హైదరాబాద్ లోకి ఐమాక్స్ రీ ఎంట్రీ.. ఆ రోజే ముహూర్తం.. తొలి సినిమా ఇదే..
హైదరాబాద్ విశ్వ నగరంగా మారుతోంది. అన్ని రంగాల్లోనూ గణనీయమైన అభివృద్ధిని సాధిస్తోంది. ఇక ఇప్పటికే తెలుగు చిత్ర పరిశ్రమ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. వరుసగా పాన్ ఇండియా చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా టాలీవుడ్ మారింది. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రంతో ఏకంగా ఆస్కార్ అవార్డ్ ను కూడా కైవసం చేసుకుని తెలుగు చిత్ర పరిశ్రమ సత్తా ప్రపంచానికి చాటి చెప్పింది. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో ఒక్క ఐమాక్స్ స్క్రీన్ కూడా లేకపోవడం చాలా వెలితిగా అనిపించేది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 36 ఐమాక్స్ స్క్రీన్ లు ఉన్నాయి. అత్యధికంగా ముంబైలో ఏడు, నేవీ ముంబైలో ఒకటి, థానేలో ఒకటి ఉన్నాయి. ఇక దిల్లీ ప్రాంతంలో మొత్తం 8 ఉన్నాయి.
అలాగే బెంగళూరులో మొత్తం 6 ఐమాక్స్ స్క్రీన్ లు ఉన్నాయి. అలాగే చెన్నై లో 3 ఉన్నాయి. ఇక దేశవ్యాప్తంగా మరికొన్ని కీలక నగరాల్లో ఒక్కొక్కటి చొప్పున ఐమాక్స్ స్క్రీన్ లు ఉన్నాయి. అయితే అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన హైదరాబాద్ లో మాత్రం ఒక్క ఐమాక్స్ స్క్రీన్ లేకపోవడం సినీ ప్రేక్షకులను తీవ్ర నిరాశకు గురి చేసింది. ఈ క్రమంలో తాజాగా హైదరాబాద్ లో ఐమాక్స్ స్క్రీన్ త్వరలోనే అందుబాటులోకి రానుంది. 2015 లో ప్రసాద్స్ లో ఐమాక్స్ ఫార్మాట్ నిలిచిపోయింది. దాంతో అప్పటినుంచి నగరవాసులకు ఐమాక్స్ అనుభూతి కరువైంది. అయితే అప్పటినుంచి హైదరాబాద్ లో ఐమాక్స్ ఎప్పుడెప్పుడు వస్తుందా..? అని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వారికి గుడ్ న్యూస్ అందింది.

హైదరాబాద్ మహానగరంలో దాదాపు పదకొండేళ్ల తర్వాత ఐమాక్స్ సందడి చేయనుంది. ఇక సినిమాలకు అడ్డాగా ఉన్న ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని ఐకానిక్ సుదర్శన్ 70ఎంఎం థియేటర్ స్థలంలో ప్రస్తుతం ఏఎంబీ విక్టరీ సినిమాస్ పేరుతో భారీ మల్టీప్లెక్స్ సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఈ భారీ ప్రాజెక్టు ఏషియన్ సినిమాస్, మహేష్ బాబు, వెంకటేశ్ భాగస్వామ్యంతో నిర్మాణమవుతోంది. ఇందులో మొత్తం ఏడు స్క్రీన్స్ అందుబాటులో ఉండనున్నాయి. అయితే ఈ మల్టీప్లెక్స్ లో ఒక ఐమాక్స్ విత్ లేజర్ స్క్రీన్, ఒక 4 డీఎక్స్ స్క్రీన్ తో పాటు మరో ఐదు సాధారణ స్క్రీన్లు ఉండనున్నట్లు సమాచారం. ఇక ఈ ఏడాది డిసెంబర్ 18 న ఈ మల్టీప్లెక్స్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. అంతేకాక ప్రముఖ హాలీవుడ్ ఫిల్మ్ డూన్ పార్ట్ 3 ఈ థియేటర్ లో ప్రదర్శించే తొలి సినిమా కానుందని సమాచారం. మరోవైపు హైదరాబాద్ లోని హకీంపేటలో కూడా ఏఎంబీ సినిమాస్ కు చెందిన మరో ఐమాక్స్ స్క్రీన్ ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications
