కళ్లముందే విగతజీవిగా.. పెళ్లైన కొద్ది గంటలకే ఘోర విషాదం!
వందలాది మంది బంధుమిత్రుల సమక్షంలో ఎంతో వైభవంగా పెళ్లి జరిగింది. అంతా సంతోషంగా కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్న వేళ వాతావరణం రూపంలో మృత్యువు ముంచుకొచ్చింది. జీవితాంతం కలిసి ఉంటామని ప్రమాణం చేసిన కొద్ది గంటల్లోనే ఆ నూతన వధూవరుల జీవితాల్లో ఊహించని విషాదం నిండింది. అమెరికాలో జరిగిన ఘోర హెలికాప్టర్ ప్రమాదంలో కేరళ మూలాలున్న 25 ఏళ్ల పైలట్ డేవ్ ఫిజీ దుర్మరణం పాలయ్యాడు. ఆయన భార్య జెస్సీ తీవ్ర గాయాలతో ప్రాణాలతో బయటపడింది. ఎంతో వైభవంగా జరిగిన వివాహ వేడుక ముగిసిన వెంటనే ఈ దారుణం జరగడంతో కేరళ నుంచి అమెరికాకు వలస వెళ్లిన డేవ్ తల్లిదండ్రులు తీవ్ర దిగ్భ్రాంతికి, గుండెకోతకు గురయ్యారు. ప్రమాదం జరిగిన 5 గంటల తర్వాత స్పృహలోకి వచ్చిన భార్య జెస్నికి ఎదురైన భయానక దృశ్యం కన్నీళ్లు తెప్పిస్తోంది.
వందలాది మంది అతిథుల మధ్య వైభవంగా పెళ్లి
అట్లాంటా నివాసి అయిన డేవ్ ఫిజీ ప్రసిద్ధ 'డెల్టా ఎయిర్ లైన్స్'లో పైలట్‌గా పనిచేస్తున్నాడు. శుక్రవారం జార్జియాలోని డాసన్‌విల్లే సమీపంలో ఉన్న 'ది రివెరె' అనే వేదికపై డేవ్, జెస్నిల వివాహం వందలాది మంది బంధుమిత్రుల సమక్షంలో అత్యంత ఘనంగా జరిగింది. డేవ్ తల్లిదండ్రులు జార్జ్, ఫీబా ఫిజీ చాలా ఏళ్ల క్రితమే కేరళలోని ఎర్నాకులం నుంచి అమెరికాకు వలస వచ్చారు. అలాగే వధువు జెస్ని కుటుంబానికి కూడా కేరళలోని ఆలప్పుజ జిల్లాతో మూలాలు ఉన్నాయి. "అది ఒక పర్‌ఫెక్ట్ వెడ్డింగ్.. దేవుడు మాకిచ్చిన అపురూపమైన కానుక" అంటూ డేవ్ తండ్రి జార్జ్ కన్నీరుమున్నీరయ్యాడు.

వాతావరణం అనుకూలించకపోయినా ప్రయాణం
పెళ్లి వేడుకలు రాత్రి 9:30 గంటల ప్రాంతంలో ముగిశాయి. ప్లాన్ ప్రకారం కొత్త జంట హెలికాప్టర్‌లో పీచ్‌ట్రీ-డెకాల్బ్ విమానాశ్రయానికి చేరుకుని, అక్కడ నుంచి అట్లాంటా డౌన్‌టౌన్‌లోని ఓ హోటల్‌లో రాత్రి గడపాల్సి ఉంది. అయితే రాత్రి వేళ వాతావరణం పూర్తిగా క్షీణించి, భారీ వర్షం, దట్టమైన పొగమంచు అలుముకున్నాయి. స్వయంగా పైలట్ అయిన డేవ్.. ఈ వాతావరణంలో ప్రయాణించడం సురక్షితం కాదని, తాము ఫ్లైట్ ఎక్కబోమని తండ్రితో చెప్పాడు. కానీ హెలికాప్టర్ ప్రధాన పైలట్ ఎక్కువ ఎత్తులో ప్రయాణించవచ్చనే నమ్మకంతో టేకాఫ్ తీసుకున్నాడు. కొద్దిసేపటికే ఐదు సీట్ల 'రాబిన్సన్ R66' హెలికాప్టర్ దట్టమైన అడవులు, పర్వత ప్రాంతాలు ఉన్న డాసన్‌విల్లే నైరుతి భాగంలో కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో డేవ్‌తో పాటు హెలికాప్టర్ పైలట్ కూడా అక్కడికక్కడే మరణించాడు.
శిథిలాల కింద 5 గంటలు నరకయాతన.. భర్త చనిపోయాడని తెలిసి కన్నీరు
ప్రమాదం జరిగిన తర్వాత దట్టమైన చెట్లు, హెలికాప్టర్ శిథిలాల మధ్య వధువు జెస్ని దాదాపు 5 గంటల పాటు చిక్కుకుపోయింది. వృత్తిరీత్యా నర్స్ అయిన జెస్ని స్పృహలోకి వచ్చేసరికి డేవ్ ఆమె ఛాతీపై పడి ఉన్నాడు. ఆమె అతడిని తాకి పిలిచినప్పటికీ అప్పటికే డేవ్ శరీరం చల్లబడిపోయింది. దట్టమైన అడవి కావడం వల్ల రెస్క్యూ టీమ్‌లు ఆఫ్-రోడ్ వాహనాలతో, చెట్లను నరుక్కుంటూ ఘటనా స్థలానికి చేరుకోవడానికి 6 గంటల సమయం పట్టింది. జెస్నికి ఒంటిపై తీవ్రమైన గాయాలైనప్పటికీ, ఎముకలు విరగకపోవడం అద్భుతమనే చెప్పాలి. కానీ కళ్లముందే భర్తను కోల్పోవడంతో ఆమె పూర్తిగా మానసిక క్షోభకు గురైంది.
దర్యాప్తు ప్రారంభించిన ఎన్టీఎస్బీ
ఈ ప్రమాదంపై స్థానిక డాసన్ కౌంటీ షెరీఫ్ ఆఫీస్, ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ప్రాథమిక సమాచారాన్ని సేకరించాయి. ప్రమాదానికి గురైన హెలికాప్టర్ 'ప్రెస్టీజ్ హెలికాప్టర్స్' సంస్థకు చెందినది. గత 4 దశాబ్దాలుగా క్లీన్ సేఫ్టీ రికార్డ్ ఉన్న తమ సంస్థలో ఇలాంటి ప్రమాదం జరగడం ఇదే మొదటిసారి అని ఆ సంస్థ ఆపరేషన్స్ డైరెక్టర్ ఆండీ విటేకర్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ (NTSB) ఈ ప్రమాదంపై సమగ్ర దర్యాప్తును చేపట్టింది. పూర్తి వివరాలతో కూడిన ప్రాథమిక నివేదిక 30 రోజుల్లో వచ్చే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications