సింధూ జలాల ఒప్పందం నిలిపివేత! యుద్ధమేనంటూ పాక్ సంచలన నిర్ణయాలు
Pahalgam Terror Attack: జమ్మూకాశ్మీర్‌లోని పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపి మారణ హోమాన్ని సృష్టించిన క్రమంలో భారత్ తీవ్రంగా స్పందించిన విషయం తెలిసిందే. సీమాంతర ఉగ్రవాదానికి ముగింపు పలికే వరకు పాకిస్థాన్‌తో సింధూ నదీ జలాల ఒప్పందాన్ని తక్షణమే నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. దీనిపై తాజాగా పాక్ తన అక్కసు వెళ్లగక్కింది.
సింధూ నదీ జలా ఒప్పందం అమలును నిలిపివేస్తూ భారత్ తీసుకున్న నిర్ణయం చట్ట విరుద్ధమని పాక్ వ్యాఖ్యానించింది. ప్రపంచ బ్యాంక్ వంటి అంతర్జాతీయ సంస్థలు మధ్యవర్తిగా ఉన్న ఈ ఒప్పందం నుంచి ఏకపక్షంగా వైదొలిగే అవకాశం లేదని వాదిస్తోంది. సింధూ నదీ జలాల ఒప్పందం నిలిపివేతతో నీటి యుద్ధానికి తెరతీస్తున్నారని పాక్ వ్యాఖ్యానించింది. ఈ జలాల్లో ప్రతి నీటి చుక్కా మాదేనని చెప్పుకొచ్చింది. ఈ హక్కును తాము చట్టపరంగా, రాజకీయంగా, అంతర్జాతీయంగా పూర్తి శక్తితో కాపాడుకుంటామని పాకిస్థాన్ మంత్రి అవాయిస్ లెఘారీ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు.

కాగా, ఏ దేశంతో కుదుర్చుకున్న ఒప్పందాన్నైనా రద్దు చేసుకునే హక్కు భారత్ కు ఉంటుంది. అంతర్జాతీయ ఒప్పందాలకు సంబంధించిన వియన్నా ఒప్పందంపై భారత్ సంతకం చేయలేదు కాబట్టి.. పాక్ ఏ కోర్టుకు వెళ్లినా.. అంతర్జాతీయ సంస్థకు వెళ్లినా వారు ఎలాంటి తీర్పు ఇచ్చినా అది భారత్‌కు వర్తించదు. కాగా, సింధూ జలాలపైనే 80 శాతం పాక్ వ్యవసాయం ఆధారపడి ఉండటం గమనార్హం. దీంతో పాక్ ఎడారిగా మారే అవకాశం కూడా లేకపోలేదు.
భారత్ విమానాలకు గగనతలం మూసివేసిన పాక్, కీలక నిర్ణయాలు
పహల్గాం ఉగ్రదాడులకు వ్యతిరేకంగా భారత్ తీసుకున్న నిర్ణయాలతో పాక్ కూడా కౌంటర్ చర్యలకు దిగుతోంది. సింధూ నదీ జలాల ఒప్పందం నిలిపివేతతో భారత్ యుద్ధానికి తెరతీసిందని పాక్ ఆరోపించింది. అంతేగాక, సైన్యానికి సెలవులు రద్దు చేసింది పాకిస్థాన్. ఒకవేళ భారత్ యుద్ధానికి దిగితే తిప్పికొట్టాలని పాక్ సైన్యానికి ఆదేశాలు జారీ చేసింది.
మరోవైపు, వాఘా బోర్డర్ ను కూడా మూసివేసింది. భారతీయులకు సార్క్ వీసాలను పాక్ నిలిపివేసింది. సిమ్లా ఒప్పందం సహా అన్ని ఒప్పందాలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. భారత విమానాలకు పాక్ తన గగనతలం మూసివేస్తున్నట్లు ప్రకటించింది. పాకిస్థాన్ లోని భారతీయులు 48 గంటల్లోగా దేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది. భారత్‌తో వాణిజ్య కార్యకలాపాలను కూడా రద్దు చేసుకుంది. ఎగుమతులు, దిగుమతులు రద్దు చేసుకుంది.












Click it and Unblock the Notifications