US Elections: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రవాస భారతీయుల మద్దతెవరికి..!!
అమెరికా అధ్యక్ష సమరానికి కౌంట్ డౌన్ మొదలైంది. అధ్యక్ష ఎన్నికల్లో నువ్వా నేనా అన్నట్లుగా ట్రంప్- కమలా హారీస్ పోటీ పడుతున్నారు. అమెరికా ఎన్నికల్లో భారతీయ అమెరికన్ల పాత్ర కీలకంగా మారుతోంది. పలు రాష్ట్రాల్లో వారి మద్దతు డిసైడింగ్ ఫ్యాక్టర్ గా కనిపిస్తోంది. సర్వే సంస్థల రిపోర్ట్స్ లో ఆసక్తి కర అంశాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో..ఇరు పార్టీలు వీరి మద్దతు కోసం చివరి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇంతకీ మెజార్టీ మద్దతు దక్కేది ఎవరికి.
కీలక పాత్ర
అమెరికా ఎన్నికలు ఈ సారి గతం కంటే భిన్నంగా కనిపిస్తున్నాయి. ఈ సారి హోరా హోరీ సమరం తప్పేలా లేదు. రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధిగా ముచ్చటగా మూడో సారి ట్రంప్ అధ్యక్ష రేసులో ఉన్నారు. డెమోక్రటిక్ పార్టీ నుంచి భారతీయ కుటుంబ మూలాల నుంచి వచ్చిన ప్రస్తుత అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారీస్ పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో భారతీయ ప్రవాసులు కీలక పాత్ర పోషించనున్నారు. భారతీయ మూలాలు ఉన్నా కమలా హరీస్ పైన భారతీయ అమెరికన్లలో భిన్నాభిప్రాయాలు కనిపిస్తున్నాయి. అదే సమయంలో ట్రంప్ పైన ఆశించిన స్థాయిలో సానుకూలత కనిపించటం లేదు.

ఎవరికి మద్దతు
అధ్యక్షుడిగా ట్రంప్ పని తీరు..వ్యవహార శైలి పైన పూర్తి అవగాహన ఉండటంతో మద్దతు పైన ఆచి తూచి స్పందించారు. ట్రంప్ కంటే ఒక విధంగా భారతీయ అమెరికన్లలో కమలా వైపే ఎక్కువగా మొగ్గు కనిపిస్తున్నట్లు ప్రవాస భారతీయ సంఘాల నేతలు చెబుతున్నారు. తాను అధ్యక్షుడిగా గెలిస్తే వలసదారుల విషయంలో తీసుకునే చర్యల పైన ట్రంప్ చేస్తున్న ప్రకటనలు వ్యతిరేకతకు కారణంగా మారుతున్నాయి. సర్వే సంస్థల అంచనాల ప్రకారం భారతీయ అమెరికన్లలో 68 శాతం మంది కమలా హరిస్ కు మద్దతుగా ఉండగా.. 29 శాతం మంది మాత్రమే ట్రంప్ కు అనుకూలంగా ఉన్నట్లు వెల్లడైంది.
ఆ రాష్ట్రాల్లో కీలకం
అమెరికాలోని జార్జియా, కాలిఫోర్నియా, టెక్సాస్, న్యూజెర్సీ వంటి రాష్ట్రాల్లో భారతీయ అమెరికన్లు
పెద్ద సంఖ్యలో ఉండటంతో అక్కడ వారి మద్దతు కోసం రెండు పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. తాజా లెక్కల ప్రకారం అమెరికాలో దాదాపు 4.8 మిలియన్ల భారతీయ అమెరికన్లు ఉన్నారు. వీరిలో 21% మంది తాము ఇండియన్ అమెరికన్లుగా చెప్పుకుంటున్నారు. భారత్ - అమెరికా మధ్య సంబంధాల విషయంలోనూ డెమోక్రాట్ అధ్యక్షుల సమయంలోనే పురోగతి ఉందనే అభిప్రాయం కనిపిస్తోంది. ఇదే సమయంలో భారతీయ అమెరికన్లు స్థానికంగా అనేక సంఘాలు ఏర్పాటు చేసుకొని తమ కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. దీంతో.. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో వీరి మద్దతు ఎవరికి దక్కుతుంది.. ఎవరి విజయానికి దోహదం చేస్తుందనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారింది.












Click it and Unblock the Notifications