రాత్రికి రాత్రి తిప్పి కొట్టిన కేంద్రం: భారత్ లోని పాకిస్తాన్ రాయబారికి సమన్లు సైతం..
పంజాబ్ సరిహద్దుల్లో చోటు చేసుకున్న తాజా పరిణామాల నేపథ్యంలో భారత్, పాకిస్తాన్ మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు మరోసారి ఒక్కసారిగా ఊపందుకున్నాయి. సరిహద్దు దాటి భారత్లోకి ప్రవేశించిన ఇద్దరు వ్యక్తులు బీఎస్ఎఫ్ బలగాల చేతిలో మృతి చెందడం దీనికి కారణమైంది. ఈ ఘటనపై ఈ రెండు దేశాలు భిన్నమైన వాదనలు వినిపిస్తోన్నాయి. వారంతా సరిహద్దు దాటి వచ్చిన చొరబాటుదారులుగా భారత్ పేర్కొంటుండగా, పొరపాటున అవతలి వైపునకు వెళ్లిన నిరాయుధ పౌరులని పాకిస్తాన్ చెబుతోంది.
పంజాబ్లోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి రాజోకే గ్రామం వద్ద అక్టోబర్ 2న ఇద్దరు వ్యక్తులు పాకిస్తాన్ వైపు నుంచి భారత్ భూభాగంపైకి ప్రవేశించడానికి ప్రయత్నించారు. వారిని గమనించిన బీఎస్ఎఫ్ జవాన్లు వెనక్కి వెళ్లిపోవాల్సిందిగా హెచ్చరించారు. అయినప్పటికీ వాళ్లు సరిహద్దు కంచె వైపు దూసుకురావడంతో జవాన్లు కాల్పులు జరపారు. ఈ ఘటనలో ఇద్దరు మరణించగా.. మరొకరు వెనక్కి వెళ్లిపోయాడు.

దీనిపై తార్న్ తారన్ జిల్లా డీఎస్పీ అతుల్ సోనీ కేసు నమోదు చేశారు. బీఎస్ఎఫ్ సిబ్బందిని రెచ్చగొట్టేలా ఆ చొరబాటుదారులు ప్రవర్తించారని తెలిపారు. పాకిస్తాన్ కేంద్రంగా సాగే డ్రగ్స్ స్మగ్లింగ్, అక్రమ చొరబాటుదారులతోనూ వీరికి సంబంధాలు ఉన్నాయని అనుమానిస్తోన్నట్లు పేర్కొన్నారు. సరిహద్దుల్లో ఉగ్రవాదం, చొరబాట్లు, డ్రగ్స్ రవాణాను అడ్డుకోవడంలో భాగంగా బీఎస్ఎఫ్ బలగాలు వారిపై కాల్పులు జరిపినట్లు చెప్పారు.
ఈ ఉదంతంపై పాకిస్తాన్ స్పందించింది. పాకిస్తాన్ లోని భారత రాయబార కార్యాలయ ప్రతినిధిని పిలిపించింది. తన నిరసనను తెలియజేసింది. మరణించిన ఇద్దరూ కూడా సామాన్య పౌరులని, వారివద్ద ఎటువంటి ఆయుధాలు లేవని తెలిపింది. పొరపాటున దారి తప్పి సరిహద్దులను దాటడానికి ప్రయత్నించినట్లు పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. చొరబాటుదారులనే ముద్రను తాము ఎంతమాత్రం అంగీకరించబోమని స్పష్టం చేసింది.
బీఎస్ఎఫ్ దళాల కాల్పులు అనవసరమైనవని, నిరాయుధులైన పౌరులపై కాల్పులు జరపడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థించలేమని పాకిస్తాన్ తెలిపింది. ఈ సంఘటనపై నిష్పాక్షిక దర్యాప్తు జరిపించాలని కోరింది. బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు ఆయా నివేదిక వివరాలను కూడా తమకు సమర్పించాలని సూచించింది. లిఖితపూరకంగా తన అభిప్రాయాలను పాకిస్తాన్ లోని భారత రాయబార కార్యాలయానికి పంపింది.
ఈ నేపథ్యంలో.. భారత్ సైతం అంతే ఘాటా రియాక్ట్ అయింది. ఈ ఆరోపణలను తిప్పికొట్టింది. భారత్ లో పాకిస్తాన్ ఛార్జ్ డి అఫైర్స్ కు సమన్లు ఇచ్చింది.. విదేశాంగ మంత్రిత్వ శాఖ. తన అభిప్రాయాలను వ్యక్తపరిచింది. పాకిస్తాన్ భూభాగం నుంచి నిరంతరం కొనసాగుతున్న చొరబాట్లపై అభ్యంతరం తెలిపింది. అదే సమయంలో పంజాబ్ సరిహద్దు ఘటనకు సంబంధించి పాకిస్తాన్ చేస్తున్న నిరాధార, ప్రేరేపిత ఆరోపణలను తిరస్కరిస్తోన్నామని స్పష్టం చేసింది. భవిష్యత్ లో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకూడదని పేర్కొంది.












Click it and Unblock the Notifications
