ముస్లీం దేశాలకు షాకిచ్చిన ట్రంప్‌కు ఇరాన్ ఝలక్
ఏడు ముస్లీం మెజారిటీ దేశాలపై అమెరికా వీసా నిషేధం విధించడంపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. తాము కూడా అమెరికన్లు తమ దేశంలోకి రాకుండా నిషేధం విధిస్తామని ఆ దేశ విదేశాంగ శాఖ ప్రకటించింది.
వాషింగ్టన్: ఏడు ముస్లీం మెజారిటీ దేశాలపై అమెరికా వీసా నిషేధం విధించడంపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. తాము కూడా అమెరికన్లు తమ దేశంలోకి రాకుండా నిషేధం విధిస్తామని ఆ దేశ విదేశాంగ శాఖ ప్రకటించింది.
అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం చట్ట విరుద్ధం, తర్కరహితం అని పేర్కొంది. ఇది ముస్లీం ప్రపంచాన్ని, ఇరాన్‌ను బహిరంగా అవమానించడమేనని పేర్కొంది. ఇది దేశాల మధ్య గోడలు కట్టాల్సిన సమయం కాదని, కొన్నేళ్ల క్రితమే బెర్లిన్ గోడ బద్దలైన విషయాన్ని ట్రంప్ మర్చిపోయినట్లున్నారని ఆ దేశ అధ్యక్షులు హసన్ రౌహానీ అన్నారు. ఏ దేశాల మధ్య అయినా ఇప్పటికే గోడలు ఉంటే, వాటిని కూల్చివేసే సమయమిది అని హసన్ వ్యాఖ్యానించారు.
కాగా, అమెరికాలోకి ముస్లిం దేశాల నుంచి వచ్చే శరణార్థులను తగ్గించేందుకు, ఇస్లామిక్ ఉగ్రవాదులను అమెరికాలోకి ప్రవేశించకుండా ఆపేందుకు అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఈ మేరకు ఆయన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేశారు.

ముస్లిం మెజార్టీ దేశాల నుంచి వలసలు తగ్గించేందుకు అక్కడి నుంచి వచ్చే వారిని చాలా జాగ్రత్తగా పరీక్షించే విధంగా నిబంధనలు రూపొందించే ఆదేశాలపై ఆయన సంతకం చేశారు. అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న వారం రోజుల అనంతరం తొలిసారి పెంటగావ్‌కు వెళ్లిన ట్రంప్ దీనిపై సంతకం చేశారు.
ఇస్లామిక్ ఉగ్రవాదులను అమెరికా బయటే ఉంచేందుకు అత్యంత క్లిష్టమైన నిబంధనలు తీసుకు వస్తున్నానని, ఉగ్రవాదులు ఇక్కడ ఉండాలని మేము అనుకోవడం లేదని ట్రంప్ ఆర్డర్‌పై సంతకం చేసిన తర్వాత అన్నారు.
అయితే ట్రంప్ ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేయడాన్ని హక్కుల సంఘాలు, సామాజిక కార్యకర్తలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇది చాలా ప్రమాదకరమైనదని హెచ్చరిస్తున్నారు. ఈ ఆర్డర్ ప్రకారం వలసదారులకు సంబంధించి కొత్త నిబంధనలు రూపొందించే వరకు ఇరాక్, సిరియా, ఇరాన్, సూడాన్, లిబియా, సోమాలియా, యెమెన్ దేశాలకు చెందిన పౌరులకు 90 రోజుల వరకు వీసాల జారీ నిలిపేస్తారు.
అలాగే అమెరికాలోని శరణార్థుల పునరావాస కార్యక్రమం కనీసం 120 రోజుల పాటు ఆపేస్తారు. సిరియా వలసదారుల్లో క్రిస్టియన్లకు ప్రాధాన్యమివ్వనున్నారు. అమెరికాకు మద్దతిచ్చే వారు, అమెరికన్లపై అభిమానం ఉన్న వారే ఇక్కడి రావాలని కోరుకుంటున్నామని ట్రంప్ పేర్కోన్నారు.












Click it and Unblock the Notifications