వీటో అధికారాలపై ఐరాస వేదికగా తేల్చి చెప్పిన భారత్: అవి ద్వితీయ శ్రేణి దేశాలే
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి పునర్వ్యవస్థీకరణపై భారత్ తన వైఖరిని పునరుద్ఘాటించింది. మండలి విస్తరణ ప్రక్రియలో భాగంగా నూతనంగా శాశ్వత సభ్యత్వాలను కల్పించే దేశాలకు వీటో అధికారాలను కూడా అప్పగించాల్సిన అవసరం ఉందని తేల్చి చెప్పింది. వీటో అధికారంలో లేకపోతే అర్థం ఉండబోదని, 'ద్వితీయ శ్రేణి' దేశాలుగా మిగిలి పోతాయని పేర్కొంది. ప్రస్తుతం అయిదు శాశ్వత సభ్యదేశాల చేతిలోనే నిర్ణయాధికారాలన్నీ కేంద్రీకృతమై ఉన్నాయని గుర్తు చేసింది.
ఆయా దేశాలకు మాత్రమే పరిమితం చేసేలా చేపట్టబోయే ఎలాంటి సంస్కరణలైనా సరే.. అవి అంతర్జాతీయ దేశాల ఆకాంక్షలకు పూర్తిగా విరుద్ధమేనని కుండబద్దలు కొట్టింది. వీటో అధికారాలపై ఐరాసలో నిర్వహించిన క్లస్టర్ డిబేట్ లో భారత శాశ్వత ప్రతినిధి, రాయబారి హరీష్ పర్వతనేని పాల్గొన్నారు. ఇందులో ప్రసంగించారు. భద్రతా మండలి నిబంధనల్లో వీటో అధికారం కొనసాగుతున్నంత కాలం.. దీన్ని పునర్వ్యవస్థీకరించినప్పటికీ ఉపయోగం ఉండదని అన్నారు.

నూతనంగా భద్రతమండలిలో చేరే శాశ్వత సభ్య దేశాలకు కూడా సమాన అవకాశాలు లభించాల్సిన అవసరం ఉందని అన్నారు. న్యాయం, సమానత్వ సూత్రాల ప్రకారం శాశ్వత సభ్యులందరికీ సమాన హక్కులు, బాధ్యతలు ఉండాలని హరీష్ పర్వతనేని పేర్కొన్నారు. భద్రతా మండలిలో అమెరికా, రష్యా, చైనా, బ్రిటన్, ఫ్రాన్స్ శాశ్వత సభ్యులుగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. వాటికి మాత్రమే వీటో అధికారం ఉంది.
వీటితో పాటు రెండేళ్ల కాలపరిమితితో 10 సభ్యదేశాలు కూడా భద్రతమండలిలో ఉన్నప్పటికీ.. వాటికి వీటో అధికారాలు సంక్రమించట్లేదు. శాశ్వత సభ్యత్వం దక్కినా గానీ వీటో అధికారాలు కల్పించకూడదనే ప్రతిపాదనలను హరీష్ పర్వతనేని ఈ సందర్భంగా తప్పుపట్టారు. భద్రతామండలిలో శాశ్వత సభ్యత్వం పొందినా కూడా వీటో అధికారాలు లేకపోతే ఆయా దేశాలు ద్వితీయ శ్రేణి కిందికి వస్తాయని అభ్యంతరం వ్యక్తం చేశారు.
1945 నాటి రెండవ ప్రపంచ యుద్ధం తర్వాతి పరిస్థితులకు అనుగుణంగా రూపొందించిన భద్రతమండలి నిబంధనలనేవి.. ప్రస్తుత సమకాలీన భౌగోళిక, రాజకీయ పరిస్థితులకు ఏమాత్రం తగినది కాదని, తక్షణమే ఐరాసలో మార్పులు రావాలని ఆయన స్పష్టం చేశారు. శాశ్వత సభ్యదేశాల సంఖ్యను పెంచడానికి మాత్రమే ఇటువంటి సంస్కరణలను అమలు చేయడం వల్ల ఉపయోగం ఉండదని పేర్కొన్నారు.
అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రాతినిధ్యం పెంచడం, ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన ప్రజాస్వామ్య దేశంగా ఉన్న భారత్కు భద్రతా మండలిలో శాశ్వత పీఠం దక్కడం సమకాలీన అవసరమని అన్నారు. కాగా.. భద్రతమండలిలో శాశ్వత సభ్యత్వం కోసం సుదీర్ఘ కాలంగా తన ప్రయత్నాలను కొనసాగిస్తూ వస్తోంది.. భారత్. ఆసియా పసిఫిక్ రీజియన్ కోసం కేటాయించిన ఏకైక స్థానం కోసం భారత్, తజికిస్తాన్ పోటీపడుతున్నాయి.














Click it and Unblock the Notifications
