టెహ్రాన్ లో మిస్సైళ్ల విలయం- ఏకంగా ఇరాన్ రక్షణ శాఖ హెడ్ క్వార్టర్ ధ్వంసం
గాజాలో హమాస్, లెబనాన్‌లో హెజ్బొల్లా మిలిటెంట్ గ్రూపులపై వరుసబెట్టి దాడులు సాగిస్తూ వచ్చిన ఇజ్రాయెల్ మరో అడుగు ముందుకేసింది. ఇప్పుడు తాజాగా ఇరాన్ ను లక్ష్యంగా చేసుకుంది. ఏకంగా ఆ దేశ ప్రధాన టెహ్రాన్ పై విరుచుకుపడుతోంది. వైమానిక దాడులను సాగిస్తోంది. మిస్సైళ్లతో విధ్వంసాన్ని సృష్టిస్తోంది.
రెండున్నర సంవత్సరాలుగా ప్రతీకారదాడులతో ఏడాదిన్నర కాలంగా మధ్య తూర్పు దేశాలు భగ్గుమంటోన్న విషయం తెలిసిందే. రోజుల తరబడి దాడులు ప్రతిదాడులు కొనసాగుతోన్నాయి. ఈ రీజియన్ చల్లారట్లేదు. ఇజ్రాయెల్, గాజా, లెబనాన్ రోజూ పరస్పర దాడులకు దిగుతోన్నాయి.

ఇప్పుడు ఇజ్రాయెల్.. ఇరాన్ ను లక్ష్యంగా చేసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ దాడులకు Raising Lion అని పేరు పెట్టింది. గురువారం అర్ధరాత్రి దాటిన తరువాత తొలి దాడి చోటు చేసుకుంది. జనావాసాలను కూడా లెక్కపెట్టట్లేదని ఇరాన్ మీడియా తెలిపింది.
ఈ దాడుల్లో- అత్యంత శక్తిమంతమైన ఇస్లామిక్ రివాల్యూషనరీ గార్డ్ చీఫ్ హొస్సేన్ సలామీ మరణించినట్లు తెలుస్తోంది. అలాగే న్యూక్లియర్ సైంటిస్ట్ కూడా దుర్మరణం పాలైనట్లు టస్మిన్ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. ఇరాన్ అణ్వాయుధ డిపోలు, సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది టస్మిన్ న్యూస్ ఏజెన్సీ పేర్కొంది.
తాజాగా- ఇరాన్ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యాలయంపై మిస్సైళ్లను సంధించింది ఇజ్రాయెల్. ఆయిల్ డిపోలపైనా బాంబుల వర్షాన్ని కురిపించింది. టెహ్రాన్‌లో అణ్వాయుధ కార్యకలాపాలకు సంబంధించిన అన్ని ప్రదేశాలను లక్ష్యంగా చేసుకున్నట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ వెల్లడించింది.
ఈ దాడుల్లో ఆర్గనైజేషన్ ఆఫ్ డిఫెన్సివ్ ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ (SPND) భవన సముదాయం సైతం ధ్వంసమైంది. ఇరాన్ అణ్వాయుధ కార్యకలాపాలకు ఇది ప్రధాన కేంద్రం. దీన్ని అమద్ ప్రాజెక్ట్ గా పిలుస్తారు. తాజా దాడుల్లో ఇరాన్ రక్షణ మంత్రిత్వ శాఖ, SPND న్యూక్లియర్ ప్రాజెక్టు ప్రధాన కార్యాలయాలు దెబ్బతిన్నట్లు ఐడీఎఫ్ వెల్లడించింది.
ఇప్పటికే ఇరాన్ న్యూక్లియర్ సిటీ నటాంజ్ విధ్వంసానికి గురైంది. నటాంజ్ సిటీలోని అణు మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని దాడులు సాగించింది ఇజ్రాయెల్. అలాగే ఫోర్డో, టెహ్రాన్ చుట్టూ ఉన్న ఇతర వ్యూహాత్మక ప్రదేశాలనూ తుత్తునీయలు చేసింది. ఈ ఆపరేషన్‌లో 200కు పైగా వార్ ఎయిర్ క్రాఫ్ట్ లను వినియోగించింది.












Click it and Unblock the Notifications