ఇండోనేషియా నేవీ సబ్‌మెరైన్ సముద్రంలోనే మునిగిపోయింది: 53 మంది ప్రాణాలు నీటిలోనే..
జకార్తా: ఐదు రోజుల క్రితం బాలి సమీపంలో అదృశ్యమైన తమ దేశానికి చెందిన జలాంతర్గామి (సబ్‌మెరైన్) సముద్రంలో మునిగిపోయిందని ఇండోనేషియా నేవీ శనివారం వెల్లడించింది. ఆ జలాంతర్గామికి చెందిన పలు శకలాలు లభించాయని పేర్కొంది. ఇక జలాంతర్గామిలోని వారెవరూ బతికి ఉంటారని ఆశలేదని ప్రకటించింది.
ఇండోనేషియా నేవీ చీఫ్ అడ్మిరల్ యూడో మార్గోనో శనివారం మాట్లాడుతూ.. అదృశ్యమైన జలాంతర్గామికి సంబంధించిన పలు శకలాలను రెస్కూ బృందాలు గుర్తించాయని తెలిపారు. టొర్పెడో స్ట్రెయిటనర్ భాగాలు, ఓ గ్రీసు బాటిల్, ప్రేయర్ రగ్స్, తదితర వస్తువులను లభించాయని తెలిపారు.

తమకు లభించిన ఆధారాల ప్రకారం.. ఆ జలాంతర్గామి సముద్రంలో మునిగిపోయిందని భావిస్తున్నట్లు సదరు అధికారి మీడియాకు తెలిపారు. జలాంతర్గామిలో ఉన్న ఏ ఒక్కరూ కూడా ప్రాణాలతో బయటపడే అవకాశం లేదన్నారు. అందుకే అధికారికంగా జలాంతర్గామి సముద్రంలో మునిగిపోయిందని ప్రకటిస్తున్నామని తెలిపారు.
జలాంతర్గామిలో ఉన్న ఆక్సిజన్ శనివారం ఉదయం నాటికి ఖాళీ అయిపోయి ఉంటుందని, దీంతో అందులో ఉన్న 53 మంది కూడా ప్రాణాలు కోల్పోయి ఉంటారని చెప్పారు.
కాగా, సముద్రంలో అదృశ్యమైన జలాంతర్గామి కోసం రెండ్రోజుల క్రితం భారత నావికా దళానికి చెందిన రెస్క్యూ టీంలు వెళ్లగా.. శనివారం ఉదయం అమెరికాకు చెందిన టీంలు, ఆస్ట్రేలియా టీంలు రంగంలోకి దిగాయి. అయితే, శకలాలు లభించడంతో జలాంతర్గామి మునిగిపోయిందని ఇండోనేషియా నేవీ ప్రకటించడంతో ఈ టీంలు వెనక్కి బయల్దేరాయి.












Click it and Unblock the Notifications