Israel Elections: ఓటింగ్ విధానం ఎలా ఉంటుంది? ప్రభుత్వాన్ని ఎలా ఏర్పాటు చేస్తారు?
ఇజ్రాయెల్ దేశ 78 ఏళ్ల సుదీర్ఘ చరిత్రలోనే అత్యంత కీలకమైన, ఉత్కంఠభరితమైన సార్వత్రిక ఎన్నికల పోరు ప్రారంభమైంది. 2023 అక్టోబర్ 7న హమాస్ జరిపిన విధ్వంసకర దాడి తర్వాత దేశంలో జరుగుతున్న మొట్టమొదటి ఎన్నికలు ఇవే కావడం విశేషం. ఈ పోలింగ్ కేవలం పార్లమెంట్ సభ్యుల ఎంపిక మాత్రమే కాకుండా, దేశంలో అత్యంత సుదీర్ఘకాలం ప్రధానిగా సేవాలందించిన బెన్యామిన్ నెతన్యాహు నాయకత్వానికి, ఆయన భవిష్యత్తుకు సంబంధించి పౌరులు ఇచ్చే ప్రధాన తీర్పుగా నిలవనుంది. 1988 తర్వాత ముందస్తు రద్దు లేకుండా, పూర్తి నాలుగేళ్ల కాలాన్ని పూర్తి చేసుకున్న ఏకైక పార్లమెంట్‌గా ఇది రికార్డు సృష్టించినప్పటికీ, నెతన్యాహు తన అధికార పీఠాన్ని కాపాడుకోవడానికి ఇప్పుడు తీవ్రంగా శ్రమించాల్సి వస్తోంది.
ఎన్నికల సమయం.. ఓటింగ్ విధానం ఎలా ఉందంటే?
26వ నెసెట్ లోని మొత్తం 120 స్థానాల భర్తీకి ఇవాళ పోలింగ్ జరుగుతోంది. దేశవ్యాప్తంగా పౌరులందరికీ సౌకర్యంగా ఉండేలా ఎన్నికల రోజును ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించారు. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఓటింగ్ ప్రక్రియ సాగుతుంది. 18 ఏళ్లు నిండిన అర్హులైన పౌరులందరూ తమ గుర్తింపు కార్డులతో ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అయితే అనేక ఇతర దేశాల్లో ఉండే పోస్టల్ బ్యాలెట్ విధానం ఇక్కడ లేకపోవడంతో, విదేశాల్లో ఉన్న పౌరులకు ఓటు వేసే అవకాశం ఉండదు. పోలింగ్ పూర్తయిన తర్వాత నవంబర్ 4 నాటికి అధికారిక ఫలితాలు వెలువడనున్నాయి.

అభ్యర్థికి కాకుండా పార్టీల జాబితాకే ఓటు!
ఇజ్రాయెల్ ఎన్నికల ప్రక్రియ చాలా వినూత్నంగా ఉంటుంది. ఇక్కడ ప్రజలు ఏ ఒక్క అభ్యర్థికి నేరుగా ఓటు వేయరు. ప్రతి పార్టీ తమ అభ్యర్థుల సీనియారిటీ ఆధారంగా ఒక ప్రాధాన్యత జాబితాను తయారు చేసి ఓటర్ల ముందుకు తెస్తుంది. పౌరులు ఆ పార్టీ జాబితాకే తమ ఓటును గుద్దుతారు. దేశవ్యాప్తంగా వచ్చినా మొత్తం చెల్లుబాటు అయ్యే ఓట్లలో కనీసం 3.25 శాతం ఓట్ సాధించిన పార్టీలకే పార్లమెంట్‌లో అడుగుపెట్టే అర్హత లభిస్తుంది. ఈ సారి దాదాపు 10 పార్టీలు ఈ కనీస ఓట్ల శాతాన్ని దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
మ్యాజిక్ ఫిగర్ 61.. ప్రభుత్వ ఏర్పాటుకు అసలైన కసరత్తు
