ఇమ్రాన్ ఖాన్ సజీవంగా ఉన్నారు కానీ.. సోదరి కీలక ప్రకటన!
పాకిస్తాన్ మాజీ ప్రధాని, పీటీఐ వ్యవస్థాపకుడు ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యం, భద్రత గురించి కుటుంబ సభ్యులు, మద్దతుదారులు వ్యక్తం చేస్తున్న ఆందోళనల నేపథ్యంలో మంగళవారం రోజున ఆయన సోదరి ఉజ్మా ఖానుమ్‌కు అడియాలా జైలులో భేటీకి అధికారులు అనుమతి ఇచ్చారు. ఆగస్టు 2023 నుంచి అవినీతి ఆరోపణలపై జైలు శిక్ష అనుభవిస్తున్న ఇమ్రాన్ ఖాన్‌ను కలవడానికి గత కొన్ని వారాలుగా కుటుంబ సభ్యులను అనుమతించకపోవడంతో ఈ పరిణామం చోటుచేసుకుంది.
జైలులో ఇమ్రాన్ ఖాన్‌తో సోదరి భేటీ
ఇమ్రాన్ సోదరి ఉజ్మా ఖానుమ్ అనేక మంది పీటీఐ కార్యకర్తలతో కలిసి రావల్పిండిలోని అడియాలా జైలు లోపలికి వెళ్లి తన సోదరుడిని కలుసుకున్నారు. "చివరకు భేటీకి అనుమతి లభించినందుకు నేను సంతోషంగా ఉన్నాను" అని ఉజ్మా అన్నారు. 20 నిమిషాల పాటు సాగిన ఈ భేటీ తర్వాత మీడియాతో మాట్లాడిన ఆమె.. ఇమ్రాన్ ఖాన్ సజీవంగా ఉన్నారని, కానీ "మానసికంగా హింసించబడుతున్నారు" అని ఆరోపించారు. "దేవుడి దయ వల్ల ఆయన బాగానే ఉన్నారు" అని ఉజ్మా ఖానుమ్ తెలిపారు. "కానీ ఆయన మానసికంగా హింసించబడుతున్నందుకు చాలా కోపంగా ఉన్నారు. ఆయనను రోజంతా సెల్‌లోనే బంధిస్తున్నారు. కొద్ది సమయం మాత్రమే బయటకు రావడానికి అనుమతి ఉంది. ఆయన ఎవరితోనూ మాట్లాడటానికి అనుమతి లేదు," అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తన సోదరుడి నిర్బంధానికి కారణం పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీరే అని ఇమ్రాన్ ఖాన్ నిందించినట్లు ఉజ్మా ఖానుమ్ ఆరోపించారు.

ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యం గురించి వదంతులు, అలాగే గత కొన్ని వారాలుగా ఆయన కుటుంబ సభ్యులను కలవడానికి అధికారులు పదేపదే నిరాకరించిన నేపథ్యంలో ఈ భేటీ జరిగింది.గత నెలలో ఇమ్రాన్ ఖాన్ ముగ్గురు సోదరీమణులు - నూరీన్ నియాజీ, అలీమా ఖాన్, ఉజ్మా ఖానుమ్ - ఆయన్ని కలవడానికి అడగగా వారిపై దాడి జరిగిందని ఆరోపించడంతో ఈ ఆందోళనలు మరింత పెరిగాయి
నిరసనలు.. సెక్షన్ 144 అమలు
కుటుంబ సభ్యులను కలవడానికి అనుమతి నిరాకరించడం, ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై వదంతుల నేపథ్యంలో పీటీఐ మద్దతుదారులు నిరసనలు కొనసాగిస్తున్నారు. ఇమ్రాన్ ఎక్కడున్నారో తెలియజేయాలని కోరుతూ పీటీఐ మద్దతుదారులు ఇస్లామాబాద్ హైకోర్టు బయట కూడా నిరసనలు చేపట్టారు. అక్కడ సెక్షన్ 144 అమలులో ఉంది.దీనిపై స్పందించిన అంతర్గత వ్యవహారాల శాఖ సహాయ మంత్రి తలాల్ చౌదరి.. పీటీఐ నిరసనలు ప్రకటించిన ఇస్లామాబాద్, రావల్పిండిలలో సెక్షన్ 144ను కఠినంగా అమలు చేస్తామని హెచ్చరించారు. చట్టాన్ని ఉల్లంఘిస్తే ఎలాంటి వివక్ష లేకుండా చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.
కుమారుడి ఆందోళన.. కోర్టు పిటిషన్
గత కొద్ది వారాలుగా ఇమ్రాన్ ఖాన్ పరిస్థితిపై ఊహాగానాలు పెరిగాయి. మాజీ ప్రధాని కుమారుడు ఖైసిమ్ ఖాన్ మాట్లాడుతూ.. తమ తండ్రి ఆరోగ్యం గురించి అధికారులు ఏదో దాస్తున్నారేమోనని భయపడుతున్నట్లు తెలిపారు. "మీ తండ్రి సురక్షితంగా ఉన్నారా, గాయపడ్డారా లేదా బతికే ఉన్నారా అని తెలియకపోవడం ఒక రకమైన మానసిక వేధన" అని ఆయన అన్నారు. మరో సోదరి అలీమా ఖాన్, భేటీలకు అనుమతి ఇవ్వాలన్న ఇస్లామాబాద్ హైకోర్టు (IHC) ఆదేశాలను పాటించనందుకు అడియాలా జైలు అధికారులపై కోర్టు ధిక్కార పిటిషన్‌ను దాఖలు చేశారు.జైలు అధికారులు మాత్రం ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంగానే ఉన్నారని, అతనికి ఫైవ్ స్టార్ హోటల్ తరహాలో ఆహారం లభిస్తోందని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications