భారత్ అప్రమత్తం- ప్రయాణం రద్దు చేసుకోవాలి
Iran Israel War: లెబనాన్‌లో హెజ్బొల్లా అధినేత హసన్ నస్రల్లా దారుణ హత్యకు ప్రతీకార దాడులకు దిగింది ఇరాన్. ఇజ్రాయెల్‌పై దండెత్తింది. రెండు గంటల వ్యవధిలో 200 శక్తిమంతమైన బాలిస్టిక్ క్షిపణులను సంధించింది. రాజధాని టెల్ అవివ్ సహా అనేక ప్రాంతాలు ప్రస్తుతం ఇరాన్ టార్గెట్‌లోకి వచ్చాయి.
హెజ్బొల్లాను దాదాపుగా నామరూపాల్లేకుండా చేస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇజ్రాయెల్‌పై ఇరాన్ ప్రతీకార దాడులకు దిగుతుందనే విషయం ఊహించిందే అయినప్పటికీ- గతంలో ఎప్పుడూ లేని విధంగా ఇంత భారీ ఎత్తున మిస్సైళ్లతో దాడికి దిగడం అనేది చర్చనీయాంశమైంది. ప్రపంచ దేశాలను ఉలిక్కిపడేలా చేసింది.

హసన్ నస్రల్లా హత్యకు ప్రతీకారంగా మొన్నటికి మొన్న ఇజ్రాయెల్‌పై లెబనాన్ యుద్ధానికి దిగిన విషయం తెలిసిందే. ఇజ్రాయెల్‌పై విరుచుకుపడింది. జెరూసలెం సహా తమ దేశ భూభాగంపై పలు చోట్ల సైరెన్ మోతలు వినిపించినట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ తెలిపింది. ఇప్పుడు తాజాగా ఇరాన్ సైతం యుద్ధానికి దిగడం దిగ్భ్రాంతికి గురి చేస్తోంది.
ఇజ్రాయెల్‌పై ఇరాన్ యుద్ధానికి దిగిన పరిణామాలను దృష్టిలో ఉంచుకుని భారత్ అప్రమత్తమైంది. మధ్య తూర్పు దేశాల్లో నెలకొన్న యుద్ధ వాతావరణం, ఉద్రిక్త పరిస్థితులను క్షుణ్నంగా పరిశీలిస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెప్పించుకుంటోంది.
అదే సమయంలో ఇజ్రాయెల్‌లో నివసించే భారతీయుల కోసం పలు సూచనలు చేసింది. భారత పౌరులందరూ అప్రమత్తంగా ఉండాలని, సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలని కోరింది. స్థానిక అధికారులు ఎప్పటికప్పుడు జారీ చేసే సేఫ్టీ ప్రొటోకాల్స్‌ను అనుసరించాలని సూచించింది.
ఈ మేరకు ఇజ్రాయెల్‌లోని భారత రాయబార కార్యాలయం సేఫ్టీ ప్రొటోకాల్ అడ్వైజరీని జారీ చేసింది. అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటికి వెళ్లొద్దని, అనవసర ప్రయాణాలను రద్దు చేసుకోవాలని పేర్కొంది. ఇజ్రాయెల్ విదేశాంగ, రక్షణ, హోం మంత్రిత్వ శాఖ కార్యాలయాలతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నామని వివరించింది.
ముందు జాగ్రత్త చర్యగా ఎంబసీలో ప్రత్యేకంగా హెల్ప్‌లైన్‌ను నెలకొల్పింది. 24 గంటల పాటు అందుబాటులో ఉండే హెల్ప్ లైన్ ఇది. ఎలాంటి అవసరం వచ్చినా +972547520711, +972543278392 నంబర్లకు ఫోన్ చేయాలని, లేదా [email protected] అనే అడ్రస్‌కు మెయిల్ ద్వారా సంప్రదించవచ్చని సూచించింది.












Click it and Unblock the Notifications