ఐక్యరాజ్య సమితి అత్యవసర భేటీలో భారత్ వైఖరి అనూహ్యం..!!
వాషింగ్టన్: ఇజ్రాయెల్- పాలస్తీనా మధ్య ఆరంభమైన యుద్ధం రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతోంది. మరింత విస్తరిస్తోంది. పొరుగు దేశాలకూ పాకింది. పాలస్తీనియన్ ఇస్లామిక్ జిహాద్, హమాస్ ఉగ్రవాదుల స్థావరాలనపై ఇజ్రాయెల్ పెద్ద ఎత్తున విరుచుకుపడుతోంది. రాకెట్లను సంధిస్తోంది. గాజా స్ట్రిప్‌పై బాంబుల వర్షాన్ని కురిపిస్తోంది.
గత శనివారం ఆరంభమైందీ యుద్ధం. ఈ వారం రోజుల వ్యవధిలో పెద్ద ఎత్తున ప్రాణ, ఆస్తినష్టం సంభవించింది. ఇజ్రాయెల్- హమాస్ పరస్పర దాడుల్లో ఇప్పటికి 6,700 మందికి పైగా మరణించారు. అదే స్థాయిలో వేలాదిమంది గాయపడ్డారు. లక్షలాదిమంది నిరాశ్రయులయ్యారు. దాడులు తీవ్రతరమౌతోన్న కొద్దీ మృతుల సంఖ్య పెరుగుతూ వస్తోంది.

తొలుత ఇజ్రాయెల్- పాలస్తీనా సరిహద్దు వెంబడి గాజా సమీప ప్రాంతాల నుంచి హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్‌పై రాకెట్లతో దాడులు చేశారు. సరిహద్దులను దాటుకుని ఇజ్రాయెల్ భూభాగంపైకి చొచ్చుకుని వచ్చారు. సరిహద్దులకు ఆనుకుని ఉన్న పలు ప్రాంతాలను తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు.
దీనితో ఇజ్రాయెల్ సైన్యం ఎదురుదాడికి దిగింది. ఆపరేషన్ ఐరన్ స్వోర్డ్‌ను ప్రకటించింది. గాజాలోని హమాస్ స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది. వైమానిక దాడులతో నిప్పులు కురిపిస్తోంది. ఎలాంటి కవ్వింపు చర్యలు లేకుండా, శాంతియుత వాతావరణానికి భంగం వాటిల్లేలా హమాస్ వ్యవహరిస్తోందని, దాడులకు పాల్పడిన తీవ్రమైన నేరానికి పాల్పడిందని ఇజ్రాయెల్ హెచ్చరించింది.
ఈ యుద్ధంపై ఐక్యరాజ్యసమితి తాజాగా ఓటింగ్ నిర్వహించింది. మానవతా దృక్పథంతో సంధి కుదర్చాలనే ప్రతిపాదనలపై ఈ ఓటింగ్ ప్రక్రియను చేపట్టింది. జోర్డాన్ రూపొందించిన ప్రతిపాదనలు అవి. గాజా స్ట్రిప్‌లో నివసిస్తోన్న వారికి మానవత దృక్పథంతో సహాయం అందించడం, వారికోసం ప్రత్యేకంగా కారిడార్‌ను ఏర్పాటు చేయడం.. వంటి అంశాలు ఇందులో ఉన్నాయి.

దీనిపై నిర్వహించిన ఓటింగ్‌లో మొత్తం 179 సభ్య దేశాలు పాల్గొన్నాయి. ఈ ప్రతిపాదనలకు అనుకూలంగా 120 దేశాలు ఓటు వేశాయి. 14 దేశాలు వ్యతిరేకించాయి. 45 దేశాలు ఓటింగ్‌లో పాల్గొనలేదు. దూరంగా ఉన్నాయి. ఈ 45 దేశాల్లో భారత్ కూడా ఒకటి. కెనడా, ఆస్ట్రేలియా, జర్మనీ, జపాన్, ఉక్రెయిన్, బ్రిటన్.. ఓటింగ్‌లో పాల్గొనలేదు.
ఈ ఓటింగ్‌కు భారత్.. దూరం కావడానికి కారణాలు లేకపోలేదు. ఇజ్రాయెల్‌పై తొలుత రాకెట్ దాడులకు దిగిన హమాస్ మిలిటెంట్ గ్రూప్‌ను టెర్రరిస్టులుగా గుర్తించకపోవడం పట్ల భారత్ అభ్యంతరం వ్యక్తం చేసింది. హమాస్ గురించి ఎలాంటి ప్రస్తావన ఇందులో లేకపోవడాన్నీ తప్పు పట్టింది.
అదే సమయంలో- కెనడా చేసిన సవరణలను భారత్ సమర్థించింది. ఇజ్రాయెల్‌పై హమాస్ ఉగ్రవాదుల దాడులు.. అనే వాక్యాన్ని ఈ ప్రతిపాదనల్లో చేర్చాలంటూ కెనడా సవరణలను సూచించింది. దీన్ని భారత్ సమర్థించింది. ఈ సవరణలు చేయగలిగితే తాము ఓటింగ్‌లో పాల్గొంటామని ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ఉప ప్రతినిధురాలు యోజనా పటేల్ తెలిపారు.
హమాస్, వారి చెరలో బందీలు.. అనే పదాలను జోర్డాన్ రూపొందించిన డ్రాఫ్ట్‌లో చేర్చాలనేది కెనడా డిమాండ్. కెనడా ప్రతిపాదించిన ఈ సవరణలను ఇందులో చేర్చడానికి ఓటింగ్ సైతం నిర్వహించింది ఐరాస. దీనికి అనుకూలంగా భారత్ సహా 87 దేశాలు ఓటు వేశాయి. మూడింట రెండొంతుల మెజారిటీ లేకపోవడంతో ఇది ఆమోదం పొందలేకపోయింది.












Click it and Unblock the Notifications