చేయి నరుక్కున్న బాలుడు: వేడుక, ఇమామ్ అరెస్ట్
లాహోర్: పాకిస్థాన్‌లో ఓ బాలుడు తన చేయిని నరికి వేసుకోవడానికి కారణమయ్యాడన్న ఆభియోగంపై ఓ మతగురువును అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానిక కోర్టులో ఆయనను ఆదివారం ప్రవేశపెట్టగా.. విచారణ కోసం రెండురోజుల కస్టడీకి అప్పగిస్తూ న్యాయమూర్తి ఆదేశించారు.
పోలీసుల కథనం ప్రకారం.. పంజాబ్ ప్రావిన్స్‌లోని ఒకరా జిల్లాలో గతవారం మత గురువు షబ్బీర్ ఆహ్మద్ ఓ కార్యక్రమాన్ని నిర్వహించాడు. ఆ కార్యక్రమంలో మహ్మద్ ప్రవక్త అంటే గౌరవం లేని వారు ఎవరో చేతులు లేపాలని షబ్బీర్ సూచించగా.. మత గురువు ప్రశ్నను సరిగా అర్ధం చేసుకోలేని బాలుడు మహమ్మద్ అన్వర్ పొరపాటున చేయి లేపాడు.

దీంతో దైవ దూషణకు పాల్పడ్డావంటూ ఆ బాలుడిపై మత గురువు ఆగ్రహం వ్యక్తం చేశాడు. అంతేగాక, దైవ దూషణాణకు కారణమైన చేయిని తెగ నరుక్కొంటేనే దానికి ప్రాయశ్చిత్తం జరుగుతుందని బాలుడికి సూచించాడు. దీంతో బాధతో ఇంటికి వెళ్లిన ఆ బాలుడు ఎత్తిన చేతిని తెగ నరుక్కొన్నాడు.
తన కుమారుడి చర్యకు తల్లిదండ్రులు, ఇరుగుపొరుగు వారు ఘనంగా ఓ వేడుకను కూడా జరుపుకొన్నారని స్థానిక పోలీసులు పేర్కొన్నారు.
ఈ ఘటనపై ఫిర్యాదు చేయకపోగా, మహ్మద్ ప్రవక్తపై ఉన్న ప్రేమను చూపించుకోవడానికి చేతిని నరుక్కొన్నాడని తల్లిదండ్రులు చెప్పడం గమనార్హం. అంతేకాకుండా, మత గురువుపై చర్య తీసుకోవడాన్ని బాలుడి కుటుంబం వ్యతిరేకించారని పోలీసుల పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications