రష్యా సైన్యం చేతిలోకి ఖేర్సన్ నగరం - కీవ్ స్వాధీనం దిశగా : భారత్ కు రెండు విమానాలు..!!
ఉక్రెయిన్ నగరాలపైన రష్యా సైన్యం విరుచుకుపడుతోంది. ఉక్రెయిన్ లో రెండో పెద్ద నగరమైన ఖేర్సన్ ను రష్యా సైన్యం ఆక్రమించింది. ఖేర్సన్ లో భారీ విధ్వంసం చేసింది. ఆ నగరంలోని సిటీ కౌన్సిల్ బిల్డింగ్ ను రష్యా సైతం స్వాధీనం చేసుకుందని నగర మేయర్ వెల్లడించారు. ఖేర్సన్ నగరాన్ని రష్యా హస్తగతం చేసుకున్నట్లు ఉక్రెయిన్ ధ్రువీకరించింది. ఈ మేరకు ఏఎఫ్‌పీ నివేదించింది.ఉక్రెయిన్ రాజధాని కీవ్వైపు వేగంగా పయనిస్తోంది రష్యా సైన్యం. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ అప్రమత్తమైంది.

ఉక్రెయిన్ నగరాలే టార్గెట్ గా
కీవ్, కీవ్ ఒబ్లాస్ట్, లవీవ్, మైకొలివ్, చెర్నిహివ్, ఒడేసా సహా పలు ప్రాంతాల్లో వైమానిక దాడులు జరిగే అవకాశముందని హెచ్చరించింది. భారత రాయబార కార్యాలయ అధికారులు హెచ్చరించినట్లుగా కీవ్ నగర స్వాధీనానికి రష్యా సైన్యం వేగంగా ముందుకు కదులుతోంది. కీవ్‌లోని డ్రుబీ నరోదివ్ మెట్రో స్టేషన్ సమీపంలో రెండు భారీ పేలుళ్లు సంభవించినట్లు ఉక్రెయిన్ స్థానికులు చెబుతున్నారు. ఇక, ఆపరేషన్ గంగలో భాగంగా.. 400 మందికి పైగా భారతీయులను వాయుసేనకు చెందిన విమానాల్లో స్వదేశానికి తరలించారు. ఇప్పటికే కీవ్ సహా ఖర్కివ్ నగరాల నుంచి భారతీయుల్ని తక్షణమే వెళ్లిపోవాలని కేంద్రం హెచ్చరించింది.

బాంబు మోతలతో భయానకంగా
ఆపరేషన్ గంగలో భాగంగా.. భారత పౌరుల్ని వేగంగా తరలిస్తోంది కేంద్రం.భారత వాయుసేనకు చెందిన రెండు సీ-17 ఎయిర్‌క్రాఫ్ట్‌లు.. 220,208 మంది చొప్పున భారతీయుల్ని తీసుకొచ్చాయి. దిల్లీ హిందన్ ఎయిర్‌బేస్ సమీపంలో ల్యాండయ్యాయి. మరిన్ని చర్చలకు సన్నద్ధంగా ఉన్నట్లు చెబుతూనే దురాక్రమణ యత్నాలను రష్యా కొనసాగిస్తుండడాన్ని అమెరికా సహా ప్రపంచ దేశాలు తప్పుపడుతున్నాయి. దీనికి తగిన మూల్యాన్ని రష్యా చెల్లించుకోకపోతే అది ఒక్క ఉక్రెయిన్ ఆక్రమణతో ఆగిపోదని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హెచ్చరించారు.

నేడు చర్చలకు ఛాన్స్
ఇక, బెలారస్ ప్రాంతంలో మరో సారి ఈ రోజు చర్చలు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. తొలి విడత చర్చల్లో ఎటువంటి ఫలితం రాకుండానే ముగిసాయి. ఈ చర్చల్లో ఆ ప్రతిష్ఠంబన తొలిగించే ప్రయత్నాలు జరుగుతాయని ప్రపంచ దేశాలు ఆసక్తిగా చూస్తున్నాయి. అయితే, యుద్దం రెండో వారంలోకి ప్రవేశించింది. కానీ, రష్యా సేనలు ఉక్రెయిన్ నగరాల పైన గురి పెట్టాయి. ప్రతిఘటించేందుకు ఉక్రెయిన్ ప్రయత్నిస్తున్నా.. బాంబుల మోతతో ఉక్రెయిన్ దద్దరిల్లుతోంది.












Click it and Unblock the Notifications