ఆఫ్ఘన్‌కు అండగా భారత్.. సాయంగా 21 టన్నుల సామగ్రి !
ప్రపంచంలో ఎక్కడైనా విపత్తు సంభవించినా.. మానవత్వం పేరుతో ముందుంటుంది భారత్. మరోసారి తన సహాయస్ఫూర్తిని చాటుకుంది. ఇటీవల ఆఫ్ఘనిస్తాన్‌లో వరుసగా సంభవించిన భూకంప దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు అండగా నిలుస్తూ మానవతా సహాయం అందించింది.
ఆఫ్ఘనిస్తాన్‌లో భూకంపం..
సెప్టెంబర్ 1న తూర్పు ఆఫ్ఘనిస్తాన్‌లోని నంగర్‌హార్ ప్రావిన్స్‌లో 6.0 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ ప్రకృతి విపత్తులో 1,400 మందికి పైగా మృతి చెందగా.. 3 వేలకు పైగా గాయపడ్డారు. అదనంగా 5 వేలకు పైగా ఇళ్లు కూలిపోయి, వేలాది కుటుంబాలు నిరాశ్రయులయ్యాయి. కునార్ ప్రావిన్స్‌లోని నూర్గల్, సుకి, చాపా దారా, పెచ్ దారా, అసదాబాద్ జిల్లాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.

21 టన్నుల మానవతా సహాయం పంపిన భారత్..
ఈ క్రమంలోనే భారత్ అత్యవసర సహాయ చర్యలు చేపట్టింది. విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ప్రకటన ప్రకారం, కాబుల్‌కు ప్రత్యేక విమానం ద్వారా 21 టన్నుల మానవతా సహాయ సామగ్రి తరలించారు.
ఈ సహాయంలో -
దుప్పట్లు, టెంట్లు, స్లీపింగ్ బ్యాగులు
పరిశుభ్రత కిట్లు, హ్యాండ్ శానిటైజర్లు, నీటి శుద్ధి మాత్రలు, ORS ప్యాకెట్లు
వంట పాత్రలు, పోర్టబుల్ వాటర్ ప్యూరిఫైయర్లు, నీటి నిల్వ ట్యాంకులు
జనరేటర్లు, వీల్‌చైర్లు
అత్యవసర మందులు, వైద్య వినియోగ వస్తువులు
ఈ సరుకులు ఇప్పటికే కాబుల్ చేరి స్థానికులకు పంపిణీ అవుతున్నాయి.
మరోవైపు భూకంప బాధితుల పరిస్థితి విషమంగా ఉందని.. ప్రస్తుత నిధులు సరిపోవని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ ప్రకటించారు. అత్యవసర సహాయ చర్యల కోసం 5 మిలియన్ డాలర్లను ప్రత్యేక నిధి నుంచి కేటాయించారు. తాలిబన్ అధికారులతో కలిసి పరిస్థితిని అంచనా వేస్తూ అంతర్జాతీయ సహాయాన్ని సమర్థవంతంగా వినియోగించడానికి యూఎన్ కృషి చేస్తోంది.
తాలిబన్ ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ ప్రకారం.. నూర్గల్, సుకి, చాపా దారా, పెచ్ దారా, అసదాబాద్ జిల్లాల్లో ప్రాణ నష్టం అధికమైందని తెలిపారు. ఇంకా శిథిలాల్లో చిక్కుకున్నవారిని రక్షించాల్సిన అవసరం ఉందని, తక్షణ ఆహారం, నీరు, ఔషధాలు అత్యవసరమని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications