విన్యాసాలు: నాగు కాటుకు లేడీ పాప్ సింగర్ మృతి
ఇండోనేషియా: విష సర్పంతో విన్యాసాలు చేసిన లేడీ పాప్ సింగర్ ఇమ్రా బులే (29) ఆ పాము కాటుకే బలయ్యారు. వేదికపై పాటలు పాడే సమయంలో తన మధురమైన స్వరంతో అలరించడమే కాకుండా సర్పాలతో విన్యాసాలు చేయడం కూడా ఆమెకు అలవాటు.
ఆ ప్రమాదకరమైన అలవాటే పాప్ సింగర్ ప్రాణాలు తీసింది. వెస్ట్ జావాలోని కారవాంగ్ గ్రామంలో ఇచ్చిన ఓ ప్రదర్శనలో ఇమ్రా పాటలు పాడుతూ మధ్యమధ్యలో రియాంటీ అనే పాముతో విన్యాసాలు చేసింది. అలా చేసే సమయంలో వేదికపై అటూ ఇటూ కదులుతూ ఓసారి అనుకోకుండా ఆ పాము తోకను తొక్కింది.

ఆ పాము ఒక్కసారిగా బుస కొట్టి ఆమె తొడమీద కాటు వేసింది. పాముల పర్యవేక్షకుడు దాన్ని పట్టుకుని లాగాడు. అయినా ఫలితం కనిపించలేదు. అప్పటికే ఆపాము విషం ఆమె శరీరంలోకి ఎక్కేసింది. ఈ సంఘటన ఆదివారంనాడు జరిగింది.
కోరలు తీసిన విషం లేని పాములతోనే ఎప్పుడూ ఆమె విన్యాసాలు చేసేది. అందువల్ల ఇది కూడా విషం లేని పామే అని ప్రదర్శన సాగించినట్లు ఉంది. చికిత్స చేయించడానికి నిరాకరించింది. దాంతో పాము కాటేసిన తర్వాత 45 నిమిషాల పాటు ప్రేక్షకులను అలరించి ఒక్కసారిగా నురగలు కక్కుతూ వేదికపైనే కుప్పకూలింది. అనంతరం ఆమెను పరీక్షించిన వైద్యులు ఇమ్రా మృతి చెందినట్లు నిర్ధారించారు.












Click it and Unblock the Notifications