Iran: ఇరాన్ సుప్రీం లీడర్‌పై మస్క్ కంపెనీ గరం.. కేవలం రెండు పోస్టులు చేయగానే..
Iran leader X account: ఇరాన్ చుట్టూ యుద్ధ మేఘాలు కమ్ముకున్న విషయం విధితమే. ఇజ్రాయెల్, ఇరాన్‌ల మధ్య పరిస్థితి పచ్చగడ్డి వేస్తే భగ్గమనేలా ఉంది. ఈ నేపథ్యంలో ఇజ్రాయేలీ అనుచరులతో హిబ్రూ భాషలో కమ్యూనికేట్ చేయడానికి వీలుగా ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతొల్లా అలీ ఖమేనీ X లో ఖాతాను ప్రారంభించారు. అయితే నిమిషాల వ్యవధిలోనే ఎలాన్ మస్క్ సంస్థ ఊహించని షాక్ ఇచ్చింది.
ఖాతా క్రియేట్ చేసిన కొన్ని గంటలకే ఆ అకౌంట్‌ను X సస్పెండ్ చేసింది. కేవలం రెండు పోస్టులు చేసిన తర్వాత ఈ చర్య తీసుకుంది. ఇజ్రాయెల్ దాడులకు తీవ్ర స్థాయిలో ప్రతీకారం తప్పదని హిబ్రూ భాషలో @Khamenei_Heb ద్వారా బెదిరింపు పోస్ట్ చేశారు. తన పోస్టులో 'జియనిస్ట్ ప్రభుత్వం ఒక తప్పు చేసింది. అది ఇరాన్ గురించి తప్పుడు లెక్కలు వేసుకుంది. ఇరాన్ శక్తి, సామర్థ్యాన్ని, పట్టుదల వారికి అర్థం అయ్యేలా చేస్తాము" అని పేర్కొన్నారు. ఈ పోస్ట్ నిబంధనలకు విరుద్ధంగా ఉండటంతో X ఆ ఖాతాను స్తంభింపచేసింది.

ఇరాన్‌లోని సైనిక స్థావరాలపై ఇజ్రాయెల్ ఎయిర్ స్ట్రైక్స్ నిర్వహించింది. ఇందులో నలుగురు సైనికులు మరణించినట్లు నివేదికలు వెల్లడించాయి. అక్టోబర్ 1న ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణి దాడికి సమాధానంగా చెబుతున్నారు. కాగా ఈ దాడిలో సుమారు 200 బ్యాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించబడ్డాయి. దీంతో చిర్రెత్తుకొచ్చిన ఖమేని ఇరాన్ అధికారులకు కీలక సూచనలు చేశారు. బలంగా, తగిన స్థాయిలో ప్రతిస్పందించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో విశ్లేషించాలని పిలుపునిచ్చారు.
హిబ్రూ భాషలో ప్రారంభించిన తన ఖాతాలో ఖమేని మొదటి పోస్టుగా "అల్లాహ్ అత్యంత దయాళుడు" అని రాశారు. తర్వాత ఇజ్రాయెల్‌ను విమర్శిస్తూ ఒక సందేశాన్ని పోస్ట్ చేసి అనంతరం వెంటనే X నుంచి తొలగించారు. దీనిపై ఇజ్రాయెల్ అత్యవసర స్పందన సంస్థ జాకా స్పందించింది. యూదుల ప్రార్థనలోని ఒక పంక్తిని ఉటంకిస్తూ, ఖమేని భవిష్యత్తుకు సంబంధించిన ఒక గోప్య సందేశాన్ని పంపించింది.












Click it and Unblock the Notifications