ద్వీపాలను లీజుకిస్తారట.. తీసుకుంటారా?
ఇండోనేషియా ప్రభుత్వం తన ఆధీనంలోని ద్వీపాలను ఆసక్తి గలవారికి, పెట్టుబడిదారులకు దీర్ఘ కాలంపాటు లీజుకు ఇచ్చేందుకు సిద్దంగా ఉంది.
ఇండోనేషియా: తీర ప్రాంత దేశాలకు అద్భుతమైన ప్రాంతాలు, ద్వీపాలు ఉంటాయి. అవి పర్యాటక ప్రాంతాలుగా మారి ప్రభుత్వానికి ఆదాయం కూడా తెచ్చిపెడతాయి. అలాంటి ద్వీపాలని ప్రభుత్వాలు కూడా జాగ్రత్తగా కాపాడుకుంటాయి.
అయితే, ఇండోనేషియా ప్రభుత్వం మాత్రం తమ ఆధీనంలోని ద్వీపాలను ఆసక్తి గలవారికి, పెట్టుబడిదారులకు దీర్ఘ కాలంపాటు లీజుకు ఇచ్చేందుకు సిద్దంగా ఉంది. ఇండోనేషియాకు వేల సంఖ్యలో ద్వీపాలు ఉన్నాయి.

వేల సంఖ్యలో ద్వీపాలు...
గత ఏడాది ఆగస్టులో వెలువడిన ఓ నివేదిక ప్రకారం.. ఇండోనేషియా ఆధీనంలో 14,752 ద్వీపాలున్నట్లు గుర్తించారు. వాటిలో 6 వేలకు పైగా ద్వీపాలలో ప్రజలు నివాసం ఉంటున్నారు. అవన్నీ పర్యాటక ప్రాంతాలుగా గుర్తింపు పొందాయి.
అయితే మరో సంస్థ చేపట్టిన సర్వేలో మొత్తం 18,300 ద్వీపాలు ఉన్నట్లు తేలింది. కొన్ని ద్వీపాలకు అక్కడి ప్రభుత్వమే పేర్లు పెట్టి, వాటి నిర్వహణ బాధ్యతలు చూసుకుంటోంది.

నిర్వహణ భారమై...
ఇవి కాకుండా పేరు, నిర్వహణలో లేని ఐలాండ్లు ఇంకా చాలా ఉన్నాయి. అన్ని వేల ద్వీపాల నిర్వహణ చూసుకోవడం ఇండోనేషియా ప్రభుత్వానికి భారంగా కూడా మారింది.

చైనా దురాక్రమణ...
మరోపక్క దక్షిణ చైనా సముద్రంలో ఉన్న ఇండోనేషియన్ ఐలాండ్ల పై చైనా దురాక్రమణలకు పాల్పడుతోంది. దీంతో బాగా ఆలోచించిన ఇండోనేషియా ప్రభుత్వం ఓ పథకాన్ని ప్రవేశపెట్టింది.

లీజుకు ఇచ్చేస్తోంది...
ఈ పథకం ప్రకారం ఎవరైనా సరే.. ఇండోనేషియాకు చెందిన ద్వీపాలను లీజుకు తీసుకోవచ్చు. అలా లీజుకు తీసుకున్నవారు.. వారి పెరుగాని లేదంటే వారికి ఇష్టమైన వారి పెరుగాని ఆ ద్వీపానికి పెట్టుకోవచ్చు.

పర్యాటక ప్రాంతంగా...
ఇలా లీజుకు ద్వీపాన్ని తీసుకున్నవారు అక్కడ నిర్మాణాలు చేపట్టవచ్చు, దానిని పర్యాటక ప్రాంతంగా మార్చుకోవచ్చు. ఇందుకు అక్కడి ప్రభుత్వం అభ్యంతరం చెప్పదు, కాకపొతే.. ద్వీపాలను లీజుకు తీసుకున్న వారు ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి సరైన నివేదికలు సమర్పించాలి.

ఇప్పటికే జపాన్, సింగపూర్...
ఇలా ద్వీపాలను లీజుకు తీసుకునే కార్యక్రమం మొదలైంది. ఇప్పటికే జపాన్ పెట్టుబడిదారులకు మొరోటాయ్ ఐలాండ్ ను లీజుకు ఇచ్చేందుకు ఇండోనేషియా ప్రభుత్వం సిద్ధమైంది. ఈ ఐలాండ్ లో వృద్ధ జపనీయులకు నివాసం కల్పించేందుకు ప్రణాలికలు వేస్తున్నారట. అలాగే ద్వీపాలను లీజుకు తీసుకునే జాబితాలో సింగపూర్ కూడా ఉన్నట్లు అక్కడి అధికారులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications