38 డిగ్రీల ఎండ.. అక్టోబర్ 6 నుంచి వాతావరణంలో భారీ మార్పు!
సాధారణంగా అక్టోబర్ నెల వచ్చిందంటే చాలు తెల్లవారుజామున చల్లనిగాలులు, స్వల్ప గులాబీ చలి పలకరిస్తుంది. కానీ ఈసారి మాత్రం పరిస్థితులు దానికి పూర్తిగా భిన్నంగా మారాయి. వానాకాలం వెళ్ళీవెళ్ళగానే ఉత్తరాదిలో ఎండలు మళ్లీ మండిపోతున్నాయి. రాజస్థాన్ నుంచి మొదలై దేశ రాజధాని ఢిల్లీ-ఎన్సీఆర్ పరిసర ప్రాంతాల వరకు భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఆకాశంలో మబ్బులు లేకపోవడం, గాలిలో తడి ఆరిపోయి పొడి వాతావరణం ఏర్పడటంతో ఎండ తీవ్రత పెరిగింది. సాధారణంగా వేసవి ముగిసిన తర్వాత వచ్చే ఈ ఉష్ణోగ్రతల తీవ్రతను 'అక్టోబర్ హీట్' అని పిలుస్తారు. ప్రస్తుతం రాజస్థాన్, ఢిల్లీ పరిసర వాసులు ఈ వేడి తాకిడికి ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
తాజా వాతావరణ పరిణామాలను పరిశీలిస్తే పశ్చిమ రాజస్థాన్లో ఎండ తీవ్రత అత్యధికంగా నమోదవుతోంది. శ్రీ గంగానగర్, బికనీర్ వంటి ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు ఏకంగా 35 నుంచి 38 డిగ్రీల సెల్సియస్ దాటి నమోదు కావడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రాజస్థాన్ అంతటా ఒకే రకమైన వాతావరణం లేనప్పటికీ, పశ్చిమ జిల్లాల్లో మాత్రం పగటిపూట నిప్పుల కొలిమిని తలపిస్తోంది. అయితే, పొడి వాతావరణం కారణంగా సూర్యాస్తమయం తర్వాత ఉష్ణోగ్రతలు వేగంగా పడిపోతుండటంతో రాత్రి పూట కాస్త ఉపశమనం లభిస్తోంది.

ఢిల్లీని తాకుతున్న వేడిగాలులు
కేవలం రాజస్థాన్లోనే కాకుండా దేశ రాజధాని ఢిల్లీతో పాటు హర్యానా, పంజాబ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్ ప్రాంతాల్లోనూ పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతున్నాయి. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం.. ఢిల్లీలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 34 నుంచి 36 డిగ్రీల సెల్సియస్ వరకు చేరుకున్నాయి. వర్షాలు లేకపోవడం, గాలి వేగం తగ్గడంతో ఈ అక్టోబర్ ప్రారంభం లోనే భానుడి వేడి స్పష్టంగా కనిపిస్తోంది. పగటి వేళ బయటకు రావాలంటేనే ప్రజలు జంకుతున్నారు.
అక్టోబర్ 6 నుంచి వాతావరణంలో మార్పు: వెస్ట్రన్ డిస్టర్బెన్స్ ఎంట్రీ
ఈ వేడి తాకిడి నుంచి త్వరలోనే ఉపశమనం లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అక్టోబర్ 6 నుంచి పశ్చిమ హిమాలయ ప్రాంతాల మీదుగా ఓ బలమైన 'వెస్ట్రన్ డిస్టర్బెన్స్' (పశ్చిమ దిశ నుంచి వచ్చే గాలుల సముదాయం) ప్రవేశించనుంది. దీని ప్రభావంతో హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ కొండ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఈదురుగాలులతో కూడిన ఉరుములు పడే అవకాశం ఉంది. ఆ తర్వాత ఈ వాతావరణ వ్యవస్థ మైదాన ప్రాంతాల వైపు కదులుతుంది.
కూల్ కానున్న ఉత్తరాది: త్వరలోనే చల్లని జల్లులు
అక్టోబర్ 6, 7 తేదీల నాటికి పంజాబ్, హర్యానా, ఛండీగఢ్, ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో మేఘాలు అలుముకుని వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ వర్షాల వల్ల పగటి పూట ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. ఆకాశం మేఘావృతమై చల్లనిగాలులు వీయడంతో ప్రస్తుతం సతాస్తున్న 'అక్టోబర్ హీట్' నుంచి ఉత్తరాది ప్రజలకు పూర్తిస్థాయి ఉపశమనం లభించనుంది.














Click it and Unblock the Notifications
