రదర్శనలను చేయాలని సూచించారు. ఆయన తరఫు అడ్వొకేట్ సుసాన్ మాత్రం దీన్ని తోసిపుచ్చుతున్నారు. ట్రంప్ ను అరెస్ట్ చేయడానికి అధికారికంగా ఎలాంటి ఉత్తర్వులు జారీ కాలేదని పేర్కొంటోన్నారు.

తొలి అమెరికన్ ప్రెసిడెంట్ గా..
డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఎదుర్కొంటోన్న ఆరోపణల విషయంలో వచ్చే వారం తీర్పు వెలువడనున్నట్లు అమెరికన్ మీడియా కథనాలను ప్రచురించింది. ఆ ఆరోపణలు రుజువైతే మాత్రం- అమెరికాలో ఒక మాజీ అధ్యక్షుడి ప్రత్యక్ష ప్రమేయం ఉన్న తొలి క్రిమినల్ కేసు ఇదే అవుతుంది. మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగానే డొనాల్డ్ ట్రంప్- తాజా ప్రకటన చేశారని, అరెస్ట్ చెయ్యొచ్చనే ఉద్దేశంతో ఆయన ఉన్నారని అడ్వొకేట్ చెప్పారు.

ఎన్నికల కంటే ముందే..
2016 అధ్యక్ష ఎన్నికల సమయంలో రిపబ్లికన్ పార్టీ (Republican) అభ్యర్థిగా పోటీ చేసిన డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆ ఎన్నికల కంటే ముందే టాప్ అమెరికన్ పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్స్ (Porn Star Stormy Danials) తో తనకు ఉన్న సంబంధాలు బయటికి రాకుండా జాగ్రత్తపడ్డారని, దీనికోసం తన తరఫు అడ్వొకేట్ ను మధ్యవర్తిగా పెట్టి- ఆమెకు పెద్ద మొత్తం డబ్బులను చెల్లించారనే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి.

స్మార్మీ డేనియల్స్ ..
2006లో ట్రంప్ తనతో సెక్స్ చేశారని స్టార్మీ డేనియల్స్ (Stormy Danials) ఆరోపించారు. అధ్యక్ష ఎన్నికల (US Presidential elections) సమయంలో ఆ విషయాన్ని బయటపెట్టకుండా ఉండటానికి బెదిరించారని ఆరోపించారు. తన అడ్వొకేట్ ద్వారా ట్రంప్ 1.30 లక్షల డాలర్లు ఇచ్చారని స్పష్టం చేశారు. ఈ కేసులో ట్రంప్ పై విచారణ కొనసాగుతోంది. పోర్న్ స్టార్ (Porn Star) వ్యవహారంలో తాను ఏ తప్పూ చేయలేదని ట్రంప్ వాదిస్తోన్నారు.

ఎన్నికల్లో పోటీ చేయవచ్చా?
ప్రస్తుతం ఆయన 2024 అధ్యక్ష ఎన్నికల కోసం సన్నద్ధమౌతోన్నారు. పోర్న్ స్టార్ కేసులో తనపై నేరం రుజువైనప్పటికీ- ఎన్నికల రేసులో నిల్చుంటానని, ప్రచారాన్ని కొనసాగిస్తానని ఆయన స్పష్టం చేశారు. ఈ కేసులు రుజువు అవుతాయా? లేదా? అనేది నిర్ధారణ కాకముందే- ట్రంప్ తన అరెస్ట్ గురించి మాట్లాడుతుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆయన ఎన్నికల్లో పోటీ చేయొచ్చని నిపుణనులు చెబుతున్నారు.
అరెస్ట్ చేస్తే..
డొనాల్డ్ ట్రంప్ ను పోలీసులు అరెస్ట్ చేస్తే ఏం జరుగుతుందనేది చర్చనీయాంశమౌతోంది. ఆయన చేతికి సంకెళ్లు వేసి ఊరేగిస్తారనే ప్రచారం జరుగుతోంది. కెమరాల ముందు ఆయనను సంకెళ్లతో నడిపించే అవకాశం ఉందంటూ అమెరికన్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. అలాంటిదేమీ ఉండదని, ట్రంప్ కు కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తారని చెబుతున్నారు. సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ల కస్టడీలో ఆయన ఉంటారని స్పష్టం చేస్తోన్నారు. ఆయన అరెస్ట్ అయినట్లు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సృష్టించిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

నో పెర్ప్ వాక్..
పెర్ప్ వాక్ (Perp walk) అంటే ఇద్దరు పోలీసు అధికారులు ఆయన చేతులను పట్టుకుని లాక్కెళ్లే పరిస్థితి కూడా ఉండదని న్యాయ నిపుణులు చెబుతున్నారు. వీఐపీ ట్రీట్ మెంట్ ను అందించే అవకాశం లేకపోలేదనే వాదనలు కూడా వినిపిస్తోన్నాయి. కోర్టులో కూడా ఆయనను ప్రైవేట్ గా ప్రవేశపెడతారని అంటోన్నారు. వేలిముద్రల స్వీకరణ, నేరస్తుడిగా నిర్ధారించిన అనంతరం ఫొటో తీయడం (మగ్ షాట్) వంటి ప్రక్రియ యధాతథంగా ఉంటుందని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications