డొనాల్డ్ ట్రంప్ కు ఏడు కండిషన్లు పెట్టిన ఆ దేశం: అప్పుడు గానీ
అమెరికాతో కొనసాగుతోన్న ఉద్రిక్తతలు, యుద్ధ వాతావరణానికి పుల్ పెట్టేలా ఇరాన్ కీలక ప్రతిపాదనలను తెర మీదికి తెచ్చింది. దౌత్య మార్గాల్లో దీన్ని పరిష్కరించుకోవడానికి చొరవ చూపింది. ఇరు దేశాల మధ్య చర్చల పునరుద్ధరణ కోసం ఏడు షరతులను ప్రతిపాదించింది. ఖతార్ ప్రతినిధుల ద్వారా వీటిని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేరవేసింది. వీటిని అంగీకరించితే.. తక్షణమే యుద్ధాన్ని ముగిస్తామని తెలిపింది.
ఈ విషయాన్ని ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరీ మొహసిన్ రెజాయ్ అధికారికంగా ప్రకటించారు. ఈ చర్చల ప్రతిపాదనల్లో భాగంగా యుద్ధాన్ని ముగించడానికి ఇరాన్ ప్రధానంగా మూడు డిమాండ్లను డొనాల్డ్ ట్రంప్ ముందుంచింది ఇరాన్. తమ దేశ అన్ని సరిహద్దులు, వైమానిక, నౌక, ఆర్మీ విభాగాల్లో తక్షణమే దాడులను నిలిపివేయడం, అమెరికాలో స్తంభింపజేసిన ఆస్తులను విడుదల చేయడం, తమదేశంపై విధించిన నౌకాదళ దిగ్బంధనాన్ని ఎత్తివేయడం.. ఈ డిమాండ్లలో ముఖ్యమైనవి.

అమెరికా ఈ షరతులను అంగీకరిస్తేనే చర్చల ప్రక్రియ ముందుకు సాగుతుందని రెజాయ్ స్పష్టం చేశారు. ఇరాన్, అమెరికా మధ్య ప్రత్యక్ష దౌత్య సంబంధాలు లేకపోవడం వల్ల ఖతార్, పాకిస్తాన్.. ఈ వివాదాన్ని పరిష్కరించడానికి చురుగ్గా మధ్యవర్తిత్వం వహిస్తోన్నాయి. గతంలో ఈ రెండు దేశాల మధ్య కుదిరిన ఇస్లామాబాద్ అకార్డ్ విఫలమైన నేపథ్యంలో ఇరాన్ తాజా దౌత్య ప్రయత్నాలను చేపట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఒకవైపు దౌత్యపరమైన చర్చలకు మొగ్గు చూపుతూనే.. ఇరాన్ తన సైనిక సామర్థ్యాలు, యుద్ధ సన్నద్ధతను కూడా చేపడుతోంది. అరబ్ సముద్రం, ఒమన్ గల్ఫ్ ప్రాంతాల్లో విస్తరించి ఉన్న అమెరికా నౌకాదళ ఆస్తులపై తాము నిఘా ఉంచామని మొహసిన్ రెజాయ్ తెలిపారు. ఇటీవల అమెరికా యుద్ధ నౌకలకు సమీపంలో యాంటీ షిప్ క్షిపణులను విజయవంతంగా పరీక్షించామని, ఒకవేళ అమెరికా దాడులకు దిగితే ప్రతీకారం తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు.
అణువ్యాప్తి నిరోధక ఒప్పందం నుండి తప్పుకోవాలనే ఆలోచన ఏదీ ప్రస్తుతానికి తమకు లేదని ఆయన స్పష్టం చేశారు. తమదేశం శాంతియుత అణు విధానానికే కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. అమెరికా, ఇజ్రాయెల్ దేశాల సైనిక చర్యలు పరిధులు దాటితే, భవిష్యత్తులో తమ వ్యూహాన్ని మార్చుకోవాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు. అలాగే వ్యూహాత్మక హోర్ముజ్ జలసంధి విషయంలో ఒమన్‌తో కుదిరిన ద్వైపాక్షిక రక్షణ ఒప్పందం అమలుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు.














Click it and Unblock the Notifications
