పాకిస్థాన్‌కి భారత్ స్ట్రాంగ్ కౌంటర్.. టెర్రరిజం పాక్ విదేశాంగ విధానం !!

ఐక్యరాజ్యసమితి వేదికగా పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ చేసిన వ్యాఖ్యలపై భారత్ తీవ్రస్థాయిలో మండిపడింది. పాక్ ప్రధాని ప్రసంగం ఓ 'అసంబద్ధమైన నాటకం' అని.. ఉగ్రవాదాన్ని కీర్తించడమే వారి విధానమని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది.

ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కశ్మీర్ అంశాన్ని, సింధు జలాల ఒప్పందాన్ని ప్రస్తావించారు. కశ్మీర్ ప్రజల స్వీయ నిర్ణయాధికారానికి తమ మద్దతు ఉంటుందని, ఐరాస ఆధ్వర్యంలో నిష్పాక్షిక ప్రజాభిప్రాయ సేకరణ జరగాలని ఆయన డిమాండ్ చేశారు. సింధు జలాల ఒప్పందాన్ని భారత్ ఉల్లంఘించడం యుద్ధ చర్యతో సమానమని హెచ్చరించారు.

india-strong-counter-to-pakistan-at-united-nations-meet

పాక్ ప్రధాని ప్రసంగం అనంతరం భారత్ తన 'రైట్ ఆఫ్ రిప్లై' హక్కును వినియోగించుకుంది. భారత దౌత్యవేత్త పెటల్ గహ్లాట్ మాట్లాడుతూ.. పాక్ వాదనలను తీవ్రంగా తిప్పికొట్టారు. సభలో పాకిస్థాన్ ప్రధాని నుంచి ఓ హాస్యాస్పద నాటకాన్ని చూశామన్నారు. ఎన్ని నాటకాలు ఆడినా, ఎన్ని అబద్ధాలు చెప్పినా నిజాలను దాచలేరు" అని ఆమె స్పష్టం చేశారు. ఈ ఏడాది ఏప్రిల్ 25న జమ్మూకశ్మీర్‌లో పర్యాటకులపై జరిగిన మారణకాండకు బాధ్యత వహించకుండా, పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ 'రెసిస్టెన్స్ ఫ్రంట్'ను ఐరాస భద్రతా మండలిలో పాకిస్థాన్ కాపాడిందని గహ్లాట్ గుర్తుచేశారు.

ఒసామాను దాచిపెట్టిన దేశం..

ఉగ్రవాదాన్ని ఎగుమతి చేయడంలో, ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించడంలో పాకిస్థాన్‌కు సుదీర్ఘ చరిత్ర ఉంది. ఒసామా బిన్ లాడెన్‌ను దశాబ్దకాలం పాటు తమ దేశంలో దాచిపెట్టి, ఉగ్రవాదంపై పోరాటంలో భాగస్వామిగా నటించిన దేశం అది. తమ దేశంలో ఉగ్రవాద శిబిరాలు నడుపుతున్నామని వారి మంత్రులే ఇటీవల అంగీకరించారు. ఇప్పుడు ఆ దేశ ప్రధాని స్థాయిలోనూ అదే ద్వంద్వ నీతి కొనసాగడంలో ఆశ్చర్యం లేదు" అని ఆమె అన్నారు.

గత ఏప్రిల్‌లో పహల్గామ్‌లో 26 మంది పౌరులు ఉగ్రదాడిలో మరణించిన తర్వాత, 1960లో ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో కుదిరిన సింధు జలాల ఒప్పందంలో భాగస్వామ్యాన్ని భారత్ తాత్కాలికంగా నిలిపివేసింది. పాకిస్థాన్ సీమాంతర ఉగ్రవాదాన్ని ఆపే వరకు ఈ ఒప్పందాన్ని పునరుద్ధరించేది లేదని భారత్ స్పష్టమైన వైఖరితో ఉంది. అలానే అణు బెదిరింపులకు భయపడేది లేదని, ఉగ్రవాదులను, వారిని ప్రోత్సహిస్తున్న శక్తులను వదిలిపెట్టబోమని హెచ్చరించింది.

బెదిరింపులు.. వేడుకోవడం..

మే 9వ తేదీ వరకు భారత్‌పై మరిన్ని దాడులు చేస్తామని పాకిస్థాన్ బెదిరించింది. కానీ మే 10వ తేదీన మా దాడులతో వారి వైమానిక స్థావరాలు ధ్వంసమైన తర్వాత పోరాటాన్ని ఆపాలని పాక్ మిలిటరీయే మమ్మల్ని నేరుగా వేడుకుందని ఆమె గుర్తు చేశారు. ఈ విధ్వంసానికి సంబంధించిన చిత్రాలు బహిరంగంగానే అందుబాటులో ఉన్నాయని గుర్తుచేశారు. పాకిస్థాన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ మేజర్ జనరల్ కాషిఫ్ అబ్దుల్లా, భారత డీజీఎంఓ లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్‌కు ఫోన్ చేసి కాల్పుల విరమణ కోరిన విషయాన్ని ఆమె బయటపెట్టారు.

మూడో వ్యక్తి ప్రమేయం లేదు..

ఉగ్రవాదులను, వారి వెనకుండి నడిపిస్తున్న వారిని వేర్వేరుగా చూడబోమని.. ఇద్దరినీ బాధ్యులను చేస్తామని పేర్కొన్నారు. భారత్ చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్'ను సమర్థిస్తూ, అది కేవలం పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయడానికేనని వివరించారు. దశాబ్దాలుగా ఉగ్రవాద శిబిరాలను నడుపుతున్నామని పాక్ మంత్రులే అంగీకరించిన విషయాన్ని ఆమె ప్రస్తావించారు. ఇక కాల్పుల విరమణలో అమెరికా అధ్యక్షుడి జోక్యం ఉందన్న షరీఫ్ వాదనను కూడా ఆమె ఖండించారు. భారత్, పాకిస్థాన్ మధ్య ఏ సమస్య ఉన్నా ద్వైపాక్షికంగానే పరిష్కరించుకుంటామని.. ఇందులో మూడో వ్యక్తి ప్రమేయానికి తావులేదని ఆమె స్ప‌ష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+