ఇరాక్ ఫైటర్ ను కూల్చివేశాం: ఐఎస్ఐఎస్
బాగ్దాద్: వైమానిక దాడులు చెయ్యడానికి వచ్చిన ఇరాక్ ఫైటర్ జెట్ విమానాన్ని తాము కూల్చివేశామని ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్ఐఎస్) ఉగ్రవాదులు ప్రకటించారు. బాగ్దాద్ సమీపంలోని అంబార్ ప్రావిన్స్ లోని రామాది సమీపంలో ఫైటర్ జెట్ ను కూల్చి వేశామని ప్రచారం చేసుకుంటున్నారు.
ఇస్లామిక్ స్టేట్ లోని సున్నీ దళానికి చెందిన సవా అనే ఉగ్రవాది ట్విట్టర్ లో ఈ విషయం వెల్లడించాడు. అతను వెల్లడించిన వివరాల ప్రకారం రష్యాలో తయారు చేసిన ఎస్ యూ-25 ఇరాక్ ఫైటర్ జెట్ తమ మీద వైమానిక దాడులు చెయ్యడానికి వచ్చిందని అంటున్నాడు.

ఆ సమయంలో తాము కాల్పులు జరిపామని, జెట్ ఫైటర్ కు మంటలు వ్యాపించాయని అంటున్నాడు. చివరికి జెట్ ఫైటర్ రామాది నగరం సమీపంలో కుప్పకూలిపోయిందని వివరించాడు. అయితే ఇరాక్ ప్రభుత్వం నుండి అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు.
గత కొన్ని నెలల నుండి ఇరాక్ ప్రభుత్వం అమెరికాతో కలిసి ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదులు ఉంటున్న స్థావరాల మీద వైమానిక దాడులు చేస్తున్నది. ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులను పూర్తిగా అణచివేయాలని ఇరాక్ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది.












Click it and Unblock the Notifications