ఇజ్రాయెల్ రాజకీయ చరిత్రలో ఏ ఒక్క రాజకీయ పార్టీకి కూడా సొంతంగా స్పష్టమైన మెజారిటీ సాధించిన దాఖలాలు లేవు. ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే కనీసం 61 పార్లమెంట్ స్థానాల మద్దతు తప్పనిసరి. అందుకే ఇక్కడ "ఏ పార్టీ మొదటి స్థానంలో నిలిచింది" అనే దానికంటే "ఎవరు 61 మంది సభ్యుల మద్దతును కూడగట్టగలరు" అనేదే అత్యంత కీలకంగా మారుతుంది. ఫలితాలు వచ్చిన ఏడు రోజుల్లోగా అధ్యక్షుడు ప్రజాప్రతినిధులతో సమావేశమై, ఎక్కువ స్థానాలు గెలుచుకున్న నాయకుడిని ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానిస్తారు. ఆ నేతకు సంకీర్ణ కూటమిని ఏర్పాటు చేయడానికి 28 రోజుల సమయం ఇస్తారు. ఒకవేళ ఆ ప్రయత్నం విఫలమైతే మరో 14 రోజులు పొడిగిస్తారు. అయినా ఫలితం లేకపోతే రెండో నేతకు అవకాశం ఇస్తారు. 2019 నుంచి ఇప్పటివరకు దేశం ఏకంగా ఆరోసారి ఎన్నికలకు వెళ్లడానికి ఈ మ్యాజిక్ ఫిగర్ సమీకరణాలే ప్రధాన కారణం.
బరిలో నిలిచిన దిగ్గజ నాయకులు.. హోరాహోరీ పోరు!
ఈ ఎన్నికల్లో ప్రధాన పోటీదారుగా ఉన్న 75 ఏళ్ల ప్రధాని బెంజిమన్ నెతన్యాహును ఆయన మద్దతుదారులు "కింగ్ బీబీ" అని పిలుచుకుంటారు. అయితే గాజా యుద్ధ నేరారోపణలు, దేశంలో ఎదుర్కొంటున్న అవినీతి కేసులు, అక్టోబర్ 7 దాడి తర్వాత భద్రతా వ్యవస్థపై వచ్చిన విమర్శలు ఆయనకు ప్రతికూలంగా మారాయి. ఆర్థోడాక్స్ యూదు పార్టీలపై ఆయన ఎక్కువగా ఆధారపడటం కూడా సాధారణ పౌరుల్లో అసంతృప్తిని పెంచింది.
మరోవైపు నెతన్యాహుకు ప్రధాన ప్రత్యర్థిగా, మాజీ మిలిటరీ చీఫ్ గాడీ ఐసెన్‌కోట్ నాయకత్వంలోని కొత్త మధ్యస్థ పార్టీ 'యాషార్' శరవేగంగా పుంజుకుంది. గాజా యుద్ధంలో తన సొంత కుమారుడిని కోల్పోయిన ఐసెన్‌కోట్, సైనిక అనుభవాన్ని, త్యాగాన్ని ఆయుధంగా చేసుకుని ప్రచారం సాగించారు. వీరితో పాటు మాజీ ప్రధాని నఫ్తాలీ బెన్నెట్, యాయైర్ లాపిడ్ నేతృత్వంలోని 'టుగెదర్' కూటమి, మాజీ రక్షణ మంత్రి అవ్గిడోర్ లీబర్‌మాన్ కి చెందిన 'ఇజ్రాయెల్ అవర్ హోమ్' పార్టీ, యాయైర్ గోలాన్ నేతృత్వంలోని 'ది డెమోక్రాట్స్' కూడా రేసులో గట్టి పోటీ ఇస్తున్నాయి. ఇవే కాకుండా దేశంలోని 20 శాతం ఉన్న అరబ్ మైనారిటీలకు ప్రాతినిధ్యం వహించే రామ్, జాయింట్ లిస్ట్ వంటి పార్టీల మద్దతు కూడా ఈ సారి ప్రభుత్వాన్ని తీర్చిదిద్దడంలో కీలకం కానుంది.














Click it and Unblock the Notifications
