నన్ను లొంగదీసుకోవడానికి నా భార్యను.. 30 నిమిషాలు పాటు
పాకిస్తాన్ మాజీ ప్రధాని, క్రికెట్ దిగ్గజం ఇమ్రాన్ ఖాన్ జైలు గోడల మధ్య నుంచి మరోసారి గర్జించారు. తనను లొంగదీసుకోవడానికి తన భార్య బుష్రా బీబీని అధికారులు పావుగా వాడుకుంటున్నారని, ఆమె పట్ల అత్యంత అమానవీయంగా ప్రవర్తిస్తున్నారని ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దాదాపు ఏడు నెలలుగా కంటి చూపు సమస్యతో పోరాడుతున్న ఖాన్, తన కుమారుడు ఖాసిం ఖాన్‌తో జరిపిన ఫోన్ కాల్‌లో పాకిస్తాన్ ప్రస్తుత దుస్థితిని, న్యాయవ్యవస్థ తీరును ఎండగట్టారు.
"నన్ను మానసికంగా కృంగదీయడం ఎవరితరం కాదని వారికి తెలుసు, అందుకే నా భార్యను లక్ష్యంగా చేసుకున్నారు" అని ఇమ్రాన్ ఖాన్ మండిపడ్డారు. జనవరి నుంచి అడియాలా జైలులో ఉన్న బుష్రా బీబీని దాదాపు ఏకాంత ఖైదీగా ఉంచుతున్నారని ఆయన ఆరోపించారు. వారానికి కేవలం 30 నిమిషాలు మాత్రమే తనను కలిసేందుకు అనుమతిస్తున్నారని, ఆ కొద్దిపాటి సమయాన్ని కూడా తరచుగా నిరాకరిస్తూ తనను బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని ఖాన్ పేర్కొన్నారు. ఈ క్రమంలో పాకిస్తాన్ న్యాయమూర్తులపై ఆయన తీవ్ర విమర్శలు చేస్తూ, వారు తమ ఆత్మలను అమ్ముకున్నారని దుయ్యబట్టారు.

Imran Khan కంటి చూపు కనుమరుగవుతున్నా..
అవినీతి కేసుల్లో 2023 ఆగస్టు నుండి జైలు శిక్ష అనుభవిస్తున్న ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యం ప్రస్తుతం ఆందోళనకరంగా ఉంది. ముఖ్యంగా ఆయన కుడి కంటి చూపు దాదాపు 85 శాతం మేర మందగించడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. ఇటీవల మూడు డోసుల చికిత్స పూర్తి చేసుకున్న ఖాన్, మరోసారి కంటి పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి వెళ్లి తిరిగి జైలుకు చేరుకున్నారు. ఒకప్పుడు ప్రపంచ మేటి అథ్లెట్‌గా వెలిగిన వ్యక్తి ఇలాంటి స్థితిలో ఉండటంపై క్రీడా లోకం సైతం స్పందించింది.
Imran Khan కోసం రంగంలోకి క్రికెట్ దిగ్గజాలు
ఇమ్రాన్ ఖాన్ పట్ల కనీస మానవతా దృక్పథం ప్రదర్శించాలని కోరుతూ భారత్‌కు మాజీ దిగ్గజ క్రికెటర్లు సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్ సహా 14 మంది అంతర్జాతీయ మాజీ క్రికెటర్లు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌కు విజ్ఞప్తి చేశారు. ఒక మాజీ ప్రధానికి, ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన క్రీడాకారుడికి తగిన వైద్య సదుపాయాలు కల్పించాలని వారు కోరారు. 2024 డిసెంబర్‌లో మరిన్ని కొత్త కేసులు, శిక్షలు పడటంతో ఇమ్రాన్ ఖాన్ జైలు జీవితం మరింత సుదీర్ఘం కానుంది.
ముదురుతున్న రాజకీయ సంక్షోభం
అధికారం నుంచి తొలగించినప్పటి నుంచి ఇమ్రాన్ ఖాన్ చుట్టూ కేసుల ఉచ్చు బిగుస్తూనే ఉంది. ఒకవైపు అనారోగ్యం, మరోవైపు కుటుంబ సభ్యులపై వేధింపులు ఖాన్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అయితే, తన పోరాటం ఆపేది లేదని ఆయన పదేపదే స్పష్టం చేస్తున్నారు. పాకిస్తాన్ అంతర్గత రాజకీయాల్లో ఈ 'జైలు యుద్ధం' ఎలాంటి మలుపులు తిరుగుతుందోనని ప్రపంచ దేశాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి.












Click it and Unblock the Notifications