‘యూ.. ఇండియన్.. నీకు ఈ శాస్తి జరగాల్సిందే’: ఆస్ట్రేలియాలోనూ జాతి వివక్ష!
ఆస్ట్రేలియాలో కూడా జాత్యహంకారం పడగ విప్పింది. ఓ భారత క్యాబ్ డ్రైవర్‌పై ఇద్దరు దారుణంగా దాడి చేశారు. పిడిగుద్దులు కురిపిస్తూ, కాళ్లతో తన్నుతూ ఇష్టమొచ్చిన రీతుల్లో బయటకు చెప్పరాని మాటలన్నీ అనేశారు.
సిడ్నీ: ఆస్ట్రేలియాలో కూడా జాత్యహంకారం పడగ విప్పింది. ఓ భారత క్యాబ్ డ్రైవర్‌పై ఇద్దరు దారుణంగా దాడి చేశారు. పిడిగుద్దులు కురిపిస్తూ, కాళ్లతో తన్నుతూ ఇష్టమొచ్చిన రీతుల్లో బయటకు చెప్పరాని మాటలన్నీ అనేశారు.
'యూ.... ఇండియన్.. నీకు ఈ శాస్తి జరగాల్సిందే' అంటూ ఏదో అతడిపై ఎంతోకాలంగా పగ ఉన్నట్లు వ్యవహరించారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సదరు క్యాబ్ డ్రైవర్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
వివరాల్లోకి వెళితే... పర్దీప్ సింగ్(25) అనే వ్యక్తి ఆస్ట్రేలియా పరిధిలోని టాస్మానియాలో చదువుకుంటూ మరోపక్క క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతడు శనివారం రాత్రి పదిన్నర గంటల ప్రాంతంలో మెక్‌డోనాల్డ్ రెస్టారెంట్ వద్ద ఇద్దరు వ్యక్తులను ఎక్కించుకున్నాడు.

ఆ ఇద్దరిలో ఒకరు మహిళ. కారు నడుపుతున్న సమయంలో ఆమె డోర్ ఓపెన్ చేసి ఉంచడంతో ప్రమాదం జరుగుతుందని, అలా చేయకూడదని డ్రైవర్ పర్దీప్ సింగ్ గట్టిగా చెప్పాడు. కారుకు ఏదైనా అయితే, కచ్చితంగా నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేశాడు. దీంతో వారు అతడిని తిడుతూ, కొడుతూ కారును కూడా ధ్వంసం చేశారు. 'బ్లడీ ఇండియన్..' అంటూ ఇంకా చేప్పలేని పలు మాటలు అన్నారు.
అతడిపై వారు దాడి చేస్తుండగా ఆ దారిన వెళుతున్న వారు వచ్చి అడ్డుకుని, అంబులెన్స్ ను పిలిచి డ్రైవర్ పర్దీప్ సింగ్ ను ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.












Click it and Unblock the Notifications