దావూద్ ఖతమయ్యేవాడే: ఓ ఫోన్ కాల్ తప్పించింది
న్యూఢిల్లీ: ఏడాది క్రితం భారత్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టు దావూద్ ఇబ్రహీం కమెండోల చేతిలో ఖతమయ్యేవాడే. చివరి నిమిషంలో ఓ ఫోన్ కాల్ కారణంగా ఆపరేషన్ ఆగిపోయింది. 1993 ముంబై బాంబు పేలుళ్ల కేసులో నిందితుడైన దావూద్ కోసం భారత కమెండోలు అత్యంత రహస్యమైన ఆపరేషన్ చేపట్టి, దాదాపు ఫలితం సాధించే దశలో ఆగిపోయింది. ఈ విషయాలు ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి.
వివరాలు ఇలా ఉన్నాయి - 2013 సెప్టెంబర్ 13వ తేదీన పాకిస్థాన్‌లోని కరాచీ ప్రాంతంలో క్లిప్టన్ రోడ్ నుంచి డిఫెన్స్ హౌసింగ్ సొసైటీ వైపు ఓ కారు దూసుకెళుతోంది. ఆ దారిలో దర్గా వద్ద 9మంది కమాండోలు తమ ఆయుధాలతో పొజిషన్ తీసుకున్నారు. అర నిమిషమో, నిమిషమో గడిస్తే ఆ కారులో ఉన్న వ్యక్తి ఖతమైపోయేవాడే, కానీ అంతలోనే ఒకరి మొబైల్ ఫోన్ రింగ్ మోగింది. ఈ సమయంలో కాల్ ఏంటని విసుగ్గా లిఫ్ట్ చేస్తే... ‘‘ఆపరేషన్ ఆపేయండి... ఆ వ్యక్తిని వదిలేయండి'' అని ఓ స్వరం ఆదేశించింది.

ఎంతో కష్టపడి రూపొందించుకున్న ఆపరేషన్ క్షణాల్లో నిష్ఫలమైంది. ఇంతకీ ఆ కారులో ఉన్న వ్యక్తి భారత మోస్ట్‌వాంటెడ్ టెర్రరిస్ట్, 1993 ముంబై వరుస పేలుళ్ల నిందితుడు దావూద్ ఇబ్రహీం. ఆ ఆపరేషన్ నిర్వహించింది మెరికల్లాంటి తొమ్మిది మంది ‘రా' కమాండోలు. సరిగ్గా పదిహేను నెలల క్రితం జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలను విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. అయితే, దావూద్‌ను వదిలేయాలని ఫోన్ చేసిన వ్యక్తి ఎవరో మాత్రం వెల్లడి కాలేదు.
పదేపదే తప్పించుకుంటున్న దావూద్ ఇబ్రహీంను మట్టుబెట్టేందుకు భారత నిఘావర్గాలు అత్యంత రహస్యంగా ఆపరేషన్‌కు శ్రీకారం చుట్టాయి. ఇందుకు ‘రా' తొమ్మిది మంది ఏజెంట్లను నియమించుకుంది. వీరికి సూపర్‌బాయ్స్ అని నామకరణం చేసింది. ఈ తొమ్మిది మంది సూడాన్, బంగ్లాదేశ్, నేపాల్ దేశాల పాస్‌పోర్టులతో పాకిస్థాన్‌లో అడుగుపెట్టారు. ఈ ఆపరేషన్‌కు ఇజ్రాయెల్ నిఘా విభాగం సహకరించింది. కరాచీలో ఉంటున్న దావూద్ ఇబ్రహీం ప్రతిరోజు క్లిప్టన్‌రోడ్‌లోని ఇంటి నుంచి డిఫెన్స్ హౌసింగ్ సొసైటీకి రాకపోకలు సాగిస్తాడు. దావూద్ కదలికలను పసిగట్టిన సూపర్‌బాయ్స్ ఈ రోడ్డే ఆపరేషన్‌కు అనువైనదిగా భావించారు. దావూద్ తాజా ఫొటోలను, వీడియోలను చూసి ఎలా ఉంటాడో ఖరారు చేసుకున్నారు.
నిరుడు సెప్టెంబర్ 13న ఆపరేషన్‌కు సిద్ధమయ్యారు. ఈ రోడ్డులోని దర్గా వద్ద తమ వెపన్స్‌తో పొజిషన్ తీసుకున్నారు. నిమిషంలోపే ఆపరేషన్ పూర్తవబోతోంది. రెండు దశాబ్దాల భారత కల నెరవేరబోతోంది. షూట్ చేయడమే తరువాయి అనుకున్న సూపర్‌బాయ్స్‌లో ఒకరి మొబైల్‌కు అత్యంత కీలకమైన వ్యక్తి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. కాల్పులు వద్దు, వెనక్కి వచ్చేయాలని ఆదేశించింది. చేసేది లేక మన కమెండోలు వెనక్కి వచ్చారు. సరిగ్గా పదిహేను నెలలు గడిచాక ఈ విషయం బయటపడింది.












Click it and Unblock the Notifications