ఏం పొడుస్తాడో చూస్తాం.. ట్రంప్ ఇంకా అడల్ట్‌గా ఎదగాలి: జో బిడెన్
ట్రంప్ ఇంకా ఎదగాల్సి ఉందని, అడల్ట్ గా పరిణితి చెందాల్సి ఉందని జోబిడెన్ పేర్కొనడం గమనార్హం.
వాషింగ్టన్: అమెరికా 45వ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ఉద్దేశిస్తూ పలు విమర్శలు గుప్పించారు ఉపాధ్యక్షుడు జోబిడెన్. గురువారం నాడు ఓ టీవి చానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో.. జోబిడెన్ ట్రంప్ వ్యవహార శైలిపై మండిపడ్డారు.
ముఖ్యంగా ఇంటలిజెన్స్ ఏజెన్సీల పనితీరుపై ట్రంప్ బాహాటంగా నోరు పారేసుకోవడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. నోరుంది కదాని.. తోచిందల్లా ట్విట్టర్ లో రాసేయడం సరికాదని హితవు పలికారు. ఇంటలిజెన్స్ సంస్థలపై అనుమానాలను వ్యక్తం చేయడం పిచ్చి చర్య అని.. అది ఎంతటి ప్రమాదకరమో ట్రంప్ కు తెలిసిరావట్లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.

ట్రంప్ ఇంకా ఎదగాల్సి ఉందని, అడల్ట్‌గా పరిణితి చెందాల్సి ఉందని జోబిడెన్ పేర్కొనడం గమనార్హం. అమెరికా అధ్యక్షుడిగా చట్టాలు, శాసనాలు చేయడమనే బాధ్యత ట్రంప్‌పై ఉందన్న విషయాన్ని ఆయన గుర్తుంచుకోవాల్సి ఉందని అన్నారు. 'ఇప్పుడింతలా మాట్లాడుతున్న ట్రంప్.. రేప్పొద్దున గద్దెనెక్కిన తర్వాత ఏం పొడుస్తాడో మేమూ చూస్తాం!' అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాగా, ఇటీవలే ఇంటలిజెన్స్ సంస్థల పనితీరుపై ట్విట్టర్ వేదికగా ట్రంప్ విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. అమెరికన్ ఎన్నికల్లో విజయం తర్వాత ఫెడరల్ ప్రభుత్వ నిర్ణయాలపై కూడా ఆయన పలు వ్యతిరేక వ్యాఖ్యలు చేశారు.












Click it and Unblock the Notifications