పాకిస్థాన్ అంతటా భారత్ ఉత్పత్తులే.. మూడు నెలల్లో 69 శాతానికి.. నిషేధం ఉన్నా తగ్గేదేలే..!
భారత్- పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. గతేడాది ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్ అనంత్ నాగ్ జిల్లాలోని పహల్గామ్ లోయలో ఉగ్రమూకలు జరిపిన మారణ హోమంలో 26 మంది అమాయక టూరిస్టులు ప్రాణాలు కోల్పోయారు. అయితే ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్ ఈ ఘటన వెనకున్నట్లు తేలిన నేపథ్యంలో.. పాకిస్థాన్ పై భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టిన విషయం తెలిసిందే. పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని 9 కీలక ఉగ్ర స్థావరాలపై దాడులు చేసి వాటిని పూర్తిగా ధ్వంసం చేసింది. వందలాది మంది ఉగ్రవాదులను ఏరివేసింది.
అంతేకాక పాకిస్థాన్ కు కీలకమైన 1960 నాటి సింధూ జలాల పంపిణీ ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది. దాంతో పాకిస్థాన్ లో నీటి సమస్య ఏర్పడింది. ఇక వీసాల రద్దు, ప్రయాణాల రద్దును అమల్లోకి తీసుకొచ్చింది. అలాగే పాకిస్థాన్ విమానాలను భారత గగనతలం మూసివేయగా.. అటు భారత్ విమానాలకు పాకిస్థాన్ గగనతలం మూసివేసింది. ఇంకా ఇరు దేశాల హై కమిషన్లలో గతంలో ఉన్న సిబ్బందిని తగ్గించింది. అలాగే కీలకమైన అట్టారీ వాఘా సరిహద్దును మూసివేసింది. అలాగే ఇరు దేశాల మధ్య వాణిజ్యం పూర్తిగా నిలిచిపోయింది. అక్కడి ఉత్పత్తులు భారత్.. భారత్ ఉత్పత్తులు పాకిస్థాన్ లో దాదాపు కనుమరుగు అయ్యాయి. ఇక భారత్- పాకిస్థాన్ మధ్య ఇలాంటి ఉద్రిక్త పరిస్థితులు ఉన్న తరుణంలో ఇప్పుడు ఓ కీలక నివేదిక అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
2026-27 ఆర్థిక సంవత్సరంలో పాకిస్థాన్.. భారత్ నుంచి ఏకంగా రూ. 5,876 కోట్ల విలువైన ఉత్పత్తులను దిగుమతి చేసుకుంది. కానీ భారత్ మాత్రం పాకిస్థాన్ నుంచి ఎలాంటి ఉత్పత్తుల్ని దిగుమతి చేసుకోలేదు. ఓ వైపు ఇరు దేశాల మధ్య వాణిజ్యంపై నిషేధం ఉన్నా.. భారత్ ఉత్పత్తులు పాకిస్థాన్ కు ఎలా చేరాయి..? అన్న ప్రశ్న తలెత్తుతోంది. ఈ క్రమంలో భారత్ ఉత్పత్తులకు పాకిస్థాన్ లో భారీ డిమాండ్ ఉన్నట్లు స్పష్టం అవుతోంది. గతేడాది మొదటి త్రైమాసికంలో భారత్ నుంచి పాకిస్థాన్ రూ.3,478 కోట్ల విలువైన ఉత్పత్తులను దిగుమతి చేసుకోగా ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో భారత్ నుంచి పాకిస్థాన్ ఏకంగా రూ. 5,876 కోట్ల విలువైన ఉత్పత్తుల్ని దిగుమతి చేసుకుంది. అంటే గతేడాదితో పోల్చితే ఈ ఏడాది ఉత్పత్తుల దిగుమతి విలువ ఏకంగా 69 శాతం పెరగడం గమనార్హం. అయితే ఇదే పీరియడ్ లో పాకిస్థాన్ నుంచి భారత్ కు ఎలాంటి ఉత్పత్తులు రాలేదు.

ఇక ఈ కీలకమైన డేటాను స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్థాన్ వెల్లడించినట్లు పాకిస్థాన్ కు చెందిన డాన్ న్యూస్ పేపర్ తన కథనంలో పేర్కొంది. అయితే ఈ అంశంపై నిపుణులు పలు విధాలుగా అభిప్రాయపడుతున్నారు. భారత్ నుంచి పాకిస్థాన్ కు ఉత్పత్తులు డైరెక్ట్ గా కాకుండా థర్డ్ కంట్రీస్ అయిన యూఏఈ, సింగపూర్ మీదుగా అక్కడికి చేరినట్లు అభిప్రాయపడుతున్నారు. ఇక భారత్ నుంచి పాకిస్థాన్ కు చేరిన ఉత్పత్తుల్లో అత్యధికంగా ఫార్మా ఉత్పత్తులే ఉన్నాయి. ఫార్మా ఉత్పత్తులతోపాటు ప్లాస్టిక్, పెట్రోలియం, డైస్, ఆర్గానిక్ కెమికల్స్, రబ్బర్, కాఫీ, టీ, వెజిటేబుల్స్, సుగంధ ద్రవ్యాలు, డైరీ ఉత్పత్తులు, తృణధాన్యాలు ఉన్నాయి.












Click it and Unblock the Notifications
